సీఐ, మరో నలుగురు సిబ్బందిపై ఆరోపణలు?
రెండు వర్గాలుగా మారి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వివాదానికి కేంద్రబిందువైంది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11.30 గంటల వరకు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయంశంగా మారింది. పోలీస్ స్టేషన్‌లో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థాయిలో ఏం జరిగింది? అసలు దీనికి కారణాలు ఏమిటి? ఉన్నతాధికారుల మౌనం దేనికనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వేధింపులు, ఫిర్యాదులే కారణమా?
పార్లమెంట్ ఎన్నికల బదిలీల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేటకు ఎస్‌ఐ శ్రీరాముల శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఎస్‌ఐ అదృశ్యం, ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బంది వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులే కారణమని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ.. తన సన్నిహితులతో వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
కొద్దిరోజులుగా పోలీస్‌స్టేషన్‌లో పని చేసే నలుగురు సిబ్బందికి ఎస్‌ఐకి మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్‌ఐపై అవినీతి ఆరోపణలు రాగా, ఇదే అదునుగా సదరు సిబ్బంది కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ఏఎస్‌ఐ తనను తీవ్రంగా దూషించాడని ఎస్పీకి నేరుగా చెప్పడంతో.. ఉన్నతాధికారులు ఎస్‌ఐని సున్నితంగా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది.
కొందరు సిబ్బంది కలిసి ఒక వర్గంగా మారి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని పాల్వంచ డీఎస్పీకి చెప్పగా.. ఆయన ఎస్‌ఐపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది ఒక వర్గంగా మారి ఎస్‌ఐకి సహకరించడం లేదని, ఏదైనా ఆదేశాలిచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని, స్థానిక సీఐ ఐదు నెలల వ్యవధిలో నాలుగు మెమోలు ఇచ్చారనే ప్రచారం కుడా సాగుతోంది. దీంతోనే ఎస్‌ఐ శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురై, పురుగులమందు తాగాడని మరో వర్గం సిబ్బంది చెబుతున్నారు.
పరిస్థితి విషమంగానే..
పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్‌ఐ శ్రీనివాస్‌ను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం అపస్మారకస్థితి నుంచి బయటకు రాగా, కొద్దిసేపు కుటుంబీకులు, బంధువులతో మాట్లాడినట్లు తెలిసింది.
కాగా, ప్రమాదకరమైన గడ్డి మందు కావడంతో మందు ప్రభావం లివర్, కిడ్నీలపై పడిందని, కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ అందిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే కానీ భరోసా చెప్పలేమని వైద్యులు అంటున్నట్లు తెలిసింది. కాగా, ఎస్‌ఐ శ్రీనివాస్‌ను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బంధువులు, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment