తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ.. | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ..

Published Thu, Apr 4 2024 1:40 AM | Last Updated on Thu, Apr 4 2024 2:41 PM

- - Sakshi

నిషేధిత డ్రగ్స్‌ తయారీలో తెయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అరెస్ట్‌

చర్యలు తీసుకోవడంలో వర్సిటీ ఉన్నతాధికారుల మీనమేషాలు

నిజామాబాద్‌: తెలంగాణ యూనివర్సిటీ చరిత్రలో మరో మచ్చ చోటు చేసుకుంది. గతంలో తెయూ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్‌ రవీందర్‌గుప్తా లంచం తీసుకుంటూ అవినీతి కేసులో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ యూనివర్సిటీ పేరు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. దేశంలోనే పదవిలో ఉన్న యూనివర్సిటీ వీసీ ఒకరు అవినీతి కేసులో అరెస్ట్‌ అయి జైలుకెళ్లడం అదే మొదటిసారి. ప్రస్తుతం తెయూ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాస్‌ నిషేధిత డ్రగ్స్‌ (మాదకద్రవ్యాల) తయారీ కేసులో పోలీసుల చేతిలో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లడం వర్సిటీ చరిత్రలో మరో మచ్చగా మారింది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పి.శ్రీనివాస్‌ 2014లో తెయూలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 2018లో వర్సిటీ అనుబంధంగా ఉన్న భిక్కనూర్‌ సౌత్‌ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు. వర్సిటీ ఉద్యోగులకు లీన్‌ (డిప్యుటేషన్‌) పీరియడ్‌ కింద వర్సిటీ అనుమతితో ఐదేళ్లకు ఒక సంవత్సరం ఇతర సంస్థల్లోకి వెళ్లి పని చేసే అవకాశం కల్పిస్తారు. అయితే ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లకే నాటి వీసీని ప్రసన్నం చేసుకుని శ్రీనివాస్‌ లీన్‌పై వెళ్లారు. ఇలా ఏకంగా నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల పాటు శ్రీనివాస్‌ లీన్‌పై వెళ్లారు.

ప్రతి రెండేళ్లకోసారి వీసీలను మచ్చిక చేసుకుని లీన్‌ పొడిగింప జేసుకున్నారు. ఈ విషయాన్ని 2021లో గుర్తించిన వర్సిటీ పాలకమండలి సభ్యులు 53వ ఈసీ సమావేశంలో డిప్యుటేషన్‌పై ఉన్న వర్సిటీ ఉద్యోగులు వెంటనే లీన్‌ రద్దు చేసుకుని వర్సిటీలో తిరిగి చేరాలని 2021 లో తీర్మానం చేశారు. అయితే ఏ ఒక్కరూ పాలకమండలి ఆదేశాలను పాటించలేదు. వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో లీన్‌పై వెళ్లిన వారు అలాగే ఉండిపోయారు.

వర్సిటీ ఉన్నతాధికారులు నోటీసులపై నోటీసులు ఇవ్వడంతో ఎట్టకేలకు శ్రీనివాస్‌ నాలుగు నెలల క్రితం యూనివర్సిటీకి వచ్చారు. తాను తిరిగి విధుల్లో చేరతానని చెప్పగా తొలుత రిజిస్ట్రార్‌ యాదగిరి అంగీకరించలేదు. దీంతో శ్రీనివాస్‌ రిజిస్ట్రార్‌తో తీవ్రంగా గొడవ పడ్డాడు. చివరకు రిజిస్ట్రార్‌ అతడిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. సౌత్‌ క్యాంపస్‌లో తిరిగి విధుల్లో చేరిన శ్రీనివాస్‌ బయోమెట్రిక్‌ హాజరును పట్టించుకోకుండా కేవలం రిజిస్టర్‌లో సంతకాలు మాత్రమే చేసి వేతనం తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌ విషయమై వర్సిటీ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారని ఇతర అధ్యాపకులు చెప్పడం గమనార్హం.

ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా నిషేదిత డ్రగ్స్‌ తయారు చేస్తూ గత నెల 22న శ్రీనివాస్‌ అరెస్ట్‌ అయిన విషయం మూడు రోజుల క్రితం వర్సిటీ రిజిస్ట్రార్‌ దృష్టికి రావడంతో శ్రీనివాస్‌ మార్చి నెల వేతనాన్ని నిలిపివేశారు.

అయితే ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా కేసులో అరెస్ట్‌ అయిన 48 గంటల్లో విధుల్లో నుంచి సస్పెండ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై రిజిస్ట్రార్‌ యాదగిరిని సంప్రదించగా ఇంకా తనకు పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ కాపీ అందలేదని న్యాయసలహా మేరకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మెడికెమ్‌ ల్యాబ్‌..
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ శివారులో మెడికెమ్‌ ల్యాబ్‌ అనే సంస్థలో శ్రీనివాస్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా కొనసాగుతున్నారు. ఈ ల్యాబ్‌లో ఖరీదైన ఫార్మా డ్రగ్స్‌ను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ఫార్మా కంపెనీలు సిండికేట్‌గా మారి ఇలా నిషేదిత డ్రగ్స్‌ను తయారు చేసి ఇతరదేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేస్తుంటారు.

కొన్ని కంపెనీలు అప్పుడప్పుడు పట్టుబడినప్పటికీ ఇందులో వచ్చే ఆదాయం వల్ల చాలా కంపెనీలు వీటిని ఇల్లీగల్‌గా కొనసాగిస్తుంటాయి. అయితే ఇలా హైదరాబాద్‌లో నిషేదిత డ్రగ్స్‌ తయారీ చేస్తూ పట్టుబడటం, అరెస్ట్‌ అయిన వారిలో తెయూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉండటం సంచలనంగా మారింది. నిషేదిత డ్రగ్స్‌ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడాన్ని ముందుగా ఇంటర్‌పోల్‌ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

శ్రీనివాస్‌ను ఏకంగా ఇంటర్‌పోల్‌ పోలీసుల సాయంతో హైదరాబాద్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (డీసీఏ), రాష్ట్ర ఎకై ్సజ్‌ పోలీస్‌ అధికారులు గత నెల 22న అరెస్ట్‌ చేశారు. వర్సిటీ అధ్యాపకులు ప్రభుత్వం అనుమతించిన ఫార్మా ఉత్పత్తులపై పరిశోధనలు చేయాల్సి ఉండగా ఇలా నిషేదిత డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తూ పట్టుబడటం సిగ్గు చేటని వర్సిటీ వర్గాలు విమర్శిస్తున్నాయి.

ఇవి చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అదిరిపోయే ట్విస్ట్‌.. ఎమ్మెల్యేల కొనుగోలుకు లింక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement