Ashwaro Peta
-
Aswaraopeta SI: నా వన్ ప్లస్ ఫోన్ చూడండి
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడగా.. మంగళవారం పలు విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ‘నా వన్ ప్లస్ ఫోన్ చూడండి.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి’ అంటూ ఎస్సై మెసేజ్ పెట్టారనే వార్త చక్కర్లు కొట్టింది. ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే తాను పురుగుల మందు తాగానని, ఆ తర్వాత భార్యాబిడ్డలు గుర్తు రావడంతో బతకాలనిపించి 108కు ఫోన్ చేశానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు వీడియోలో వైరల్ అయింది. సీఐ జితేందర్‌రెడ్డి, స్టేషన్ సిబ్బంది అవమానాలకు గురి చేశారని, తనను అవినీతిపరుడిగా ముద్ర వేశారని, ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వెల్లడించారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి ముందే సర్వీస్ రివాల్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.ఆ ఫోన్ ఎక్కడ ఉంది?ఎస్సై శ్రీనివాస్ చెబుతున్న వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆత్మహత్యాయత్నం సమయంలో ఫోన్ తన వద్దే ఉంటే దాంట్లో నుంచే అందరికీ ఆధారాలు షేర్ చేయొచ్చు కదా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారా, ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదేశంలో మహబూబాబాద్ పోలీసులకు లేదా 108 సిబ్బందికి లభిస్తే పోలీసులకు అప్పగించారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ఆ ఫోన్లోని వివరాలు పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాగా, ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు వచ్చి పలు కోణాల్లో విచారణ చేపట్టారు. -
ఎస్ఐ ఆత్మహత్యాయత్నానికి వెనుక కారణాలు ఏంటి?
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ వివాదానికి కేంద్రబిందువైంది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి 11.30 గంటల వరకు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆ తర్వాత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయంశంగా మారింది. పోలీస్ స్టేషన్లో ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే స్థాయిలో ఏం జరిగింది? అసలు దీనికి కారణాలు ఏమిటి? ఉన్నతాధికారుల మౌనం దేనికనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.వేధింపులు, ఫిర్యాదులే కారణమా?పార్లమెంట్ ఎన్నికల బదిలీల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన మణుగూరు పోలీస్ స్టేషన్ నుంచి అశ్వారావుపేటకు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఎస్ఐ అదృశ్యం, ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బంది వేధింపులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులే కారణమని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ.. తన సన్నిహితులతో వాపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కొద్దిరోజులుగా పోలీస్‌స్టేషన్‌లో పని చేసే నలుగురు సిబ్బందికి ఎస్ఐకి మధ్య విభేదాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎస్ఐపై అవినీతి ఆరోపణలు రాగా, ఇదే అదునుగా సదరు సిబ్బంది కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఓ ఏఎస్ఐ తనను తీవ్రంగా దూషించాడని ఎస్పీకి నేరుగా చెప్పడంతో.. ఉన్నతాధికారులు ఎస్ఐని సున్నితంగా మందలించినట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు సిబ్బంది కలిసి ఒక వర్గంగా మారి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని పాల్వంచ డీఎస్పీకి చెప్పగా.. ఆయన ఎస్ఐపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఒక వర్గంగా మారి ఎస్ఐకి సహకరించడం లేదని, ఏదైనా ఆదేశాలిచ్చినా నిర్లక్ష్యం చేస్తున్నారని, స్థానిక సీఐ ఐదు నెలల వ్యవధిలో నాలుగు మెమోలు ఇచ్చారనే ప్రచారం కుడా సాగుతోంది. దీంతోనే ఎస్ఐ శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురై, పురుగులమందు తాగాడని మరో వర్గం సిబ్బంది చెబుతున్నారు.పరిస్థితి విషమంగానే..పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎస్ఐ శ్రీనివాస్‌ను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించి యశోద ఆస్పత్రిలో చేర్పించారు. సోమవారం ఉదయం అపస్మారకస్థితి నుంచి బయటకు రాగా, కొద్దిసేపు కుటుంబీకులు, బంధువులతో మాట్లాడినట్లు తెలిసింది. కాగా, ప్రమాదకరమైన గడ్డి మందు కావడంతో మందు ప్రభావం లివర్, కిడ్నీలపై పడిందని, కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ అందిస్తున్నట్లు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే కానీ భరోసా చెప్పలేమని వైద్యులు అంటున్నట్లు తెలిసింది. కాగా, ఎస్ఐ శ్రీనివాస్‌ను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. బంధువులు, కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
రాజుకుంటున్న భూ వివాదం
♦ సీలింగ్ భూములు తిరిగి లాక్కుంటున్నారు.. ♦ దివానం వారసులపై గిరిజనుల ఆరోపణ అశ్వారావుపేట: అశ్వారావుపేట మండల పరిధిలోని నారంవారిగూడెం స్టేజీ వద్ద ప్రభుత్వం కొందరు గిరిజనులకు పట్టాలిచ్చిన భూమిని సీలింగ్‌లో కోల్పోయిన జమీన్ వారసులు కబ్జా చేశారని, తిరిగి గిరిజనులకు అప్పగించడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం వివాదాస్పద భూమి వద్ద పట్టాలున్న గిరిజనులు విలేకరులకు వెల్లడించిన వివరాలు వారి మాటల్లోనే... 1998లో నారంవారిగూడెం వద్ద 43 ఎకరాల దివానం భూమి సీలింగ్‌లో ప్రభుత్వం తీసుకుని అదే గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులకు పట్టాలిచ్చారు. ఒక్కో గిరిజన రైతుకు అర ఎకరం నుంచి 6 ఎకరాల వరకు వేర్వేరుగా పట్టాలిచ్చారు. పట్టాదారు పాస్‌బుక్‌లు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వం పట్టాలయితే ఇచ్చింది కానీ భూమిని తిరిగి దివానం వారసులు డీకే మహిపాల్, మాజీ జెడ్పీటీసీ జూపల్లి కోదండ వెంకటరమణారావు వ్యవసాయం చేసుకుంటున్నారని చెబుతున్నారు. రూ.2 వేలు కౌలు ఇస్తున్నాం.. ఎకరాకు ఏడాదికి రూ.2 వేలు మాత్రమే కౌలుగా చెల్లిస్తున్నాం. ఐదేళ్లుగా కౌలు ఇవ్వకపోవడంతో వ్యవసాయం చేయనివ్వకుండా అడ్డుకున్నట్లు గిరిజనులు చెబుతున్నారు. ఉన్నట్టుండి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వచ్చి భూమిని దున్నుతుండగా అడ్డుకోవడంతో తమపై పోలీసులకు ఫిర్యాదు చేయించారని, దీంతో అసలు విషయాన్ని పత్రికల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. బాధితులు వీరే.. 1998లో జారీ చేసిన పట్టాల ప్రకారం నారంవారిగూడెం రెవెన్యూ గ్రామంలోని 1/70 యాక్టు పరిధిలోని సర్వే నంబరు 453లో కిన్నెర సీతమ్మకు అర ఎకరం, మనుగొండ ముత్యాలుకు అర ఎకరం, మనుగొండ బుచ్చమ్మకు 5 ఎకరాలు 3 కుంటలు, నల్లగుండ్ల లక్ష్మికి అర ఎకరం, నల్లగుండ్ల కృష్ణవేణికి అర ఎకరం, ఎదిరాజు వెంకమ్మకు ఎరకం మనుగొండ దుర్గయ్యకు 6 ఎకరాలు, సర్వే నంబరు 385లో గుళ్ల అనంతకు అర ఎకరం, నల్లగుండ్ల మహాలక్ష్మికి అర ఎకరం, మనుగొండ నరసమ్మకు 1.2 ఎకరాలు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కున్నారని ఆరోపిస్తున్నారు. ఏళ్లు తరబడి పట్టాదారు పాస్‌పుస్తకాలు మాకు అందకుండా అధికారులను మేనేజ్ చేశారని, తహసీల్దార్ కార్యాలయంలో వెతికి మా పాస్ పుస్తకాలు మేం సంపాదించుకున్నామన్నారు. తమకు జరిగిన అన్యాయానికి అధికారులకు చెప్పుకుందామని వెళ్లినా రాజకీయ ప్రాబల్యంతో మా గోడు వినట్లేదని అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి భూములు అప్పగించాలని కోరుతున్నారు. భూముల జోలికి పోలేదు: డీకే మహిపాల్ నారంవారిగూడెంలో మా తాతల కాలం నుంచి మా కుటుంబ అనుభవంలో ఉన్న భూములను సీలింగ్‌లో ప్రభుత్వానికి అప్పగించిన మాట వాస్తవమే. కానీ సర్వే నంబరు 453లో మాకు సెంటు భూమి మిగలకుండా వదిలేశాం. ప్రస్తుతం నా పేర ఉన్న పట్టా సర్వే నంబరు 353 లోనిది. వాటర్ ట్యాంకు నిర్మించిన స్థలం పొలంలోనిదే. ఆరోపణల్లో వాస్తవం లేదు. విచారణ నిర్వహిస్తాం: యలవర్తి వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సీలింగ్ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణ మా దృష్టికి వచ్చింది. వీఆర్వో, ఆర్ఐలను భూమి వద్ద సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశిస్తాను. ఎవరికీ అన్యాయం జరుగకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం.