చంద్రబాబు ‘ప్రజాగళం’ అట్టర్ ప్లాప్
జనాలు గుమిగూడేదాకా బస్సులోనే బాబు ఎదురుచూపులు
సరైన స్పందన లేకపోవడంతో ఫ్రస్టేషన్‌లో ప్రతిపక్ష నేత
ఏపీ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు
కావలి/కోవెలకుంట్ల: ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ప్రభుత్వానికి ఎదురు తిరిగితే పోలీసులు వస్తారు. కేసు పెడతారు. తర్వాత సీబీసీఐడీ వారు వస్తారు. వాళ్లు అరెస్ట్ చేస్తారు. జైల్లో పెడతారు. జైల్లో కొడతారు. టార్చర్ చేస్తారు. కొంతమంది పోలీసులు చంపేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు’ అంటూ పోలీసుల ఆత్మగౌరవాన్ని, నిబద్ధతను కించపరిచేలా మాట్లాడారు. ఇక.. అధికారం కోసం మళ్లీ ఆయన ఇస్తున్న ఎన్నికల హామీలపై సెటైర్లు పడుతున్నాయి.
అధికారంలోకి వస్తే ‘వర్క్ ఫ్రం హోం’ తీసుకొస్తానని చంద్రబాబు అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్(ఈ స్కాంలోనే ఆయన అరెస్టైంది)తో అందరికీ ఉద్యోగావకాశాలు కల్పిస్తానన్నారు. వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి లాభాల బాట పట్టిస్తానన్నారు. ఒకప్పుడు ఏ నోటితో అయితే వలంటీర్లను విమర్శించారో.. ఇప్పుడు అదే వలంటీర్లపై వరాల జల్లు కురిపించే యత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తే వలంటీర్లను తొలగించబోమని చెప్పారు.
మళ్లీ అరిగిపోయిన రీల్ వేసి.. హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేసింది తానేనన్నారు. హైటెక్ సిటీ, ఔటర్‌రింగ్‌రోడ్, విమానాశ్రయం అంటే తన పేరే గుర్తుచేసుకుంటారని చెప్పారు. టెక్నాలజీ, సెల్‌ఫోన్లు, పవర్ సెక్టార్ తన చలువేనన్నారు.
బస్సులోనే పడిగాపులు: సభకు జనాలు రాకపోవడంతో చంద్రబాబు గంటకుపైగా బస్సులోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజాగళం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఒక్కొక్కరికి రూ. 500 వంతున ఇచ్చి తీసుకువచ్చిన జనాలు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెనుదిరిగారు.
కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిపై అసంతృప్తితోనే పార్టీ నేతలు, కార్యకర్తలు సభకు ముఖం చాటేశారని చెబుతున్నారు. ఆటోల్లో తీసుకువచ్చిన జనాలకు ‘రాజరాజేశ్వరి ఐస్’ కంపెనీ పేరుతో ఉన్న స్లిప్పులను సభాస్థలి వద్దే పంపిణీ చేశారు. వెళ్లేటప్పుడు స్లిప్ ఇచ్చి రూ.500 తీసుకోవాలని సూచించారు. పోలీసులు, ఎన్నికల నిఘా సిబ్బంది ముందే స్లిప్పులు పంపిణీ చేస్తున్నా ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment