ఇంటికి వచ్చి బేరం చేయాల్సిన అవసరమేంటి? | YSRCP demands judicial probe into Farmer Kotaiah Suspicious Death | Sakshi
Sakshi News home page

కోటయ్యతో పోలీసుల ప్రవర్తన అమానుషం: ఉమ్మారెడ్డి

Feb 20 2019 2:53 PM | Updated on Feb 20 2019 3:50 PM

YSRCP demands  judicial probe into Farmer Kotaiah Suspicious Death  - Sakshi

సాక్షి, అమరావతి : రైతు కోటయ్య విషయంలో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, ప్రభుత్వం కూడా ఈ విషయంలో వాస్తవాలను కప్పిపెడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య మృతి చెందాడని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ సందర్భంగా గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. రైతు కోటయ్య మరణంపై మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ కుటుంబానికి పూర్తి భరోసా ఇచ్చేందుకు ఉమ్మారెడ్డి నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ బుధవారం కొండవీడును సందర్శించింది. కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన పార్టీ నేతలు వైఎస్సార్‌ సీపీ తరఫున లక్ష ఆర్థిక సాయం అందించారు. (చంద్రబాబు సర్కారుకు రైతంటే ఇంత అలుసా?)

అనంతరం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...‘రైతు కోటయ్య పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. అతడి తోటను ధ్వంసం చేశారు. పంట పాడు చేయొద్దన్న కోటయ్యను పోలీసులు కొట్టారు. పోలీసుల దెబ్బలు తాళలేకే కోటయ్య ప్రాణాలు కోల్పోయాడు. అయితే పోలీసులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకునేందుకు కోటయ్య మృతిపై నిజనిర్థారణ కమిటీ వేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కుటుంబానికి మొత్తం రూ.10 లక్షలు సాయం అందిస్తున్నాం. 

ముఖ్యమంత్రి చంద్రబాబు తాను అన్నమాటకు కట్టుబడి ఉండాలి. పోలీసులు పెట్టిన ఇబ్బందుల వల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. నిజం కోటయ్య పురుగుల మందు తాగి చనిపోయాడా? లేక పోలీసులు కొట్టిన దెబ్బలతో చనిపోయాడా? అనే దానిపై విచారణ జరపాలి. ఈ  విషయంలో ముఖ్యమంత్రి చెప్పింది వాస‍్తవమా? పోలీసులు చెప్పింది నిజమా అనే దానిపై జ్యుడీషియల్‌ విచారణ జరిపి వాస్తవాలు వెలికితీయాలి. పోలీసుల తప్పు ఏమీ లేకుంటే జరిగిందే జరిగిపోయింది... రూ.3 లక్షలు ఇస్తామంటూ కోటయ్య ఇంటికి వచ్చి బేరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?. పోలీసుల భిన్నవాదనలపై విచారణ చేయించి, కోటయ్య వద్ద పనిచేసే పున్నారావును విచారణ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  

కోటయ్య పిరికివాడు కాదు: పార్థసారధి
రైతు కోటయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వైఎస్సార్ సీపీ నేత పార్థసారధి అన్నారు. అతడి మరణానికి ముఖ్యమంత్రి, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావే బాధ్యత వహించాలని డిమాం‍డ్‌ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించి వాస్తవాలు వెలికితీయాలని, కోటయ్య మృతిపట్ల పోలీసులు అసత్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. (కోటయ్య మృతిపై నిజనిర్ధారణ కమిటి వేసిన వైఎస్‌ జగన్‌)

నిజనిర్ధారణ కమిటీలో బొత్స సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, మోపిదేవి వెంకటరమణ, జంగా కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కొడాలి నాని, మర్రి రాజశేఖర్, విడదల రజని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, గాంధీ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement