యాదగిరిలో ఎస్‌ఐ పరశురాం మృతి
ఎమ్మెల్యేకు డబ్బులిచ్చి మోసపోయాడని భార్య ఆరోపణ
రాయచూరు రూరల్: యాదగిరి నగర పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ పరశురాం (29) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు ఆందోళన చేశారు. వివరాలు... యాదగిరి ఎస్‌ఐగా పనిచేస్తున్న పరశురాం ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. రాత్రి ఆయనకు అందరూ సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఇంటికి వెళ్లి నిద్రించిన ఆయన నిద్రలోనే చనిపోయారు. మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్పీ సంగీత ఆయన మృతదేహాన్ని పరిశీలించారు.
ఎమ్మెల్యేకు రూ. 30 లక్షలు ఇచ్చాం: భార్య
పరశురాం భార్య శ్వేత మీడియాతో మాట్లాడారు. తన భర్త పరశురాం బదిలీ కోసం ఓ ఎమ్మెల్యేకు డబ్బులు ఇచ్చారని, ఏడు నెలల క్రితం రూ. 30 లక్షలు ఇస్తే యాదగిరి పోలీస్ స్టేషన్‌కు పోస్టింగ్ ఇచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల తరువాత ఇతర ప్రాంతానికి బదిలీ చేశారు. ఎన్నికలు ముగిశాక తిరిగి యాదగిరి నగరానికి వచ్చి చేరారు. ప్రస్తుతం బదిలీల నేపథ్యంలో ఎమ్మెల్యే మరోమారు డబ్బులు డిమాండ్ చేశారని, ఏడు నెలల క్రితం చేసిన అప్పులకు వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్నట్లు శ్వేత చెప్పారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం కాగా ఏడాది కొడుకు ఉన్నాడు. శ్వేత ప్రస్తుతం గర్భిణిగా ఉంది. ఇదిలా ఉంటే ఎస్‌ఐ మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేశారు.
మరణంపై విచారణ: హోంమంత్రి
శివాజీనగర: యాదగిరి ఎస్‌ఐ పరశురాం మరణం కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తనిఖీ చేపట్టాలని సూచించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బెంగళూరులో ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎస్‌ఐ సతీమణి శ్వేతా ఆరోపణలను పరిగణలోకి తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఎస్‌ఐ బదిలీ గురించి స్థానిక ఎమ్మెల్యే ఒకరిపై ఆమె ఆరోపించారు. పరశురాం మరణం సహజమైనది. ఆత్మహత్య కాదు. ఎలాంటి డెత్ నోట్‌లు లభించలేదని అన్నారు. బదిలీ కావడంతో ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిని తోసిపుచ్చబోమన్నారు. కాగా, బీజేపీ– జేడీఎస్ పాదయాత్రకు షరతులను విధించడమైనది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగరాదు. ప్రజలకు ఇబ్బంది కారాదని హోంమంత్రి తెలిపారు. వారు కోర్టుకు వెళ్లేలోపు తామే పాదయాత్రకు అనుమతి ఇచ్చామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment