రైతు కోటేశ్వరరావు చిత్రపటం వద్ద రోదిస్తున్న భార్య ప్రమీల, పొలంలో మద్యం సీసాలు, పేకాట ఆడిన ఆనవాళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: బీసీ వర్గానికి చెందిన కౌలు రైతు పి.కోటేశ్వరరావు(కోటయ్య) మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు, అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకథలు అల్లుతున్నారు. సంఘటన జరిగిన బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోసేసి, చెట్లను ధ్వంసం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మద్యం సీసాలు కూడా కనిపించాయి. పేకాట ఆడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొండవీడు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో 0.50 సెంట్ల స్థలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుంటామని రైతు కోటయ్య నుంచి పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తమకు అడక్కుండానే తోటలో 40 బస్సులను తిప్పడంతోపాటు మునగ, బొప్పాయి, కనకాంబరం తోటలను నాశనం చేశారని కోటయ్య కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీకి వివరించారు. కోటయ్య పొలంలో పోలీసులు మద్యం తాగడంతోపాటు పేకాట ఆడినట్లు తెలుస్తోంది. తన తోటలను ఎందుకు నాశనం చేశారని సోమవారం ఉదయం కోటయ్య ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడి చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో కోటయ్య చనిపోయాడని చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదిక రాకుండానే...
రైతు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులే పురుగు మందు సీసా తీసుకొచ్చి, శవం వద్దకు ఇతరులను రానివ్వకుండా అడ్డుకొని కట్టుకథలు అల్లినట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటయ్య పొలంలో పనిచేసే పాలేరు పున్నారావును అదుపులోకి తీసుకొని, అతడి సెల్‌ఫోన్‌ను లాక్కొని, పురుగు మందు తాగాడం వల్లే కోటయ్య చనిపోయాడని చెప్పించే ప్రయత్నం చేశారని స్థానికులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే ప్రాథమిక నివేదిక పేరుతో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కోటయ్యది ఆత్మహత్య అని ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండానే ఎలా ప్రకటిస్తారని న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు పావులు కదిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ పేరుతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోటయ్య కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
విచారణ ప్రారంభం
రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై పోలీసు అధికారులు నాలుగు రోజుల తర్వాత గురువారం తీరిగ్గా విచారణ ప్రారంభించారు. ఆధారాల సేకరణ మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఎస్.వరదరాజు, నరసరావుపేట డీఎస్పీ డి.రామవర్మ ఆధ్వర్యంలో కోటయ్య మృతి చెందిన పొలంలో ఆధారాల సేకరణ నిర్వహించారు. కేసుకు సంబంధించిన రికార్డులను సంఘటనా స్థలానికి తెప్పించి పరిశీలించారు. ఘటనా స్థలంలో మట్టి నమూనాలను సేకరించారు. ఆ పొలం వివరాలు, రోడ్డుకు ఎంతదూరం ఉంది తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. ఇలావుండగా.. కొత్తపాలెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది పొలంలో పడిపోయి ఉన్న రైతు పి.కోటయ్యను రక్షించేందుకు ప్రయత్నించడం అభినందనీయమని రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు కొనియాడారు. గురువారం తన కార్యాలయంలో 2వ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డులు అందజేశారు.
ఫిర్యాదునే మార్చేశారు
సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీసీ కౌలు రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయన కుమారుడు వీరాంజనే యులు ఫిర్యాదును పోలీసులు తారుమారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేయడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటయ్య మృతిపై ఆయన కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దాడిలోనే తన తండ్రి మరణించాడంటూ ఫిర్యాదు చేశానని అంటున్నాడు. కానీ, పోలీసులతో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి కోటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. వీరాంజనేయులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పోలీసులే ఫిర్యాదును తమకు అనుగుణంగా రాసుకుని, సంతకం పెట్టించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అనుమానాస్పద మృతి ఎలా అవుతుంది?
పోలీసులు తమకు అనుకూలంగా ఫిర్యాదు కాపీ రాసుకుని, సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు అంటున్నారు. పురుగు మందు తాగి తన తండ్రి కోటయ్య మృతి చెందాడని వీరాంజనేయులు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్‌ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. కానీ, కోటయ్య మృతదేహంపై బలంగా కొట్టిన ఆనవాళ్లే కనిపించాయి. పురుగు మందు తాగినట్టు, నోట్లో నుంచి నురగ వచ్చినట్టు కనిపించలేదు. డాక్టర్లు ఇదే విషయం చెప్పారు. వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని పోలీసులపై పలువురు మండిపడుతున్నారు.
పురుగు మందు తాగాడని నేను చెప్పలేదు
‘‘నా తండ్రి కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందినట్టు నేను ఎక్కడా చెప్పలేదు. పోలీసులే ఫిర్యాదు కాపీ రాసి, నాతో సంతకం పెట్టించుకున్నారు. నా తండ్రి పోలీసుల దాడిలో మృతి చెందాడనే వారికి చెప్పాను. నా ఫిర్యాదును తారుమారు చేశారు. పోలీసులు కొట్టడం వల్లే మా నాన్న చనిపోయాడు’’ – పిట్టల వీరాంజనేయులు, కోటయ్య కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment