సోమవారం కొండవీడు ఉత్సవాలకు హాజరైన సీఎం చంద్రబాబు హెలికాప్టర్ ఆగటం కోసం, వాహనాల పార్కింగ్‌కు రైతు కోటేశ్వరరావు పొలంలో ఉన్న చెట్లను పోలీసులు, అధికారులు నాశనం చేశారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించిన రైతును కొట్టారు. దీంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ రైతును పోలీసులు భుజాలపై వేసుకొని వాహనంలోకి తరలిస్తున్న దృశ్యాలు
యడ్లపాడు/యడ్లపాడు(చిలకలూరిపేట): పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక ఓ అన్నదాత బలైపోతే.. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ వర్గాలు నిస్సిగ్గుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోతున్నారు. అప్పుల బాధతో పురుగు మందు తాగి చనిపోయాడంటూ బుకాయిస్తున్న తీరును చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు మరణిస్తే కనీసం కనికరం చూపని పాలకుల వైఖరిని ఈసడించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ ఏర్పాట్ల పేరుతో పోలీసులు ఓ బడుగు రైతు ప్రాణాలను బలితీసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో తలెత్తుతున్న అనుమానాలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.
పురుగు మందు తాగి చనిపోతే నోటి నుంచి నురుగు ఎందుకు రాలేదన్న బాధితుడి కుటుంబ సభ్యులకు ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. కోటేశ్వరరావును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లయితే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి గానీ మధ్యలోనే గ్రామస్థులకు ఎందుకు అప్పగించారని నిలదీస్తున్నా సర్కారు నోరువిప్పడం లేదు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి అధికార పార్టీ నాయకులు శవ రాజకీయాలకు దిగారు. రైతు కోటేశ్వరరావు మృతదేహం సాక్షిగా అతడి బంధువులతో డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో శ్రీనివాసరావు, గ్రామంలోని టీడీపీ నేతలు బేరసారాలు జరిపారు. జరిగిందేదో జరిగిపోయింది, రూ.3 లక్షలు ఇస్తాం, రాజీకి రావాలంటూ అన్నదాత ప్రాణానికి వెలకట్టారు.
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభ సందర్భంగా పోలీసుల దౌర్జన్యం వల్ల బీసీ రైతు పిట్టల కోటేశ్వరరావు సోమవారం మరణించిన సంగతి తెలిసిందే. పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే కోటేశ్వరరావు చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అది నిజమేనని చెప్పడానికి వెనువెంటనే చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊతం ఇస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు చేసిన ప్రకటనలు సైతం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే అన్నట్లుగా కనిపిస్తోంది.
గామం వద్దనున్న చెక్‌పోస్టు వరకు తీసుకొచ్చి, అక్కడ వదిలేశారు. దీంతో ఆ రైతును గ్రామస్తులు భుజాలపై మోసుకొని వెళ్తున్న దృశ్యం
వివాదం మొదలైందిలా...
రైతు పిట్టల కోటేశ్వరరావు తన భార్య ప్రమీలతో కలిసి అదివారం బొప్పాయి తోటలోని బొప్పాయి కాయలను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అప్పటికే అతడి పొలం పక్కనే పోలీస్ క్యాంపు ఏర్పాటు చేసి ఉంది. తమ పొలంలో తాము అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డుకున్నారని, దురుసుగా వ్యవహరించారని ప్రమీల చెప్పారు. రెండో రోజు సోమవారం ఉదయం తాను కూడా పొలానికి వస్తానంటే తన భర్త వద్దన్నాడని, తోడుగా జీతగాడైన పున్నారావును వెంటబెట్టుకెళ్లాడని తెలిపారు. కొద్ది సమయానికి భార్య, కుమారుడు వీరాంజనేయులుకు ఫోన్ చేసి పోలీసులు తనను కొడుతున్నారని, ఊళ్లోని పెద్ద మనుషులను తీసుకురావాలని కోటేశ్వరరావు సమాచారం అందించాడు. వెంటనే పొలం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులకు కోటేశ్వరరావు విగతజీవిగా కనిపించాడు. పోలీసుల దురుసు ప్రవర్తన ఏమిటో తనకు మొదటి రోజే తెలిసిందని, వారే తన భర్తను చంపేశారని కోటేశ్వరరావు భార్య ప్రమీల కనిపించిన వారందరికీ చెప్పుకుంటూ బోరున విలపిస్తోంది.
అంబులెన్స్‌లు, డాక్టర్లు అక్కడే ఉన్నా..
ప్రమాదకర స్థితిలో ఉన్న రైతు కోటేశ్వరరావును కాపాడేందుకు తమ సిబ్బంది ప్రయత్నించారని గుంటూరు జిల్లా రూరల్ ఎస్సీ ప్రకటించారు. పోలీసులు రైతును భుజాలపై ఎత్తుకొని వెళుతున్న వీడియో క్లిప్పింగ్‌ను విడుదల చేశారు. అయితే, ముఖ్యమంత్రి సభ సందర్భంగా అక్కడ అంబులెన్స్‌తోపాటు వైద్యులు సైతం అందుబాటులో ఉన్నారు. ఫోన్ చేస్తే నిమిషాల్లో చేరేంత దూరంలో వైద్యులు ఉన్నప్పటికీ ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు విద్యుత్ శాఖకు చెందిన వ్యానులో కోటేశ్వరరావును అక్కడి నుంచి తరలించిన పోలీసులు ఆసుపత్రిలో కాకుండా మొదటి చెక్‌పోస్టు వద్ద వదిలేశారు. హెలిప్యాడ్ సమీపంలో అంబులెన్స్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడికి తీసుకెళ్లలేదు. కేసును తప్పుదారి పట్టించడానికే ఇలా చేశారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కోటేశ్వరరావును తరలించే క్రమంలోనే అక్కడక్కడా పంట ధ్వంసమైందని పోలీసులు వాదిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ వేదికపై మాట్లాడుతూ.. పోలీసుల వైఖరి కారణంగానో, మరే ఇతర కారణం వల్లనో రైతు అవమానంగా భావించి తీవ్ర మనస్తానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. బాధితుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నష్టపరిహారం ప్రకటించారు.
పొలం అమ్మేసి అప్పులు తీర్చాడు
రైతు కోటేశ్వరరావు మృతి నేపథ్యంలో కొత్తపాలెం గ్రామంలో సోమవారం భారీగా మోహరించిన పోలీసులు మంగళవారం సైతం మఫ్టీలో నిఘా ఏర్పాటు చేశారు. దీనికి తోడు రైతుకు అప్పులు ఉన్నాయని కొందరు ప్రచారం సాగించారు. కోటేశ్వరరావుకు గతంలో అప్పులు ఉండగా సొంత పొలం ఐదు ఎకరాలు విక్రయించి అవన్నీ తీర్చేశాడని, 14 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నాడని, ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని బంధువులు చెబుతున్నారు. అన్నింటికీ మించి ఏ తప్పూ జరగనప్పుడు, సీఎం పరిహారం ప్రకటించక ముందే డబ్బులిస్తాం, రాజీ చేసుకోవాలంటూ అనధికార చర్చలు జరపాల్సిన అవసరం ఏమొచ్చిందని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కేసును పక్కదారి పట్టించే కుట్ర జరుగుతున్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి. పోస్టుమార్టం నివేదికను తారుమారు చేసేలా ఉన్నతస్థాయి నుంచి ఒత్తిళ్లు మొదలైనట్లు సమాచారం.
భయభ్రాంతులకు గురిచేసి...
రైతు కోటేశ్వరరావుతో పాటు తోడుగా వెళ్లిన జీతగాడైన పున్నారావు కోసం గ్రామస్థులు సంఘటన స్థలంలో పోలీసులను వాకబు చేశారు. అయితే, అతడు ఎక్కడున్నాడో తమకు తెలియదని పోలీసులు సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే సమీప పొలాల్లో గాలించిన గ్రామస్థులకు పున్నారావు పోలీసుల వాహనంలోనే దర్శనమిచ్చాడు. అతడి సెల్‌ఫోన్ సైతం సమీపంలో ఉన్న ఓ పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చేతిలో ఉండటం గమనార్హం. ఏం జరిగిందని పున్నారావును గ్రామస్థులు ప్రశ్నించగా, అతని వద్ద నుంచి సమాధానం లేదు. దీంతో పున్నారావును పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి ఉంటారని భావిస్తున్నారు. పోలీసుల తప్పు లేకుంటే పున్నారావును ఎందుకు వాహనంలో బంధించారు అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.
పోలీసుల బుకాయింపు
పోలీసులు కొట్టడం వల్లే రైతు కోటేశ్వరరావు మృతిచెందాడని బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కానీ, తమకేమీ తెలియదంటూ పోలీసులు బుకాయిస్తున్నారు. పోలీసులు చెబుతున్న దానికి, సంఘటన జరిగిన తీరుకు పొంతన లేకుండా ఉందని గ్రామస్థులు అంటున్నారు. ముఖ్యమంత్రి సభ సందర్భంగా కోటేశ్వరరావు పొలంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. వారు ఉదయం నుంచి పొలంలోని బొప్పాయిలు కోసుకుని తినడంతోపాటు సంచుల్లో వేసుకున్నట్లు కోటేశ్వరరావు గుర్తించాడు. అంతేకాకుండా పొలంలోని చెట్లన్నీ విరిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందనే బాధతో పోలీసులను ప్రశ్నించాడు. ఆ తర్వాత ఏం జరిగిందో బయటపడాల్సి ఉంది.
అనుమానాలు ఎన్నెన్నో...
- రైతు కోటేశ్వరరావు నిజంగా పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటే అక్కడిక్కడే మృతిచెందే అవకాశం లేదు. కనీసం నోటివెంట నురగ అయినా వచ్చి ఉండేది.
- పోలీసులు కోటేశ్వరరావును రక్షించడానికే భుజాలపై మోసుకుంటూ వెళ్లినట్లయితే నేరుగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి ఉండేది. కానీ, అందుకు భిన్నంగా మార్గమధ్యంలో గ్రామస్థులకు ఎందుకు అప్పగించారు?
- కోటేశ్వరరావు ఇంట్లో పనిచేస్తున్న పున్నారావు నోరు విప్పేందుకు కూడా భయపడుతున్నాడంటే అందుకు పోలీసుల బెదిరింపులే కారణమా?
- పోలీసుల వాహనంలో పున్నరావును ఎందుకు దాచి ఉంచారు? అతడి సెల్‌ఫోన్ పోలీసుల వద్ద ఎందుకు ఉంచుకున్నారు?
- రైతు కోటేశ్వరరావు మృతికి పోలీసులు కారణం కాకపోతే గ్రామంలోకి ఎవరూ వెళ్ళకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
- పోలీసుల తప్పేమీ లేకపోతే రూ.3 లక్షలు ఇస్తాం, గొడవ పెద్దది కాకుండా ముగించడంటూ డీఎస్పీ, ఆర్డీవో బేరసారాలు ఆడాల్సిన అగత్యం ఏమిటి?
- నిజంగా రైతుది ఆత్మహత్య అని తేలితే అనుమానాస్పద మృతి కింద కేసు ఎందుకు నమోదు చేశారు?
- అనుమానాస్పద మృతి కింద కేసు నమోదైన తరువాత పోస్టుమార్టం నివేదిక, ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు వచ్చిన తరువాత దాని ఆధారంగా అది హత్యా? ఆత్మహత్యా? అనేది నిర్ధారించుకుని చార్జిషీట్ వేస్తారు. పోస్టుమార్టం నివేదిక రాకుండానే రైతుది ఆత్మహత్య అని జిల్లా ఎస్పీ ఎలా చెబుతారు?
- కోటేశ్వరరావును రక్షించేందుకు ప్రయత్నించామని పోలీసులు చెబుతున్నారు. అదే నిజమనుకుంటే.. ముఖ్యమంత్రి సభ వద్దే అంబులెన్సులు, వైద్యులు ఉన్నారు. ప్రాథమిక చికిత్స అక్కడే అందించవచ్చు. మరి అందుకు భిన్నంగా ఇతరుల వాహనంలో ఎక్కించి ఎందుకు తరలించారు?
పోలీసులు కొట్టడం వల్లే మరణించాడు
కొండవీడు ఉత్సవాల మొదటి రోజే నా భర్తతో కలిసి బొప్పాయి కాయలు తెచ్చుకునేందుకు తోటకు వెళ్లాం. ఆరోజే మాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రెండో రోజు నా భర్త నీళ్లు పెట్టి వస్తానంటూ పొలానికి వెళ్లాడు. పోలీసులు కొడుతున్నారని ఫోన్‌చేసి చెప్పాడు. పోలీసులు కారణంగానే నా భర్త మరణించాడు.
– ప్రమీల, రైతు కోటేశ్వరరావు భార్య
రూ.3 లక్షలు ఇస్తామన్నారు
మా నాన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దుష్ప్రచారం చేస్తున్నారు. అది అవాస్తవం. మా నాన్న మృతి చెందాక డీఎస్పీ, ఆర్డీవో వచ్చి రూ.3 లక్షలు చెల్లిస్తాం, వివాదం లేకుండా చూడాలని గ్రామపెద్దలతో బేరసారాలు సాగించారు.
– పి.వీరాంజనేయులు, కోటేశ్వరరావు కుమారుడు
పోలీసులే పొట్టన పెట్టుకున్నారు
మా అన్న ఎంతో ధైర్యవంతుడు. గతంలో అప్పులు ఉంటే సొంత పొలం విక్రయించి తీర్చేశాడు. ప్రస్తుతం పంట పెట్టుబడి కోసం బంగారం తాకట్టు పెట్టాడు. ఫలసాయం చేతికి వచ్చే వేళ ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం లేదు. అరగంట ముందు పొలం వద్ద నాకు పుచ్చకాయ కొనిచ్చి వెళ్లాడు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే చనిపోయాడన్న వార్త అందింది. పోలీసులే మా అన్నను పొట్టన పెట్టుకున్నారు
– ఎం.సుబ్బాయమ్మ, కోటేశ్వరరావు సోదరి
Comments
Please login to add a commentAdd a comment