మీడియా సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పక్కన పున్నారావు
చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న అతడి పాలేరు తాతనబోయిన పున్నారావు బుధవారం మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. రైతు కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన 18వ తేదీన కోటయ్యతోపాటు పున్నారావు కూడా పొలానికి తోడుగా వెళ్లాడు. కోటయ్య మరణించిన తర్వాత పున్నారావు కనిపించకుండా పోయాడు. పోలీసులు లేదా టీడీపీ నాయకులే అతడిని నిర్బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ పున్నారావు మంత్రి పుల్లారావు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రత్యక్షమయ్యాడు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలం కోటయ్యదని నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి అన్నారు. హెలీప్యాడ్‌కు సమీపంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన భూమి కోటయ్య కౌలుకు సాగు చేస్తున్న విషయాన్ని దాటవేసి ఏమార్చే ప్రయత్నం చేశారు.
అవాస్తవాలు చెప్పించే ప్రయత్నం...
మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ నాయకులు పున్నారావును తీసుకొచ్చి మీడియాతో మాట్లాడించారు. రైతు కోటయ్య పురుగు మందు తాగి మృతి చెందాడని అతడితో చెప్పించేందుకు ప్రయత్నించారు. అయితే, పున్నారావు సమాధానాలు చెప్పలేక తడబడ్డాడు. పోలీసులు తనను అదుపులోకి తీసుకుని వాహనంలో ఎక్కించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. పోలీసులు నీ ఫోన్ తీసుకున్నారా? అని ప్రశ్నించగా.. పున్నారావుకు సెల్‌ఫోన్ లేదని మంత్రి అనుచరులు చెప్పడంతో అవును నాకు ఫోన్ లేదని వంతపాడాడు. మరి కోటేశ్వరరావు మృతి చెందిన రోజు అతడి కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చానన్నావుగా అని విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఫోన్ ఉందని చెప్పాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో చెప్పాలని ప్రశ్నిస్తుండగానే టీడీపీ నాయకులు పున్నారావును బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment