death of a farmer
-
కొట్టి చంపి..కట్టుకథలు!
సాక్షి, అమరావతి బ్యూరో/గుంటూరు: బీసీ వర్గానికి చెందిన కౌలు రైతు పి.కోటేశ్వరరావు(కోటయ్య) మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు, అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. కట్టుకథలు అల్లుతున్నారు. సంఘటన జరిగిన బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోసేసి, చెట్లను ధ్వంసం చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ మద్యం సీసాలు కూడా కనిపించాయి. పేకాట ఆడిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కొండవీడు ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక నేపథ్యంలో 0.50 సెంట్ల స్థలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుంటామని రైతు కోటయ్య నుంచి పోలీసులు అనుమతి తీసుకున్నారు. ఆదివారం రాత్రి తమకు అడక్కుండానే తోటలో 40 బస్సులను తిప్పడంతోపాటు మునగ, బొప్పాయి, కనకాంబరం తోటలను నాశనం చేశారని కోటయ్య కుటుంబ సభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీకి వివరించారు. కోటయ్య పొలంలో పోలీసులు మద్యం తాగడంతోపాటు పేకాట ఆడినట్లు తెలుస్తోంది. తన తోటలను ఎందుకు నాశనం చేశారని సోమవారం ఉదయం కోటయ్య ప్రశ్నించడంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడి చేసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీసులు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో కోటయ్య చనిపోయాడని చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే... రైతు హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులే పురుగు మందు సీసా తీసుకొచ్చి, శవం వద్దకు ఇతరులను రానివ్వకుండా అడ్డుకొని కట్టుకథలు అల్లినట్లుగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటయ్య పొలంలో పనిచేసే పాలేరు పున్నారావును అదుపులోకి తీసుకొని, అతడి సెల్‌ఫోన్‌ను లాక్కొని, పురుగు మందు తాగాడం వల్లే కోటయ్య చనిపోయాడని చెప్పించే ప్రయత్నం చేశారని స్థానికులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే ప్రాథమిక నివేదిక పేరుతో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, కోటయ్యది ఆత్మహత్య అని ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పూర్తిస్థాయి విచారణ చేయకుండానే ఎలా ప్రకటిస్తారని న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేందుకు అధికార పార్టీ నేతలు, పోలీసులు పావులు కదిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ పేరుతో కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కోటయ్య కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. విచారణ ప్రారంభం రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై పోలీసు అధికారులు నాలుగు రోజుల తర్వాత గురువారం తీరిగ్గా విచారణ ప్రారంభించారు. ఆధారాల సేకరణ మొదలుపెట్టారు. గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ ఎస్.వరదరాజు, నరసరావుపేట డీఎస్పీ డి.రామవర్మ ఆధ్వర్యంలో కోటయ్య మృతి చెందిన పొలంలో ఆధారాల సేకరణ నిర్వహించారు. కేసుకు సంబంధించిన రికార్డులను సంఘటనా స్థలానికి తెప్పించి పరిశీలించారు. ఘటనా స్థలంలో మట్టి నమూనాలను సేకరించారు. ఆ పొలం వివరాలు, రోడ్డుకు ఎంతదూరం ఉంది తదితర అంశాలను నమోదు చేసుకున్నారు. ఇలావుండగా.. కొత్తపాలెం గ్రామంలో విధులు నిర్వహిస్తున్న తమ సిబ్బంది పొలంలో పడిపోయి ఉన్న రైతు పి.కోటయ్యను రక్షించేందుకు ప్రయత్నించడం అభినందనీయమని రూరల్ ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు కొనియాడారు. గురువారం తన కార్యాలయంలో 2వ బెటాలియన్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐతోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డులు అందజేశారు. ఫిర్యాదునే మార్చేశారు సాక్షి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీసీ కౌలు రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) మృతి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఆయన కుమారుడు వీరాంజనే యులు ఫిర్యాదును పోలీసులు తారుమారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు సెక్షన్ 174(అనుమానాస్పద మృతి) కింద కేసు నమోదు చేయడంతో పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోటయ్య మృతిపై ఆయన కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దాడిలోనే తన తండ్రి మరణించాడంటూ ఫిర్యాదు చేశానని అంటున్నాడు. కానీ, పోలీసులతో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి కోటయ్య ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుమారుడు వీరాంజనేయులు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. వీరాంజనేయులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పోలీసులే ఫిర్యాదును తమకు అనుగుణంగా రాసుకుని, సంతకం పెట్టించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమానాస్పద మృతి ఎలా అవుతుంది? పోలీసులు తమకు అనుకూలంగా ఫిర్యాదు కాపీ రాసుకుని, సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి అడ్డంగా దొరికిపోయారని న్యాయ నిపుణులు అంటున్నారు. పురుగు మందు తాగి తన తండ్రి కోటయ్య మృతి చెందాడని వీరాంజనేయులు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పేర్కొన్నారు. కానీ, కోటయ్య మృతదేహంపై బలంగా కొట్టిన ఆనవాళ్లే కనిపించాయి. పురుగు మందు తాగినట్టు, నోట్లో నుంచి నురగ వచ్చినట్టు కనిపించలేదు. డాక్టర్లు ఇదే విషయం చెప్పారు. వీరాంజనేయులు ఫిర్యాదు మేరకు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, ఈ వ్యవహారం నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని పోలీసులపై పలువురు మండిపడుతున్నారు. పురుగు మందు తాగాడని నేను చెప్పలేదు ‘‘నా తండ్రి కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందినట్టు నేను ఎక్కడా చెప్పలేదు. పోలీసులే ఫిర్యాదు కాపీ రాసి, నాతో సంతకం పెట్టించుకున్నారు. నా తండ్రి పోలీసుల దాడిలో మృతి చెందాడనే వారికి చెప్పాను. నా ఫిర్యాదును తారుమారు చేశారు. పోలీసులు కొట్టడం వల్లే మా నాన్న చనిపోయాడు’’ – పిట్టల వీరాంజనేయులు, కోటయ్య కుమారుడు -
మంత్రి సమక్షంలో ప్రత్యక్షమైన కీలక సాక్షి
చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న అతడి పాలేరు తాతనబోయిన పున్నారావు బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. రైతు కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 18వ తేదీన కోటయ్యతోపాటు పున్నారావు కూడా పొలానికి తోడుగా వెళ్లాడు. కోటయ్య మరణించిన తర్వాత పున్నారావు కనిపించకుండా పోయాడు. పోలీసులు లేదా టీడీపీ నాయకులే అతడిని నిర్బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ పున్నారావు మంత్రి పుల్లారావు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అన్నారు. హెలీప్యాడ్‌కు సమీపంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భూమి కోటయ్య కౌలుకు సాగు చేస్తున్న విషయాన్ని దాటవేసి ఏమార్చే ప్రయత్నం చేశారు. అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం... మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ నాయకులు పున్నారావును తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. రైతు కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందాడని అతడితో చెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, పున్నారావు సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పోలీసులు నీ ఫోన్ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పున్నారావుకు సెల్‌ఫోన్ లేదని మంత్రి అనుచరులు చెప్పడంతో అవును నాకు ఫోన్ లేదని వంతపాడాడు. మరి కోటేశ్వరరావు మృతి చెందిన రోజు అతడి కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానన్నావుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఫోన్ ఉందని చెప్పాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తుండగానే టీడీపీ నాయకులు పున్నారావును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయారు. -
రైతు ఉసురు తీసిందెవరు?
చేనుకు చీడ పడితే రైతు కలత పడతాడు. నెత్తురును చెమటచుక్కలుగా మార్చి సాదుకుంటున్న పంట పొలాన్ని రక్షించుకోవడానికి తాపత్రయపడతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కొత్త పాలెం గ్రామంలో తన పొలం మీదికి పోలీసులొచ్చారని విన్నప్పుడు రైతు కోటేశ్వరరావు అంతే కంగారుపడ్డాడు. ఆదరాబాదరాగా అక్కడికెళ్లిన ఆ రైతు కాసేపటికే తన కుమారుడికి ఫోన్ చేసి ‘పోలీసులు కొడుతున్నార’ంటూ ఆర్తనాదాలు చేశాడు. అటు తర్వాత కొద్దిసేపటికే విగతజీవుడిగా మారాడు. ల్యాండ్ పూలింగ్తో మొదలుపెట్టి గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ఎదుర్కొం టున్న వేధింపుల పరంపరలో ఈ ఉదంతం అత్యంత క్రూరమైనది. ముక్కారు పంటలతో, పచ్చని పరిసరాలతో మెరిసే ప్రాంతాన్ని రాజధాని అమరావతి పేరు చెప్పి కాంక్రీటు కీకారణ్యంగా మార్చ డానికి అంకురార్పణ చేసింది మొదలు ఆ రాష్ట్రంలో రైతు కంట కన్నీరు తప్పడం లేదు. ఇంతకూ రైతు కోటేశ్వరరావు చేసిన నేరమేమిటి? సోమవారం కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు పాల్గొన్న బహిరంగసభకు వాహనాల పార్కింగ్ కోసం పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా తీసుకున్న పోలీసులు అందులోని బొప్పాయి తోటను నాశనం చేశారు. దీన్ని ప్రత్య క్షంగా చూసి తట్టుకోలేక ‘ఇదేం అన్యాయమ’ని నిలదీయడమే ఆ రైతు చేసిన నేరం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన ప్రజాప్రస్థానాన్ని ఇతివృత్తంగా తీసుకుని నిర్మించిన ‘యాత్ర’ చిత్రంలో ఒక దృశ్యం అందరినీ కదిలించింది. పంటకు గిట్టుబాటు ధర లభించక నిరాశ చెందిన ఒక రైతు తన కంఠానికి ఉరి బిగించుకున్నప్పుడు అక్కడున్నవారంతా అతడిని ఆదరా బాదరాగా ఆసుపత్రికి చేరుస్తారు. అతడి ప్రాణాలు నిలబడినా మాట పడిపోతుంది. ఏదో చెప్పాలని తాపత్రయపడి చెప్పలేకపోతున్న ఆ రైతుకు వైఎస్ పాత్రధారి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అని భరో సాగా మాట్లాడతాడు. కానీ చంద్రబాబు రాజ్యంలో రైతు కోటేశ్వరరావుకు ఆ అదృష్టం లేక పోయింది. నిక్షేపంలా ఎంతో ఆరోగ్యంతో ఉన్న కోటేశ్వరరావు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినడమే కాదు... అయినవారు వచ్చేసరికి కొన ఊపిరితో మిగిలాడు. ఆయన్ను వాహనంలో ఆసుపత్రికి తర లించడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా పోలీసులు వమ్ము చేశారు. సకాలంలో వైద్యం అందివుంటే ఆయన జీవితం నిలబడేదేమో! కానీ అందుకు ప్రభుత్వమే అవరోధంగా నిలబడింది. తండ్రికి వైద్యం చేయించేందుకు తీసుకెళ్తామని ప్రాధేయపడిన అతడి కుమారుడితో ‘సీఎం వచ్చే సమ యమైంది కనుక ఇప్పుడు కుదరద’ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా చెప్పారు. అంతా అయ్యాక కోటేశ్వ రరావు ఆత్మహత్య చేసుకున్నాడని బహిరంగసభ వేదికపై నుంచి చంద్రబాబు ప్రకటించడమే కాదు... అందుకు పోలీసుల వైఖరో, కుటుంబసమస్యలో కారణం కావొచ్చునని కూడా చెప్పారు. పనిలో పనిగా– సమస్యలుంటే పరిష్కరించుకోవాలి తప్ప ప్రాణాలు తీసుకోవద్దని హితవు కూడా పలికారు! ఆయన ఎంతో ఉదారంగా రూ. 5 లక్షలు పరిహారం ప్రకటించడానికి చాలాముందే అధి కారులు రూ. 3 లక్షలిస్తామని కుటుంబంతో బేరసారాలకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు చేస్తున్న తర్కం వింతగా ఉంది. ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తే భుజంపై మోసుకెళ్లి రక్షించేందుకు ప్రయత్నించామని, ఇందుకు తమపైనే అభాండాలు వేస్తున్నారని వారు వాపోతున్నారు. వారికి ఉద్యోగం చేయాలంటేనే భయంగా ఉందట! పోలీసుల నైతిక సై్థర్యం దెబ్బతింటే సమాజమే కుప్పకూలుతుందని కూడా వారు సెల విస్తున్నారు. కానీ ఏది చెప్పినా అతికినట్టుండాలి. 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని అందులో బొప్పాయి, మునగ, కనకాంబరం తోటల్ని సాగుచేస్తూ అప్పులే లేని కోటేశ్వరరావుకు ఉన్నట్టుండి జీవితంపై ఎందుకు విరక్తి కలిగింది? తన పొలం పాడుచేస్తున్నారన్న కబురందుకుని వెళ్లినవాడు పోలీసులు కొడుతున్నారంటూ ఎందుకు ఫోన్ చేయాల్సివచ్చింది? పురుగుమందు తాగినవారి నోటివెంబడి నురుగలొస్తాయి. కానీ కోటేశ్వరరావు భౌతికకాయంపై నోటివద్ద పురుగుమందు పోసి నట్టుగా ఎందుకుంది? కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని ఆయనతోపాటున్న జీత గాడు పున్నారావు వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్లో సమాచారం ఎందుకీయలేకపోయాడు? అతడిని పోలీసులు తమ వాహనంలో ఎందుకు బంధించాల్సివచ్చింది? అసలు చావుబతుకుల్లో ఉన్న కోటేశ్వరరావును ఆసుపత్రి వరకూ తరలించకుండా మధ్యలోనే ఒక చెక్‌పోస్టు దగ్గర పోలీ సులు ఎందుకు విడిచిపెట్టారు? పక్కనే ఉన్న హెలిపాడ్ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది ఉండగా... దూరంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులు ఎందుకునుకున్నారు? ఇంతకూ బాధితుడి సెల్‌ఫోన్ ఏమైంది? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. అడిగితే ‘మా ఆత్మసై్థర్యం దెబ్బతిం టుందిసుమా’ అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులకు కొత్త కావొచ్చుగానీ...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంత పల్లెలు అనునిత్యం ఇలాంటి దౌర్జన్యాలనే చవిచూశాయి. పీపుల్స్‌వార్ పార్టీని అణిచివేసే పేరిట పోలీసులు, వారి మద్దతుతో నయీముద్దీన్ వంటి ప్రైవేటు గూండాలు ఆరోజుల్లో సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు. గత నాలుగేళ్లుగా ఏపీలో ఈ పోకడలే కనిపిస్తున్నాయి. అందుకే ‘గుర్తు తెలియని వ్యక్తులు’ అరటి తోటలకు నిప్పు పెట్టడం మొదలుకొని అన్ని రకాల వింతలూ అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు రైతు ఉసురు తీసిన ఉదంతంలో సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయిస్తే తప్ప వాస్తవాలు బయటికి రావు. అది నిష్పాక్షికంగా సాగాలంటే ఆరోపణలొచ్చినవారందరినీ సస్పెన్షన్‌లో ఉంచాలి. రైతు మరణంపై మర్కట తర్కం చేస్తున్న ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇంతకుమించిన దోవ లేదు. -
కోటయ్య ఫోన్ ఎందుకు మాయం చేశారు?
సాక్షి, గుంటూరు : బీసీ రైతు కోటయ్యను చంపేశారనడానికి వంద ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. చంద్రబాబు సర్కారే కోటయ్యను చంపేసిందని, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, మంత్రి నారా లోకేష్ చెబుతున్నదానికి పొంతన లేదని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ బుధవారం పుట్టకోటలో పర్యటించిన.. కోటయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ...‘వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. కోటయ్య కుటుంబసభ్యులపై సామ,దాన,భేద, దండోపాయాలు ప్రయోగించారు. రైతుల పొలానికి, సీఎం హెలీపాడ్‌కు సంబంధం లేదని లోకేష్ అంటున్నారు. మరోవైపు కోటయ్య అనుమతితోనే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టామని నిన్న ఎస్పీ చెప్పారు. లోకేష్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో వివరణ ఇవ్వాలి. కోటయ్యను రక్షించే క్రమంలో విద్యుత్ విభాగానికి చెందిన వాహనం పొలంలో కొద్దిమేర తొక్కిందని ఎస్పీ చెప్పారు. బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోస్తే కోసుండొచ్చని ఎస్పీ చెప్పారు. దీన్నిబట్టి పోలీసులు పొలంలోకి ప్రవేశించారని అర్థం అవుతోంది. లోకేష్ మాత్రం కోటయ్యకు పొలమే లేదంటున్నారు. పంట నష్టపోతే రైతు ప్రశ్నించకుండా ఉంటాడా?. కోటయ్య మద్యానికి బానిసని, మరో మహిళతో పరిచయం ఉందని, అందుకే మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. కోటయ్యను కొట్టారని కుటుంబసభ్యులు నిన్న మీడియాకు చెప్పారు. పోలీసుల భుజాలపై తీసుకెళ్లింది కోటయ్య శవాన్ని మాత్రమే. బతికున్న మనిషిని ఎవరైనా పరిగెత్తుకుంటు తీసుకెళ్తారా?. ముఖ్యమంత్రి సభ ఉంటే..అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరి పోలీసులు భూజాన వేసుకుని పరిగెత్తాల్సిన అవసరం ఏంటి?. కోటయ్య మృతదేహాన్ని పోలీసు జీపులోనే ఎందుకు పెట్టారు?. అతడిని తీసుకెళ్లిప్పుడు దుస్తులు.. గ్రామస్తులకు అప్పగించిన దుస్తులు మధ్య తేడా ఉంది. కోటయ్య దగ్గర పనిచేస్తున్న పున్నారావును పోలీసులు ఎందుకు బెదిరించారు. కోటయ్య, పున్నారావు ఫోన్లు ఎందుకు మాయం చేశారు. కోటయ్య అర ఎకరం ఇచ్చారని ఓసారి, 4 ఎకరాలు ఇచ్చారని మరోసారి పోలీసులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. జ్యుడీషియల్ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు. -
ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం
-
ఇంతకీ శవం ఎవరిదయ్యా లోకేష్?
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం సభ సందర్భంగా పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఓ అన్నదాత బలైపోతే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు నిస్సిగ్గుగా సాగిస్తున్న దుష్ప్రచారంపై విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు. ‘కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్లో వెళ్లాలా?. హెలిప్యాడ్ కోసం రైతు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నామని లోకేష్ విమర్శిస్తున్నారు. ఇంతకీ శవం ఎవరు? నువ్వా? మీ నాన్నా?’ అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు హెలిపాడ్ కోసం కోటయ్య అనే రైతును దారుణంగా కొట్టి చంపిన ఘటనపై పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన క్రూర హత్య. చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలి. మృతుడు పిట్టల కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలి. సిఎం, డిజిపిలను బాధ్యులుగా చేసి దర్యాప్తుకు ఆదేశించాలి. రాజకీయ అవసరాల కోసం రోజుకో రాష్ట్రం తిరిగే బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా?. కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు చంద్రబాబు? అమరావతికి 50 కిమీ దూరంలో ఉన్న గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లాలా? హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు పాలనలో పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది అని విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత ప్రాణాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమయ్యాయి. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదదస్పదమవుతోంది. అప్పుల బాధతో పురుగు మందు తాగి చనిపోయాడంటూ బుకాయిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణిస్తే కనీసం కనికరం చూపని పాలకుల వైఖరిని ఈసడించుకుంటున్నారు. -
ఇంటికి వచ్చి బేరం చేయాల్సిన అవసరమేంటి?
సాక్షి, అమరావతి : రైతు కోటయ్య విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాస్తవాలను కప్పిపెడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య మృతి చెందాడని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శించింది. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నేతలు వైఎస్సార్ సీపీ తరఫున లక్ష ఆర్థిక సాయం అందించారు. (చంద్రబాబు సర్కారుకు రైతంటే ఇంత అలుసా?) అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...‘రైతు కోటయ్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతడి తోటను ధ్వంసం చేశారు. పంట పాడు చేయొద్దన్న కోటయ్యను పోలీసులు కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వాస్తవాలు తెలుసుకునేందుకు కోటయ్య మృతిపై నిజనిర్థారణ కమిటీ వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి మొత్తం రూ.10 లక్షలు సాయం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అన్నమాటకు కట్టుబడి ఉండాలి. పోలీసులు పెట్టిన ఇబ్బందుల వల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. నిజం కోటయ్య పురుగుల మందు తాగి చనిపోయాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడా? అనే దానిపై విచారణ జరపాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చెప్పింది వాస్తవమా? పోలీసులు చెప్పింది నిజమా అనే దానిపై జ్యుడీషియల్ విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలి. పోలీసుల తప్పు ఏమీ లేకుంటే జరిగిందే జరిగిపోయింది... రూ.3 లక్షలు ఇస్తామంటూ కోటయ్య ఇంటికి వచ్చి బేరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?. పోలీసుల భిన్నవాదనలపై విచారణ చేయించి, కోటయ్య వద్ద పనిచేసే పున్నారావును విచారణ చేయాలి’ అని డిమాండ్ చేశారు. కోటయ్య పిరికివాడు కాదు: పార్థసారధి రైతు కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి అన్నారు. అతడి మరణానికి ముఖ్యమంత్రి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించి వాస్తవాలు వెలికితీయాలని, కోటయ్య మృతిపట్ల పోలీసులు అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. (కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్) నిజనిర్ధారణ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. -
కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: జిల్లాలోని కొండవీడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీ రైతు కోటయ్య మృతికి గల వాస్తవాలను వెలికితీసేందుకు యడ్లపాడు మండలం పుట్టకోట పర్యటనకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించిన పోలీసులు వారిని గ్రామంలోకి వెళ్లనీయలేదు. దీంతో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్సార్ సీపీ నేతలు తమ వాహనాలను అక్కడే వదిలేసి గ్రామంలోకి నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన పావుగంట తర్వాత పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు. (రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..) బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లిన నిజనిర్థారణ కమిటీ సభ్యులు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య మృతికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన రోజు రైతు కోటయ్య అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో.. వాస్తవాలను గుర్తించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఉమ్మారెడ్డి ఆధ్వర్యంలోని ఈ నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు. -
టీడీపీకి ఇప్పుడు జ్ఞానోదయమైంది...
సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీతో పాటు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన టీడీపీకి ఇప్పుడే జ్ఞానోదయం అయిందని అన్నారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాలర్ ఎగరేసి తిరగాలని రఘువీరా పేర్కొన్నారు. టీడీపీ తప్పులను పక్కనపెట్టాలని ఆయన సూచించారు. ఢిల్లీ రాజకీయాలు వేరన్న రఘువీరా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు. ఏపీలో పొత్తులపై రఘువీరా రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై త్వరలో రోజుల్లో స్పష్టత వస్తుందని ... రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి, పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక రైతు కోటయ్య మృతి వెనుక ఉన్న వివాదాల జోలికి తాము వెళ్లమని, వ్యవసాయ వ్యతిరేక విధానాలే కోటయ్య మరణానికి కారణమని భావిస్తున్నామని రఘువీరా తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ను ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసిన ఈ రెండు పార్టీలను ప్రజలు ఏమాత్రం ఆదరించలేదు సరికదా, రెండోసారి కూడా టీఆర్ఎస్కే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో బీజేపీతో జత కట్టిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే సర్కార్ నుంచి బయటకు వచ్చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన కాంగ్రెస్ చేయందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు పొత్తులపై కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నారు. -
రైతంటే ఇంత అలుసా?
-
కొండవీడు రైతు మృతిపై వైఎస్ జగన్ ఆవేదన
-
రైతును మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ..
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా కొండవీడులో బీసీ రైతు కోటేశ్వరరావు (కోటయ్య) మృతిపై ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన తీరును ఆయన తప్పుబట్టారు. అసలు చంద్రబాబు ఎందుకింతగా దిగజారారని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మంగళవారం అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. కోటయ్య మృతి విషయంలో నిజనిర్ధారణ కోసం శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జగన్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వోద్యోగులను చంద్రబాబు మోసం చేస్తున్న తీరుపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. చంద్రబాబు ప్రకటించిన మధ్యంతర భృతి (ఐఆర్) విషయంలో నిజాయితీ ఎంత అనేది ఉద్యోగులకు అర్థం అవుతోందని జగన్ అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తాం అనడం ప్రభుత్వోద్యోగులను మోసం చేయడమేనన్నారు. అధికారం లేని అంశంలో చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికలయ్యాక వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే.. ఇప్పుడు చంద్రబాబు ఎలా ప్రకటన చేస్తారు? ఇది దగా చేయడం కాదా? జగన్ ప్రశ్నించారు. నేడు నిజనిర్ధారణ కమిటీ పర్యటన రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శిస్తుందని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నిజనిర్ధారణ కమిటీలో పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ సభ్యులుగా ఉన్నారు. ఈ రాక్షసత్వం ఏమిటి? కొండవీడులో బీసీ వర్గానికి చెందిన రైతు కోటయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే చంపేశారని వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొండవీడులో ఒక బీసీ (ముత్రాసి) రైతు, కోటయ్యను మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ.. కొట్టి కొన ఊపిరితో ఉన్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలీకాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ?’ అని జగన్ ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
చంద్రబాబు సర్కారుకు రైతంటే ఇంత అలుసా?
యడ్లపాడు/యడ్లపాడు(చిలకలూరిపేట): పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఓ అన్నదాత బలైపోతే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు నిస్సిగ్గుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. అప్పుల బాధతో పురుగు మందు తాగి చనిపోయాడంటూ బుకాయిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణిస్తే కనీసం కనికరం చూపని పాలకుల వైఖరిని ఈసడించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ ఏర్పాట్ల పేరుతో పోలీసులు ఓ బడుగు రైతు ప్రాణాలను బలితీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో తలెత్తుతున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. పురుగు మందు తాగి చనిపోతే నోటి నుంచి నురుగు ఎందుకు రాలేదన్న బాధితుడి కుటుంబ సభ్యులకు ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కోటేశ్వరరావును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లయితే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి గానీ మధ్యలోనే గ్రామస్థులకు ఎందుకు అప్పగించారని నిలదీస్తున్నా సర్కారు నోరువిప్పడం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి అధికార పార్టీ నాయకులు శవ రాజకీయాలకు దిగారు. రైతు కోటేశ్వరరావు మృతదేహం సాక్షిగా అతడి బంధువులతో డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో శ్రీనివాసరావు, గ్రామంలోని టీడీపీ నేతలు బేరసారాలు జరిపారు. జరిగిందేదో జరిగిపోయింది, రూ.3 లక్షలు ఇస్తాం, రాజీకి రావాలంటూ అన్నదాత ప్రాణానికి వెలకట్టారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సందర్భంగా పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కోటేశ్వరరావు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అది నిజమేనని చెప్పడానికి వెనువెంటనే చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊతం ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు చేసిన ప్రకటనలు సైతం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే అన్నట్లుగా కనిపిస్తోంది. గామం వద్దనున్న చెక్‌పోస్టు వరకు తీసుకొచ్చి, అక్కడ వదిలేశారు. దీంతో ఆ రైతును గ్రామస్తులు భుజాలపై మోసుకొని వెళ్తున్న దృశ్యం వివాదం మొదలైందిలా... రైతు పిట్టల కోటేశ్వరరావు తన భార్య ప్రమీలతో కలిసి అదివారం బొప్పాయి తోటలోని బొప్పాయి కాయలను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అప్పటికే అతడి పొలం పక్కనే పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి ఉంది. తమ పొలంలో తాము అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారని, దురుసుగా వ్యవహరించారని ప్రమీల చెప్పారు. రెండో రోజు సోమవారం ఉదయం తాను కూడా పొలానికి వస్తానంటే తన భర్త వద్దన్నాడని, తోడుగా జీతగాడైన పున్నారావును వెంటబెట్టుకెళ్లాడని తెలిపారు. కొద్ది సమయానికి భార్య, కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్ చేసి పోలీసులు తనను కొడుతున్నారని, ఊళ్లోని పెద్ద మనుషులను తీసుకురావాలని కోటేశ్వరరావు సమాచారం అందించాడు. వెంటనే పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులకు కోటేశ్వరరావు విగతజీవిగా కనిపించాడు. పోలీసుల దురుసు ప్రవర్తన ఏమిటో తనకు మొదటి రోజే తెలిసిందని, వారే తన భర్తను చంపేశారని కోటేశ్వరరావు భార్య ప్రమీల కనిపించిన వారందరికీ చెప్పుకుంటూ బోరున విలపిస్తోంది. అంబులెన్స్‌లు, డాక్టర్లు అక్కడే ఉన్నా.. ప్రమాదకర స్థితిలో ఉన్న రైతు కోటేశ్వరరావును కాపాడేందుకు తమ సిబ్బంది ప్రయత్నించారని గుంటూరు జిల్లా రూరల్ ఎస్సీ ప్రకటించారు. పోలీసులు రైతును భుజాలపై ఎత్తుకొని వెళుతున్న వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. అయితే, ముఖ్యమంత్రి సభ సందర్భంగా అక్కడ అంబులెన్స్‌తోపాటు వైద్యులు సైతం అందుబాటులో ఉన్నారు. ఫోన్ చేస్తే నిమిషాల్లో చేరేంత దూరంలో వైద్యులు ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు విద్యుత్ శాఖకు చెందిన వ్యానులో కోటేశ్వరరావును అక్కడి నుంచి తరలించిన పోలీసులు ఆసుపత్రిలో కాకుండా మొదటి చెక్‌పోస్టు వద్ద వదిలేశారు. హెలిప్యాడ్ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడికి తీసుకెళ్లలేదు. కేసును తప్పుదారి పట్టించడానికే ఇలా చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటేశ్వరరావును తరలించే క్రమంలోనే అక్కడక్కడా పంట ధ్వంసమైందని పోలీసులు వాదిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. పోలీసుల వైఖరి కారణంగానో, మరే ఇతర కారణం వల్లనో రైతు అవమానంగా భావించి తీవ్ర మనస్తానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నష్టపరిహారం ప్రకటించారు. పొలం అమ్మేసి అప్పులు తీర్చాడు రైతు కోటేశ్వరరావు మృతి నేపథ్యంలో కొత్తపాలెం గ్రామంలో సోమవారం భారీగా మోహరించిన పోలీసులు మంగళవారం సైతం మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు. దీనికి తోడు రైతుకు అప్పులు ఉన్నాయని కొందరు ప్రచారం సాగించారు. కోటేశ్వరరావుకు గతంలో అప్పులు ఉండగా సొంత పొలం ఐదు ఎకరాలు విక్రయించి అవన్నీ తీర్చేశాడని, 14 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని బంధువులు చెబుతున్నారు. అన్నింటికీ మించి ఏ తప్పూ జరగనప్పుడు, సీఎం పరిహారం ప్రకటించక ముందే డబ్బులిస్తాం, రాజీ చేసుకోవాలంటూ అనధికార చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేసును పక్కదారి పట్టించే కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేలా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం. భయభ్రాంతులకు గురిచేసి... రైతు కోటేశ్వరరావుతో పాటు తోడుగా వెళ్లిన జీతగాడైన పున్నారావు కోసం గ్రామస్థులు సంఘటన స్థలంలో పోలీసులను వాకబు చేశారు. అయితే, అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని పోలీసులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే సమీప పొలాల్లో గాలించిన గ్రామస్థులకు పున్నారావు పోలీసుల వాహనంలోనే దర్శనమిచ్చాడు. అతడి సెల్‌ఫోన్ సైతం సమీపంలో ఉన్న ఓ పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ చేతిలో ఉండటం గమనార్హం. ఏం జరిగిందని పున్నారావును గ్రామస్థులు ప్రశ్నించగా, అతని వద్ద నుంచి సమాధానం లేదు. దీంతో పున్నారావును పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసుల తప్పు లేకుంటే పున్నారావును ఎందుకు వాహనంలో బంధించారు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. పోలీసుల బుకాయింపు పోలీసులు కొట్టడం వల్లే రైతు కోటేశ్వరరావు మృతిచెందాడని బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కానీ, తమకేమీ తెలియదంటూ పోలీసులు బుకాయిస్తున్నారు. పోలీసులు చెబుతున్న దానికి, సంఘటన జరిగిన తీరుకు పొంతన లేకుండా ఉందని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యమంత్రి సభ సందర్భంగా కోటేశ్వరరావు పొలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. వారు ఉదయం నుంచి పొలంలోని బొప్పాయిలు కోసుకుని తినడంతోపాటు సంచుల్లో వేసుకున్నట్లు కోటేశ్వరరావు గుర్తించాడు. అంతేకాకుండా పొలంలోని చెట్లన్నీ విరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందనే బాధతో పోలీసులను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో బయటపడాల్సి ఉంది. అనుమానాలు ఎన్నెన్నో... - రైతు కోటేశ్వరరావు నిజంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అక్కడిక్కడే మృతిచెందే అవకాశం లేదు. కనీసం నోటివెంట నురగ అయినా వచ్చి ఉండేది. - పోలీసులు కోటేశ్వరరావును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లయితే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ, అందుకు భిన్నంగా మార్గమధ్యంలో గ్రామస్థులకు ఎందుకు అప్పగించారు? - కోటేశ్వరరావు ఇంట్లో పనిచేస్తున్న పున్నారావు నోరు విప్పేందుకు కూడా భయపడుతున్నాడంటే అందుకు పోలీసుల బెదిరింపులే కారణమా? - పోలీసుల వాహనంలో పున్నరావును ఎందుకు దాచి ఉంచారు? అతడి సెల్‌ఫోన్ పోలీసుల వద్ద ఎందుకు ఉంచుకున్నారు? - రైతు కోటేశ్వరరావు మృతికి పోలీసులు కారణం కాకపోతే గ్రామంలోకి ఎవరూ వెళ్ళకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? - పోలీసుల తప్పేమీ లేకపోతే రూ.3 లక్షలు ఇస్తాం, గొడవ పెద్దది కాకుండా ముగించడంటూ డీఎస్పీ, ఆర్డీవో బేరసారాలు ఆడాల్సిన అగత్యం ఏమిటి? - నిజంగా రైతుది ఆత్మహత్య అని తేలితే అనుమానాస్పద మృతి కింద కేసు ఎందుకు నమోదు చేశారు? - అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైన తరువాత పోస్టుమార్టం నివేదిక, ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు వచ్చిన తరువాత దాని ఆధారంగా అది హత్యా? ఆత్మహత్యా? అనేది నిర్ధారించుకుని చార్జిషీట్ వేస్తారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే రైతుది ఆత్మహత్య అని జిల్లా ఎస్పీ ఎలా చెబుతారు? - కోటేశ్వరరావును రక్షించేందుకు ప్రయత్నించామని పోలీసులు చెబుతున్నారు. అదే నిజమనుకుంటే.. ముఖ్యమంత్రి సభ వద్దే అంబులెన్సులు, వైద్యులు ఉన్నారు. ప్రాథమిక చికిత్స అక్కడే అందించవచ్చు. మరి అందుకు భిన్నంగా ఇతరుల వాహనంలో ఎక్కించి ఎందుకు తరలించారు? పోలీసులు కొట్టడం వల్లే మరణించాడు కొండవీడు ఉత్సవాల మొదటి రోజే నా భర్తతో కలిసి బొప్పాయి కాయలు తెచ్చుకునేందుకు తోటకు వెళ్లాం. ఆరోజే మాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రెండో రోజు నా భర్త నీళ్లు పెట్టి వస్తానంటూ పొలానికి వెళ్లాడు. పోలీసులు కొడుతున్నారని ఫోన్‌చేసి చెప్పాడు. పోలీసులు కారణంగానే నా భర్త మరణించాడు. – ప్రమీల, రైతు కోటేశ్వరరావు భార్య రూ.3 లక్షలు ఇస్తామన్నారు మా నాన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మా నాన్న మృతి చెందాక డీఎస్పీ, ఆర్డీవో వచ్చి రూ.3 లక్షలు చెల్లిస్తాం, వివాదం లేకుండా చూడాలని గ్రామపెద్దలతో బేరసారాలు సాగించారు. – పి.వీరాంజనేయులు, కోటేశ్వరరావు కుమారుడు పోలీసులే పొట్టన పెట్టుకున్నారు మా అన్న ఎంతో ధైర్యవంతుడు. గతంలో అప్పులు ఉంటే సొంత పొలం విక్రయించి తీర్చేశాడు. ప్రస్తుతం పంట పెట్టుబడి కోసం బంగారం తాకట్టు పెట్టాడు. ఫలసాయం చేతికి వచ్చే వేళ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం లేదు. అరగంట ముందు పొలం వద్ద నాకు పుచ్చకాయ కొనిచ్చి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే చనిపోయాడన్న వార్త అందింది. పోలీసులే మా అన్నను పొట్టన పెట్టుకున్నారు – ఎం.సుబ్బాయమ్మ, కోటేశ్వరరావు సోదరి -
కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?
సాక్షి, విజయవాడ : గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదస్పదమవుతోంది. గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాత్రం కోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ముందే ఆత్మహత్య చేసుకున్నాడని మీడియాకు తెలిపారు. తమ పోలీసులే కోటయ్యను భుజాలపై ఆసుపత్రికి మోసుకెళ్లారని చెప్పారు. కానీ, ఎస్పీ వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ చెప్పినదాంట్లో కొంతమాత్రమే నిజమని, కోటయ్యను పోలీసులు మొదటి చెక్‌పోస్ట్ వరకే తీసుకొచ్చి.. వదిలేశారని, దీంతో అక్కడి నుంచి తాము భుజాల మీద రెండో చెక్‌పోస్ట్ వద్దకు తెచ్చామని వారు స్పష్టం చేస్తున్నారు. కోటయ్యను పోలీసులే ఆస్పత్రి వరకు తీసుకెళితే.. మధ్యలో రైతుల భుజాలపైకి ఆయన ఎలా వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య పొలంలో వాడని పురుగుల మందుడబ్బా అక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కోటయ్య ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్న పోలీసులు.. వెంటనే ఆయనను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? కోటయ్య ముఖంపై గాయలు ఎలా అయ్యాయని స్థానికులు అడుగుతున్నారు. కోటయ్యను మొదటి చెక్‌పోస్ట్ వరకు పోలీసులు తీసుకొచ్చి వదిలేయడంతో.. అక్కడి నుంచి రెండో చెక్‌పోస్ట్ వరకు తాము భుజాలపై మోసుకెళ్లామని, అక్కడి నుంచి ఫిరంగిపురం ఆస్పత్రికి తీసుకొచ్చినా.. అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారని, దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపై కూర్చున్నామని, ముఖ్యమంత్రి వస్తున్నాడని పోలీసులు తరిమేశారని వాపోతున్నారు. -
కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్
-
కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. కోటయ్య మృతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాక సందర్భంగా పంట నాశనం చేయొద్దని బతిమిలాడిన కోటయ్యపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అక్కడే వదిలేశారని ఆరోపించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో కోటయ్య మృతి, ఉద్యోగులకు మధ్యంతర భృతి పేరుతో చంద్రబాబు మోసంపై నాయకులతో చర్చించారు. (సీఎం సభ కోసం రైతును చంపేశారు) కోటయ్య మృతి వెనుక అసలు కారణాలేమిటి? అనేది తేల్చేందుకు, మృతుని కుంటుంబానికి భరోసానిచ్చేందుకు సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేశారు. కొండవీడులో ఈ కమిటీ రేపు (బుధవారం) పర్యటించనుంది. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు ప్రకటించిన మధ్యంతర భృతిలో నిజాయితీ లేదని అన్నారు. భృతి ఇప్పుడు ప్రకటించి జూన్‌లో ఇస్తామనడం మోసమేనని వ్యాఖ్యానించారు. తనకు అధికారంలేని బడ్జెట్‌పై బాబు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజలు, దేవుడి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, ఉద్యోగులకు న్యాయం జరిగేది తమ ప్రభుత్వంలోనే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. కమిటీలో సభ్యులు వీరే.. నిజనిర్ధారణ కమిటీలో గుంటూరు జిల్లాకు చెందిన ఐదుదురు ఎమ్మెల్యేలు.. ముస్తాఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, పార్థసారథి, కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజనీ, శ్రీ కృష్ణదేవరాయలు, జంగా కృష్ణమూర్తి, మోపిదేవి వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ, మేరుగ నాగార్జున ఉన్నారు. బాధిత రైతు కుంటుంబాన్ని పరామర్శించడమే కాకాండా వారికి అండగా నిలబడాలని పార్టీ అధ్యక్షుడు నాయకులను ఆదేశించారు. -
కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?
-
ఆ రైతును మీరే చంపేశారు : వైఎస్ జగన్
-
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
-
కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
సాక్షి, గుంటూరు : సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన రైతు కోటయ్య మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం పూర్తయింది. ఈ సాయంత్రం పుట్టకోటలో కోటయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. డాక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కోటయ్య మృత దేహానికి పోస్టు మార్టం జరిగింది. వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజేశేఖర్, విడదల రజని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. -
‘అన్నదాత సుఖీభవ అంటూ రైతు ఉసురు తీశారు’
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ అంటూనే రైతు ఉసురు తీశారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎమ్వీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై ఆయన స్పందించారు. మంగళవారం బాధిత కుటంబాన్ని పరామర్శించిన నాగిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం హెలిప్యాడ్ కోసం రైతు కోటయ్య పచ్చటి పొలాన్ని బలవంతంగా తీసుకున్నారని, తోటను మొత్తం చిందరవందగా తొక్కేసారన్నారు. దీన్ని ప్రశ్నించిన కోటయ్యను ఇష్టారీతిగా కొట్టారని, పోలీసుల దెబ్బలకే అతను చనిపోయాడని తెలిపారు. కోటయ్య లాంటి రైతు మరణంపై సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడరని, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. సాక్షి లేకపోతే ఈ విషయం వెలుగు చూసేదా? అని నిలదీశారు. బీసీ కౌలు రైతు మీద జరిగిన దాడి ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, చంద్రబాబుకు అన్నదాత సుఖీభవ అనే అర్హత లేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు పురుగుల మంది తాగినట్లు చిత్రీకరించారని, ఈ కేసును హైకోర్టు సుమోటగా స్వీకరించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కోటయ్య కుటంబానికి రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. చారిత్రక కొండవీడు కోట ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలోని కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్ కోసం లాక్కున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన రైతుపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. -
రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? : కన్నా
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. చారిత్రక కొండవీడు కోటలో చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. మీ రైతు వ్యతిరేక వైఖరితో మరో రైతుని బలిచేశారని చంద్రబాబుపై కన్నా ట్విట్టర్లో నిప్పులు చెరిగారు. 'పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు, విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా? కొండవీడు ఉత్సవాల ఏర్పాట్ల కోసం కోటయ్యకు చెందిన పచ్చని పంటపొలాలను తన సమ్మతి లేకుండా తీసుకునే హక్కు మీకు, పచ్చ కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసులకు ఎవరిచ్చారు?! సామాన్య రైతు ప్రశ్నిస్తే ప్రాణాలు తీస్తారా? మీలాంటి దౌర్జన్యం చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం' అని పేర్కొన్నారు. @ncbn, మీ రైతు వ్యతిరేక వైఖరికి మరో రైతుని బలిచేశారు. పొలాన్ని దేవాలయంగా భావించే రైతు పట్ల మీరు అధికార దర్పాన్ని చూపి పోలీసులతో కొట్టించడం వలన ప్రాణాలు విడిస్తే కనీసం కేసు,విచారణ లేకుండా ఆత్మహత్య అని ఎలా మీరు ప్రకటిస్తారు? ప్రజలకు వర్తించే చట్టాలు మీకు వర్తించవా?#ShameOnYouCM — Kanna Lakshmi Narayana (@klnbjp) February 19, 2019 ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా పోలీసులు అందుకు అంగీకరించలేదు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు. -
ఆ రైతును మీరే చంపేశారు : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : సీఎం చంద్రబాబు సభకోసం ఓ రైతును అన్యాయంగా చంపిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. కొండవీడులోని కోటయ్యను కొట్టి అమానుషంగా అక్కడే వదిలేశారని ట్విటర్లో పేర్కొన్నారు. హెలికాప్టర్ దిగడానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారని.. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏంటి చంద్రబాబు గారు అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో కోటయ్య తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్ దెబ్బలకు రైతు నేలకొరిగాడు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించపోవడంతో రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే. కొండవీడులో ఒక బీసీ(ముత్రాసి) రైతు, కోటయ్య గారిని మీరే చంపేశారు ముఖ్యమంత్రి గారూ @ncbn. కొట్టి కొనఊపిరితో వున్న రైతును అమానుషంగా అక్కడే వదిలేశారు. మీ హెలికాప్టర్ దిగటానికి ఆయన బొప్పాయి పొలాన్ని నాశనం చేశారు. మానవత్వం చూపాల్సిన సందర్భాల్లో ఈ రాక్షసత్వం ఏమిటి చంద్రబాబు గారూ? — YS Jagan Mohan Reddy (@ysjagan) February 19, 2019 చదవండి.. సీఎం సభ కోసం రైతును చంపేశారు -
సాక్షి ఎఫెక్ట్: కోటయ్య మృతదేహానికి పోస్టుమార్టం
సాక్షి, గుంటూరు: ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు కొండవీడు పర్యటన ఓ రైతు కుటుంబంలో విషాదం నింపిన సంగతి తెలిసిందే. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామ రైతు కోటయ్యకు చెందిన కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను పోలీసులు ధ్వంసం చేశారు. అంతేకాకుండా కోటయ్యను తన పొలంలోకి రానివ్వకుండా అవమానించారు. ఆ తర్వాత కాసేపటికే కోటయ్య అనుమానస్పద రీతిలో మృతి చెందారు. రైతు మృతిని అధికార యంత్రాగం తేలికగా తీసుకుంది. కోటయ్య మృతిపై సాక్షి మీడియా కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. కోటయ్య మృతి చెందిన 20 గంటల తర్వాత పోలీసులు స్పందించారు. అందులో భాగంగా పుట్టకోట చేరుకున్న సీఐ విజయచంద్ర, యడ్లపాడు ఎస్ఐ శ్రీనివాస్ కోటయ్య మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.(సీఎం సభ కోసం రైతును చంపేశారు) కాగా, పోలీసులు కొట్టడం వల్లే కోటయ్య చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించలేదని మృతుడి కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రైతు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పార్టీ నాయకులతో కలిసి సీఎం రాకముందే కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆమెను, పార్టీ నాయకులను మృతుడి ఇంటివద్దకు వెళ్లకుండా గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం వెళ్లిపోయిన అనంతరం పోలీసులు రజనిని అనుమతించటంతో రాత్రి కొత్తపాలెం చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీసీ వర్గాల ఆందోళన.. బీసీ రైతు కోటయ్య మృతిపై బీసీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. బీసీ ఓటర్లు తమ వెంటే ఉన్నారని చెప్పుకునే చంద్రబాబు.. ఓ బీసీ రైతు చనిపోతే ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తున్నారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఇదేనా అని పుట్టకోట రైతులు నిలదీశారు. కోటయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అతని కుటుంబానికి 20లక్షల రూపాయల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. -
సీఎం రాకకు ముందు శవం తరలింపు...