పాస్టర్‌ లైంగిక వేధింపులు.. నిర్ఘాంతపోయిన అధికారులు! | Church Pastor Sexual Harassment On Girls Prakasam | Sakshi
Sakshi News home page

పిల్లలపై పాస్టర్‌ పైశాచికం

Published Sat, Aug 18 2018 4:54 PM | Last Updated on Wed, Sep 26 2018 6:09 PM

Church Pastor Sexual Harassment On Girls Prakasam - Sakshi

పోలీసులు అదుపులో పాస్టర్‌ జోసెఫ్‌

ఒంగోలు (ప్రకాశం) : అభం శుభం తెలియని పిల్లలు వారు.. 8 నుంచి 16 ఏళ్లలోపు వారు.. దైవ వాక్యం నిత్యం ప్రతిధ్వనించే చోట తమ పిల్లలకు మంచి జరుగుతుందంటూ తల్లిదండ్రులు ధైర్యంగా ఉన్నారు. తమ సమీపంలోని పాస్టర్ల సహకారంతో 53 మంది బాలికలు స్థానిక క్లౌపేటలో ఉన్న యూసీఎల్‌ఐ పాఠశాలలో చేర్పించారు. ఆ హాస్టల్‌కు అనుబంధంగా ఉన్న హోమ్‌లో (పాఠశాలకు ఎదురుగా ఉన్న కమ్యూనిటీ హాలు పైభాగంలో) వసతి ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలలో బాలల సంరక్షణ కమిటీ నిర్వహించిన ఆకస్మిక తనిఖీతో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బయటకు చెప్పుకునేందుకు సిగ్గుపడే విధంగా 76 ఏళ్ల జోసఫ్‌ పాస్టర్‌ తమకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారంటూ పలువురు బాలికలు చెప్పడంతో అధికారులు నిర్ఘాంతపోయారు.

వెలుగులోకి ఇలా..
ఇటీవల బీహార్‌ రాష్ట్రంలో ఒక స్వచ్ఛంద సంస్థ ముసుగులో బాలికలపై లైంగిక దాడులు ఘటన వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఈ ఘటన వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు సీరియసైంది. సుప్రీం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాలు తమ పరిధిలోని బాలికల హోమ్‌లను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు రావడం, అందులో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్‌ కూడా అన్ని జిల్లాలకు ఇదే ఆదేశం పంపించారు. అందులో భాగంగా గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో బాలల సంరక్షణ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ భారతి, స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన సభ్యురాలు హేనా, జిల్లా ప్రొబెషనరీ ఆఫీసర్‌ హెచ్‌ ఫరూఖ్‌బాషా తదితరులు స్థానిక క్లౌపేటలో యూసీఎల్‌ఐ పాఠశాలకు చేరుకున్నారు. హోమ్‌లో ఉంటున్న బాలికలను పిలిపించారు. హాస్టల్‌ నివేదిక ప్రకారం హోమ్‌లో 53 మంది పిల్లలు ఉండాలి. కానీ అక్కడ కేవలం 46 మంది మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

నిబంధనల ప్రకారం కమిటీ సభ్యులు ముందుగా బాలికలకు ఒక తెల్ల కాగితం ఇచ్చి సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరారు. ఈ క్రమంలో పలువురు బాలికలు తాము ఎదుర్కొంటున్న విషయాన్ని తెలియజేయడంతో అధికారులు బిత్తర పోయారు. బాలికల నుంచి మధ్యాహ్నం వరకు రిపోర్టు తీసుకున్నారు. సంబంధిత బాలికలతో విడివిడిగా మాట్లాడారు. అర్ధరాత్రి వరకు పాస్టర్‌ జోసఫ్‌ ఆయనతో పాటు ఉండాలని ఆదేశిస్తారని, ఈ క్రమంలో తమకు అశ్లీల వీడియోలు చూపించి అలా చేయాలంటూ తమను వేధిస్తున్నాడంటూ భోరుమన్నారు. అంతేకాకుండా తమను తాకరాని చోట తాకుతూ శారీరకంగా కూడా వేధిస్తున్నారంటూ కన్నీటిపర్యంతమయ్యారు.
 
పాస్టర్‌ జోసఫ్‌ అరెస్టు
బాలల సంరక్షణ కమిటీ వెంటనే దీనిపై పక్కా ప్రణాళిక అమలు చేసింది. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా పూర్తిగా పిల్లలను తమ అదుపులోనే ఉంచుకుంది. బాలికలను అదే హోమ్‌లో ఉంచడం శ్రేయస్కరం కాదని నిర్ణయించుకుంది. జిల్లా అధికారులతో మాట్లాడి ఒక బస్సులో వారందరినీ అధికారులు స్థానిక రామ్‌నగర్‌ మూడోలైన్‌లో ఉన్న బాలసదన్‌కు తరలించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలల సంరక్షణ కమిటీ జిల్లా ప్రొబెషనరీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న హెచ్‌ ఫరూఖ్‌బాషా స్థానిక టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఐపిసి 304, 509 సెక్షన్లతోపాటు 2012 పోక్సా చట్టంలోని సెక్షన్‌ 10,12,14ల కింద కేసు నమోదు చేశారు.

అనంతరం పాస్టర్‌ జోసెఫ్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం బాలల సంరక్షణ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ భారతి మీడియాతో మాట్లాడారు. బాలికలు లైంగిక దాడులను తమ దృష్టికి తేవడంతో వారికి రక్షణ కల్పించేందుకు బాలసదన్‌కు తరలించామని వివరించారు. అంతే కాకుండా బాలల హక్కులకు భంగం కలిగించే వారు ఎంతటివారైనా వారికి శిక్షపడేంత వరకు విశ్రమించేది లేదన్నారు. మధ్యాహ్నం ఒంగోలు టూటౌన్‌ సీఐ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో జోసఫ్‌ను ఎక్సయిజ్‌ మేజిస్ట్రేట్‌ వద్ద హాజరు పరచడంతో 14 రోజుల రిమాండ్‌ విధించారు. 

అధికారుల ఆగ్రహం
విషయం మీడియాలో ప్రసారం కావడంతో సీఎం పేషీ నుంచి జిల్లా అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది. బాల సదన్‌కు విచారణకు వెళ్లిన ఓ అధికారి ఎందుకు మీడియాతో మాట్లాడారు? ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట కాదా.. అంటూ హెచ్చరించినట్లు విశ్వసనీయంగా  అందిన సమాచారం. దీంతో ఘటన పెద్దదైనా అధికారులు ఎవరూ మీడియాతో మాట్లాడేందుకు ముందుకు రాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా రెండో జాయింట్‌ కలెక్టర్‌ మార్కండేయులు, మహిళా హక్కుల కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, చైల్డ్‌లైన్‌ ప్రతినిధి బీవీ సాగర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.రాజా వెంకటాద్రి, ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావు తదితరులు బాలసదన్‌కు చేరుకొని బాలికలను విచారించారు. హోమ్‌ రిజిస్టర్‌ ప్రకారం మొత్తం 53 మంది బాలికలు ఉండాలని, ప్రస్తుతం 46 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఏమయ్యారు? ఇళ్లకు ఏమైనా వెళ్లారా? అనేది కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భాగంగానే ఒంగోలు మండల విద్యాశాఖ అధికారిని కూడా శనివారం పాఠశాలను విజిట్‌ చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.
 
హాస్టల్‌ సీజ్‌కు నేడో రేపో ఉత్తర్వులు
బాలికలు ఆశ్రయం పొందుతున్న హాస్టల్‌ను మూసివేయాలని కలెక్టర్‌ నిర్ణయించినట్లు సమాచారం. వివిధ విభాగాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కలెక్టర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా అనాథ బాలికలు లేదా బాలురను స్వచ్ఛంద సంస్థలు హాస్టళ్లలో చేర్చుకునే క్రమంలో తప్పనిసరిగా సీడబ్ల్యూసీ నుంచి అనుమతి పొందాల్సి ఉన్నా ఇంత వరకు ఈ హాస్టల్‌ పరిధిలోని 53 మందిలో ఒక్కరికీ అనుమతి లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వాటితో పాటు హాస్టల్‌ నిర్వహణకు సొంత నిధులు వినియోగిస్తున్నారా? లేక విదేశీ సంస్థల నుంచి ఏమైనా నిధులు తీసుకుంటున్నారా? విదేశీ నిధులు అయితే ఏ కారణంతో పొందుతున్నారనేది కూడా పోలీసు శాఖ కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలసదన్‌లో ఉన్న బాలికలు కేవలం జిల్లా నుంచే కాకుండా వినుకొండ తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చినట్లు సమాచారం. తల్లిదండ్రులను పిలిపించి వారి సూచనల మేరకు బాలికలను సమీపంలోని కస్తూరిబా గాం«ధీ బాలికా విద్యాలయాల్లో చేర్పించాలని అధికారులు నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

మీడియాతో మాట్లాడుతున్న  ఒంగోలు టూటౌన్‌ íసీఐ సురేష్‌కుమార్‌రెడ్డి

2
2/2

యూసీఎల్‌ఐ స్కూల్‌ భవనం, బాలికలు నివాసం ఉండే భవనం (ఇన్‌సెట్లో)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement