సాక్షి, విజయవాడ : గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో రైతు కోటేశ్వరరావు మృతి ఘటన ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సర్కారు పెద్దల తీరు తీవ్ర వివాదస్పదమవుతోంది. అన్నదాత మరణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సర్కారు పెద్దలు, పోలీసులే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోటేశ్వరరావు పొలాన్ని ఆక్రమించడం, చేతికొచ్చిన బొప్పాయి తోటను ధ్వంసం చేయడం, ప్రశ్నించిన పాపానికి చితకబాదడం.. ఇవీ కోటేశ్వరరావు మృతికి ప్రధాన కారణమైనట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా పోలీసులు చివరి సమయంలో అనుసరించిన తీరు కూడా వివాదస్పదమవుతోంది.
గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు మాత్రం కోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ముందే ఆత్మహత్య చేసుకున్నాడని మీడియాకు తెలిపారు. తమ పోలీసులే కోటయ్యను భుజాలపై ఆసుపత్రికి మోసుకెళ్లారని చెప్పారు. కానీ, ఎస్పీ వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీ చెప్పినదాంట్లో కొంతమాత్రమే నిజమని, కోటయ్యను పోలీసులు మొదటి చెక్‌పోస్ట్ వరకే తీసుకొచ్చి.. వదిలేశారని, దీంతో అక్కడి నుంచి తాము భుజాల మీద రెండో చెక్‌పోస్ట్ వద్దకు తెచ్చామని వారు స్పష్టం చేస్తున్నారు. కోటయ్యను పోలీసులే ఆస్పత్రి వరకు తీసుకెళితే.. మధ్యలో రైతుల భుజాలపైకి ఆయన ఎలా వచ్చారని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కోటయ్య పొలంలో వాడని పురుగుల మందుడబ్బా అక్కడికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కోటయ్య ఆత్మహత్యాయత్నం చేశారని చెబుతున్న పోలీసులు.. వెంటనే ఆయనను ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? కోటయ్య ముఖంపై గాయలు ఎలా అయ్యాయని స్థానికులు అడుగుతున్నారు. కోటయ్యను మొదటి చెక్‌పోస్ట్ వరకు పోలీసులు తీసుకొచ్చి వదిలేయడంతో.. అక్కడి నుంచి రెండో చెక్‌పోస్ట్ వరకు తాము భుజాలపై మోసుకెళ్లామని, అక్కడి నుంచి ఫిరంగిపురం ఆస్పత్రికి తీసుకొచ్చినా.. అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారని, దీంతో మృతదేహాన్ని తీసుకుని రోడ్డుపై కూర్చున్నామని, ముఖ్యమంత్రి వస్తున్నాడని పోలీసులు తరిమేశారని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment