
సాక్షి, తిరుపతి/పూతలపట్టు: ‘ఒళ్లు దగ్గర పెట్టుకోండి. నాతో పెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. తమాషాలు చేస్తున్నారా, చూసుకుందాం రండి రా.. నా కొడకల్లారా.. వాళ్లను తరమండిరా..’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ప్రాజెక్టుల పర్యటన పేరుతో శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూరు, పూతలపట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, పోలీసులను ఇష్టానుసారం మాట్లాడారు. ‘టైం చెప్పండి, ప్లేస్ చెప్పండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు.
నన్ను బెదిరించడం మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. కర్రలతో వస్తే కర్రలతో వస్తా. రౌడీలకు రౌడీగా ఉంటా. ఏయ్ పోలీస్.. వాళ్లను పంపించండి’ అంటూ అంగళ్ల వద్ద అనుచిత వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఆ బట్టలు తీసేయండయ్యా. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే. గాడిదలు కాస్తున్నారా’ అంటూ నోరుపారేసుకున్నారు. కాగా, టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తామని శుక్రవారం రాత్రి పూతలపట్టు సభలో ఆయన చెప్పారు.