దళితవాడలోని ప్రజలతోమాట్లాడుతున్న డీఎస్పీ స్నేహిత
తెనాలి: తెనాలి రూరల్ మండలం కొలకలూరులో క్రైస్తవ సేవలో జీవిస్తుండే పాస్టరు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు పింఛను ఆశ చూపి, బ్యాంకులో ఉన్న అతడి డబ్బును స్వాహా చేయడమే కాకుండా, పోలీసులకు ఫిర్యాదు చేస్తారనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా హతమార్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీకి చెందిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్‌ది ప్రధాన పాత్రగా దళితవాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. పోలీసులకు స్థానికులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
కొలకలూరు దళితవాడకు చెందిన ఉన్నం సుబ్బారావు అలియాస్ దానియేలు (65) నూతనంగా ఇల్లు నిర్మించుకున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఆ ఇంటికి ఇంకా ప్లాస్టింగ్ చేయలేదు. కిటికీలకు తలుపుల్లేవు. ఇల్లంతా ఇనుప కమ్మెలు, బస్తాలతో అస్తవ్యస్తంగా ఉంది. భార్య, కుమార్తె, అల్లుడు వేరొక గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయాన్నే పాస్టరు సుబ్బారావు నిద్రిస్తున్న మంచంపైనే విగతజీవుడై ఉండడాన్ని ఇరుగుపొరుగు గమనించి, పోలీసులకు ఫిర్యాదుచేశారు. రూరల్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ వచ్చి శవపరీక్షకు తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. సుబ్బారావును హత్య చేశారని, పోలీసు జాగిలాన్ని రప్పించాలని స్థానికులు పట్టుబట్టడంతో పోలీసు జాగిలాన్ని రప్పించారు. అనంతరం డీఎస్పీ స్నేహిత వచ్చి స్థానికులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.
పాస్టరు సుబ్బారావు ఇటీవల తనకున్న కొద్దిపాటి పొలం, స్థలం విక్రయించాడు. బాకీలు తీర్చగా మిగిలిన డబ్బులో రూ.5 లక్షలను కొలకలూరు ఆంధ్రాబ్యాంకు, తెనాలి స్టేట్‌బ్యాంకులో వేసుకుని, లక్ష రూపాయలను తన దగ్గర ఉంచుకొన్నాడు. పాస్టరుకు పింఛను ఇప్పిస్తానని దళితవాడకే చెందిన టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్ ఆశ చూపాడు. ఆధార్ కార్డు, బ్యాంకు పుస్తకాలు తీసుకున్నాడు. ఖాతాలో డబ్బు ఉన్నట్టు తెలుసుకుని, సంబంధించిన ఏటీఎం కార్డులను కాజేసి, రోజుకు కొంత చొప్పున నగదును ఏటీఎంల నుంచి డ్రా చేశాడు. ఏటీఎం కార్డులు కనిపించక ఆందోళన చెందిన పాస్టరు సుబ్బారావు బ్యాంకుకు వెళ్లి వాకబు చేశాడు. ఏటీఎంల నుంచి మొత్తం తీశేశారని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు.
ఈనెల 20వ తేదీన రూరల్ పోలీస్‌స్టేషనుకు వెళ్లి ఎస్‌ఐకు ఫిర్యాదుచేయగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాసిచ్చి, బ్యాంకు స్టేట్‌మెంట్లు తీసుకురమ్మని పురమాయించారు. మరుసటిరోజు గ్రామంలోని ఆంధ్రాబ్యాంకుకు వెళ్లి స్టేట్‌మెంటు తీసుకున్నాడు. ఈ విషయాన్ని బ్యాంకు మేనేజరు శ్రీనివాస్ ధ్రువీకరించారు. ఇతర డాక్యుమెంట్లను సమకూర్చుకుని మంగళవారం తెనాలి వెళ్లేందుకు సిద్ధమైన సుబ్బారావు శవమై కనిపించాడు. బ్యాంకు నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్లు కూడా మాయం అయ్యాయి. పర్సులో రూ.7 వేల నగదు అలాగే ఉంది. పోలీసు జాగిలం, ఆ పరిసరాల్లోనే కొద్దిసేపు తిరిగింది. టీడీపీ స్థానిక ప్రజాప్రతినిధి భర్త ఆరుంబాక రాజేష్ తన తండ్రికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి రూ.5.50 లక్షలు ఏటీఎంల ద్వారా తీసుకున్నారని, అతడే తన తండ్రిని హత్య చేసి ఉంటాడని సుబ్బారావు కుమార్తె కోడూరు శారాకుమారి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు.
పోలీసులు టీడీపీకి కొమ్ముకాస్తున్నారు–అన్నాబత్తుని శివకుమార్
ఫిర్యాదు ఇచ్చినా నమోదు చేసుకోకుండా పోలీసులు ప్రదర్శించిన అలసత్వమే పాస్టరు ఉన్నం సుబ్బారావు హత్యకు దారితీసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆరోపించారు. ఇందులో అధికార పార్టీ స్థానిక నేతల హస్తముందని, పోలీసు అండ చూసుకొనే హత్యకు కూడా పూనుకున్నారని ఆరోపించారు.సుబ్బారావు హత్య కేసులో నిజమైన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment