ప్రతీకాత్మక చిత్రం
ఏ ప్రభుత్వానికైనా ఆబ్కారి ఆదాయం ముఖ్యమైందే. తెలుగు రాష్ట్రాల్లో కల్లుగీత అనుమతులు, అమ్మకాలు మొదట్లో వేలం ద్వారా జరిగేవి. తర్వాత కల్లుగీత సహకార సంఘాలు ఏర్పాటుచేసారు. అవి కూడా సక్రమంగా పని చేయడం లేదని వాటిని కుదించి దున్నే వాడికే భూమి అన్నట్లుగా గీసేవాడికే చెట్టు Tree for Tapper అన్నారు.
పథకం ఏదైనా, ఏ పార్టీ అధికారం లోనున్నా ప్రభుత్వ ఆదాయం దెబ్బతినకుండా చూసే పని చేసేది ఎక్సైజ్ శాఖ, వాళ్ళ పనితీరుకు అదే గీటురాయి. ప్రభుత్వ ఖజానా నిండినంత కాలం ఆ శాఖ అవినీతి గురించి పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అబ్కారి శాఖలో మామూళ్లు మామూలే! కాదు కూడదు అంటే తప్పు చేసినా చేయకున్నా కల్తీకల్లు కేసులు తప్పవని గీత కార్మికులకు తెలుసు.
హైదరాబాద్ నగర శివార్లలో ముఖ్యంగా దూల్ పేట ప్రాంతంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ, అమ్మకాలు జరిగిన రోజుల్లో తమ కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని గీత సంఘాలు రోడ్డెక్కిన రోజుల్లో మాచర్ల జగన్నాధం గారి' పరిశ్రమ' పత్రికలో ' కల్తీ సారా కల్పతరువు రాజధానిలో దూల్ పేట ' పేర నేనొక వ్యాసం రాస్తూ అబ్కారి శాఖ, స్థానిక పోలీస్ సిబ్బంది అవినీతి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.
అది 22 అక్టోబర్ 1974 సంచికలో ప్రచురితమై, అంచెలంచెలుగా ఆనాటి ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లోనున్న అధికారులు అనధికారుల దృష్టిలో పడి చివరికి విచారణకు దారితీసింది. నేనా రోజుల్లో హైదరాబాద్ లోని ఒక సహకార సంస్థలో ఉద్యోగం చేస్తూ చాదర్ ఘాట్ ప్రాంతంలో ఉండేవాణ్ణి. తెల్లవారక ముందే ఒక పోలీస్ జవాన్ నన్ను వెతుక్కుంటూ వచ్చి గిట్టనివాడు గుడ్ మార్నింగ్ చెప్పినట్టు నాకు సమ్మన్స్ ఇచ్చి పోలీస్ కమీషనర్ స్థాయి అధికారి ముందు హాజరు కమ్మని చెప్పి వెళ్ళాడు.
నేను అద్దెకుంటున్న ఇంటి యజమానే కాదు కొత్తగా కాపురానికి వచ్చిన మా ఆవిడ కూడా భయపడిపోయింది నేనేం నేరం చేసానో? అని. నిజం చెప్పాలంటే నేనూ గాబరాపడిపోయాను, ఎందుకంటే అవి ఎమర్జెన్సీ రోజులు. కేంద్రంలో ఇందిరా గాంధి రాష్ట్రంలో జలగం వెంగలరావు గారల పాలన నడుస్తున్న కాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట మాట్లాడినా జైలుకూడు తినాల్సిన పరిస్థితులు.
ఎందుకైనా మంచిదని సలహా కోసం ముందుగా పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఒక బంధువు దగ్గరికి వెళ్ళాను. అతను అంతా విని 'అబ్కారి శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది, పోలీస్ ప్రభుత్వ పీఠాలను కాపాడుతుంది. ఈ రెండు శాఖలను విమర్శించడానికి మీకు ఎన్ని గుండెలండీ 'అన్నాడు. నాకున్న ఒక్క గుండె అయన మాటలతో దడదడలాడిపోయింది.
'లాభంలేదు, ఎవరన్నా లీడర్ను తీసుకొని వెళ్ళండి, రోజులు బాగాలేవు! 'అని చివరగా సలహా కూడా ఇచ్చి పంపాడు. అసలు నాయకులే లేని రోజులవి, ఉన్నవాళ్లు జైలు ఊచలు లెక్కబెడుతున్నారాయె. అధికారి మంచివాడైతే ఆయనే అర్థం చేసుకుంటాడని పోలీస్ కమీషనర్ గారి కార్యాలయంలో ఒక్కణ్ణే విచారణకు హాజరయ్యాను. ఆయనో యువఅధికారి, అదృష్టవశాత్తు సౌమ్యుడు కూడా.
ఒక ఫైల్ తీసి నా ముందు పెట్టాడు. అందులో దూల్ పేట గుడుంబా వ్యాసమే కాకుండా అదే పరిశ్రమ పత్రికలో నేను రాసిన 'దేశ రాజధానిలో నల్లమందు వ్యాపారం విచ్చలవిడి (ఆనంద ఉగాది సంచిక )' మత్తు పదార్థాలకు బానిసలవుతున్న మన విద్యార్థులు (18జూన్ 1974 సంచిక ), పోలీసులను దొంగలుగా మారుస్తున్న తమిళనాడు ప్రోహిభిషన్ చట్టం (31డిసెంబర్ 1974 సంచిక )కాక మరో మూడు వ్యాసాల పేపర్ కటింంగ్స్ ఉన్నాయి.
' మీరు హైదరాబాద్ లో ఉన్నారు, దూల్ పేట వ్యాపారం గురించి తెలిసుండొచ్చు, గీత కార్మికుల కుటుంబం నుండి వచ్చారు, కల్లు గురించి రాసుంటారు కానీ డ్రగ్స్ గురించి ఎలా రాస్తున్నారు?' అన్నాడాయన. జాతీయ స్థాయి పత్రికల్లో వచ్చిన వార్తలే నా వ్యాసాలకు ఆధార మన్నాను. 'చట్ట సభల్లో ప్రభుత్వ అవినీతి గురించి ప్రజా ప్రతినిధులు ఎన్ని ఆరోపణలు చేసినా వాళ్లకు రక్షణ ఉంటుంది,కానీ జర్నలిస్ట్ రచనలు పక్కా ఆధారాలు లేందే రాస్తే ఇబ్బందుల్లో పడతారు 'అన్నాడు.
నిజమే కానీ జర్నలిస్టులు పూర్తి స్థాయి దర్యాప్తు చేయలేరు కదా! వాళ్ళిచ్చిన క్లూను ప్రభుత్వం వాడుకొని సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు బయటికొస్తాయి అన్నాను నేను. ' మీ వ్యాసల్లోనున్న సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విచారణ ను ఇంతటితో ముగిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని పిలిపించే అవసరం రాకుండా చూసుకొండి 'అన్నాడు. నేను బతుకుజీవుడా! అని బయట పడ్డాను.
-వేముల ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment