సాక్షి, గుంటూరు : బీసీ రైతు కోటయ్యను చంపేశారనడానికి వంద ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆరోపించింది. చంద్రబాబు సర్కారే కోటయ్యను చంపేసిందని, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ, మంత్రి నారా లోకేష్ చెబుతున్నదానికి పొంతన లేదని వ్యాఖ్యానించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్థారణ కమిటీ బుధవారం పుట‍్టకోటలో పర్యటించిన.. కోటయ్య కుటుంబసభ్యుల్ని పరామర్శించింది. అనంతరం పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ...‘వైఎస్సార్ సీపీ నిజనిర్థారణ కమిటీని పర్యటించకుండా అడ్డుకుంటున్నారు. కోటయ్య కుటుంబసభ్యులపై సామ,దాన,భేద, దండోపాయాలు ప్రయోగించారు. రైతుల పొలానికి, సీఎం హెలీపాడ్‌కు సంబంధం లేదని లోకేష్ అంటున్నారు.
మరోవైపు కోటయ్య అనుమతితోనే పోలీస్ కంట్రోల్ రూమ్ పెట్టామని నిన్న ఎస్పీ చెప్పారు. లోకేష్ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో వివరణ ఇవ్వాలి. కోటయ్యను రక్షించే క్రమంలో విద్యుత్ విభాగానికి చెందిన వాహనం పొలంలో కొద్దిమేర తొక్కిందని ఎస్పీ చెప్పారు. బొప్పాయి తోటలో పోలీసులు కాయలు కోస్తే కోసుండొచ్చని ఎస్పీ చెప్పారు. దీన్నిబట్టి పోలీసులు పొలంలోకి ప్రవేశించారని అర్థం అవుతోంది. లోకేష్ మాత్రం కోటయ్యకు పొలమే లేదంటున్నారు. పంట నష్టపోతే రైతు ప్రశ్నించకుండా ఉంటాడా?. కోటయ్య మద్యానికి బానిసని, మరో మహిళతో పరిచయం ఉందని, అందుకే మానసిక క్షోభతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున‍్నారు.
కోటయ్యను కొట్టారని కుటుంబసభ్యులు నిన్న మీడియాకు చెప్పారు. పోలీసుల భుజాలపై తీసుకెళ్లింది కోటయ్య శవాన్ని మాత్రమే. బతికున్న మనిషిని ఎవరైనా పరిగెత్తుకుంటు తీసుకెళ్తారా?. ముఖ్యమంత్రి సభ ఉంటే..అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. మరి పోలీసులు భూజాన వేసుకుని పరిగెత్తాల్సిన అవసరం ఏంటి?. కోటయ్య మృతదేహాన్ని పోలీసు జీపులోనే ఎందుకు పెట్టారు?. అతడిని తీసుకెళ్లిప్పుడు దుస్తులు.. గ్రామస్తులకు అప్పగించిన దుస్తులు మధ్య తేడా ఉంది. కోటయ్య దగ్గర పనిచేస్తున్న పున్నారావును పోలీసులు ఎందుకు బెదిరించారు. కోటయ్య, పున్నారావు ఫోన్లు ఎందుకు మాయం చేశారు. కోటయ్య అర ఎకరం ఇచ్చారని ఓసారి, 4 ఎకరాలు ఇచ్చారని మరోసారి పోలీసులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. జ్యుడీషియల్ విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment