జూన్‌ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి | PM Modi target given to the four state projects | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి

Published Sun, Apr 2 2017 3:22 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

జూన్‌ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి - Sakshi

జూన్‌ నాటికి నాలుగు ప్రాజెక్టులు పూర్తి కావాలి

- దేవాదుల, రాజీవ్‌ భీమా, ఎస్సారెస్పీ–2,మత్తడివాగు ప్రాజెక్టులపై కేంద్రం
- ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వాలని ఆదేశం
- పీఎంకేఎస్‌వై కింద ఈ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు
- ఇటీవలే కేంద్ర జల వనరుల శాఖతో  సమీక్షించి టార్గెట్లు పెట్టిన ప్రధాని మోదీ


సాక్షి, హైదరాబాద్‌: ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై)కింద సాయం పొందుతున్న 4 రాష్ట్ర ప్రాజెక్టులను జూన్‌లోగా పూర్తి చేయాలని కేంద్రం డెడ్‌లైన్‌ పెట్టింది. దేవాదుల, రాజీవ్‌ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులను పూర్తి చేసి కచ్చితంగా ఖరీఫ్‌లో నిర్ణీత ఆయకట్టుకు నీరిందించాలని ఆదేశించింది. పీఎంకేఎస్‌వై పథకం కింద దేశంలో 99 సాగు నీటి ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తోంది. అందులో ఈ ఏడాది జూన్‌ నాటికి 21 ప్రాజెక్టులు పూర్తి చేయాలని, 5.22లక్షల హెక్టార్లకు నీరందించాలని గత నెల 30న జరిగిన సమీక్ష సందర్భంగా ప్రధాని మోదీ కేంద్ర జల వనరుల శాఖను ఆదేశించారు. ఆ 21 ప్రాజెక్టుల్లో తెలంగాణకు చెందిన నాలుగు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పనుల పూర్తికి నీటి పారుదల శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది 4.. వచ్చే ఏడాది 6: పీఎంకేఎస్‌వై కింద రాష్ట్రంలోని కుమ్రం భీం, గొల్లవాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులను గుర్తించారు. వాటి నిర్మాణం కోసం మొత్తంగా రూ.25,027 కోట్లతో అంచనాలు రూపొందించగా.. రూ.17,357.35 కోట్లు ఖర్చు చేశారు. రూ.7,669.65 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం కేంద్రాన్ని సంప్రదించిన రాష్ట్రం ఏఐబీపీ కింద నిధులు సమకూ ర్చాలని కోరింది. సానుకూలంగా స్పందించిన జల వనరుల శాఖ రూ.1,196 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. 2016–17లో రూ.537.65 కోట్లు విడుదల చేసింది. మిగతా నిధులు అందాల్సి ఉంది. ఈ 11 ప్రాజెక్టుల్లో దేవాదుల, రాజీవ్‌ భీమా, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు ప్రాజెక్టులు జూన్‌ నాటికి పూర్తవాల్సి ఉండగా.. గొల్లవాగు, జగన్నాథ్‌పూర్‌ పెద్దవాగు, పాలెంవాగు, కుమ్రం భీం, ర్యాలివాగు, నీల్వాయి ప్రాజెక్టులు వచ్చే ఏడాది పూర్తి కావాల్సిన జాబితాలో ఉన్నాయి. వరద కాల్వ పనులు 2019 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.

11 లక్షల ఎకరాలకు నీరు..
ఈ ఏడాది జూన్‌ నాటికి నిర్ణయించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే గరిష్టంగా 11 లక్షల ఎకరాల మేర ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే లక్ష్యం మేర ప్రాజెక్టులు పూర్తవ్వాలంటే భూసేకరణ ప్రక్రియ వేగిరం చేయడం, పునరావా స కార్యక్రమాలను పూర్తి చేయడం వంటివి యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉంది. దేవాదుల ప్రాజెక్టుకు 14,965 హెక్టార్ల భూమి అవసరం ఉండగా.. 10,428 హెక్టార్లు సేకరించారు. మిగతా 4,267 హెక్టార్లను సేకరించాల్సి ఉంది. ఇక వరద కాల్వ పనులకు అడ్డంకిగా మారిన జాతీయ రహదారి క్రాసింగ్‌ పనులను, భీమా, కుమ్రం భీం ప్రాజెక్టుల్లో మిగిలిపోయిన భూసేకరణను వేగిరం చేసి, పనులు సత్వరం పూర్తి చేయాల్సి ఉంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ అంశాలపై దృష్టి సారించి పనుల వేగిరానికి నడుం బిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement