ఒకరి మృతి: 29 మందికి అస్వస్థత
అనంతగిరి: కల్తీ కల్లు తాగి ఒక వ్యక్తి మృతి చెందగా, మరో 29 మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాలివి. వికారాబాద్ జిల్లా పీరంపల్లిలోని ఒక దుకాణంలో 19వ తేదీ సోమవారం సాయంత్రం కల్లు తాగిన వారిలో.. ఎనిమిది మంది మంగళవారం వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధి తులను వారి కుటుంబ సభ్యులు వికారాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించగా అర్ధరాత్రి తర్వాత దుర్గయ్య అనే వ్యక్తి మృతి చెందారు.
అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయాన్నే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. శిబిరానికి వచ్చిన మరో 22 మంది పరిస్థితి బాగా లేకపోవడంతో వికారాబాద్‌కు తరలించారు. వీరిలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. బాధితుల్లో ప్రస్తుతం 15 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారు డిశ్చార్జి అయ్యారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రవి, పీహెచ్‌సీ వైద్యుడు సుధాకర్‌రెడ్డి గ్రామంలో పర్యటించారు.
బాధితుల ఇళ్లు, నీటి ట్యాంకులను పరిశీలించారు. నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. కాగా, ఈ ఘటనపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో పాటు స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించారు. కల్తీ లక్షణాల్లేవని ఆ శాఖ సీఐ రాగవీణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment