పాస్టర్‌పై దాడి ఘటనను ఖండించిన క్రైస్తవులు
వికారాబాద్, న్యూస్‌లైన్: వికారాబాద్ సియోన్ చర్చి పాస్టర్ సంజీవులుపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఏ.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి సియోన్ చర్చిలో గుర్తుతెలియని దుండగులు పాస్టర్ సంజీవులపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దాడిని నిరసిస్తూ ఆదివారం క్రైస్తవులు వికారాబాద్‌లోని సియోన్ చర్చి నుంచి పట్టణంలోని ఎంఆర్‌పీ, బీజేఆర్, ఎన్‌టీఆర్ చౌరస్తాల మీదుగా భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయం ఎదుట రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిందుతులను వెంటనే శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజకుమారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పాస్టర్‌పై దాడి చేసిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు దురదృష్టకరం అన్నారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ.. పాస్టర్‌పై దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఇప్పటికే ముగ్గురు సీఐలతో మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుశ్చర్యను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సంయమనం పాటించి సహకరించాలని కోరారు.
త్వరలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. ఘటనలో ప్రస్తుతం ఎవరూ సాక్షులు లేరని, పాస్టర్ భార్య ఓ దుండగుడిని చూసిందని, ఆమె ప్రస్తుతం షాక్‌లో ఉందన్నారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని ఎస్పీ రాజకుమారి సూచించారు. శాంతియుతంగా ఉండి కేసు దర్యాప్తునకు సహకరించాలని సూచించారు. అనంతరం పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. దుండుగులు ఇలాంటి దాడులకు పాల్పడడం హేయమని అన్నారు. పాస్టర్‌పై దాడి చేసిన దుండగులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించకపోవడం దురదృష్టకరమని చెప్పారు. పాస్టర్లు నీతిని ప్రభోదిస్తారని, వారికి కీడు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు రెవరెండ్ కృపావరం, హైకోర్టు న్యాయవాది శ్రీని సుందర్, ఎలియాజర్, ఏసుదాసు, కృపానందరావు, సుదర్శన్, జైపాల్, రవి, జోసెఫ్, సైనస్, జె. ఎలియాజర్, కుమార్, దేవదాసు, మోహన్, దేవదానం, ఉదయ్‌కుమార్, ప్రవీణ్, దేవదాసు తదితరులు ఉన్నారు.
స్తంభించిన ట్రాఫిక్
పాస్టర్‌పై జరిగిన దాడిని నిరసిస్తూ క్రైస్తవులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలపడంతో భారీగా ట్రాఫిక్ దాదాపు అర్ధగంట సేపు పూర్తిగా స్తంభించింది. అనంతరం పోలీసులు వాహనాలను నియంత్రించారు.