బంధువులకు ఎస్సై శ్రీనివాస్ మెసేజ్
వెలుగులోకి సంచలన విషయాలు
విచారణ చేపట్టిన ఇంటెలిజెన్స్ పోలీసులు
అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ గత ఆదివారం ఆత్మహత్యాయ త్నానికి పాల్పడగా.. మంగళవారం పలు విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ‘నా వన్ ప్లస్ ఫోన్ చూడండి.. అందులో అన్ని వివరాలు ఉన్నాయి’ అంటూ ఎస్సై మెసేజ్ పెట్టారనే వార్త చక్కర్లు కొట్టింది. ఉన్నతాధికారుల వేధింపులు, సహచర సిబ్బంది అవమానాలు తాళలేకే తాను పురుగుల మందు తాగానని, ఆ తర్వాత భార్యాబిడ్డలు గుర్తు రావడంతో బతకాలనిపించి 108కు ఫోన్ చేశానని మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్టు వీడియోలో వైరల్ అయింది.
సీఐ జితేందర్‌రెడ్డి, స్టేషన్ సిబ్బంది అవమానాలకు గురి చేశారని, తనను అవినీతిపరుడిగా ముద్ర వేశారని, ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదని వెల్లడించారు. కాగా, ఆత్మహత్యాయత్నానికి ముందే సర్వీస్ రివాల్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై ఆరోగ్యం విషమంగానే ఉందని, ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపినట్లు సమాచారం.
ఆ ఫోన్ ఎక్కడ ఉంది?
ఎస్సై శ్రీనివాస్ చెబుతున్న వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆత్మహత్యాయత్నం సమయంలో ఫోన్ తన వద్దే ఉంటే దాంట్లో నుంచే అందరికీ ఆధారాలు షేర్ చేయొచ్చు కదా.. అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ కుటుంబ సభ్యులకు ఇచ్చారా, ఆత్మహత్యాయత్నం చేసిన ప్రదేశంలో మహబూబాబాద్ పోలీసులకు లేదా 108 సిబ్బందికి లభిస్తే పోలీసులకు అప్పగించారా అనేది ప్రశ్నగానే మిగిలింది. ఏదేమైనా ఆ ఫోన్‌లోని వివరాలు పరిశీలిస్తేనే అసలు వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కాగా, ఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఇంటెలిజెన్స్ పోలీసులు మంగళవారం అశ్వారావుపేటకు వచ్చి పలు కోణాల్లో విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment