చంద్రబాబు సభ కోసం రైతును చంపేశారు | Tragedy death of a farmer because of Chandrababu Meeting | Sakshi
Sakshi News home page

సీఎం సభ కోసం రైతును చంపేశారు

Published Tue, Feb 19 2019 3:00 AM | Last Updated on Tue, Feb 19 2019 9:44 AM

Tragedy death of a farmer because of Chandrababu Meeting - Sakshi

చేతులపైనే కోటయ్యను మోసుకెళ్తున్న గ్రామస్థులు.. ఇన్‌సెట్‌లో కోటయ్య(ఫైల్‌)

చిలకలూరిపేట: చారిత్రక కొండవీడు కోటలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఓ రైతు కుటుంబం ఇంట్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సభ పేరుతో కాపుకొచ్చిన పండ్ల తోట, పూల తోటను ధ్వంసం చేయడం, పొలంలోకి రాకుండా తనను అవమానించడంతో ఓ రైతన్న తల్లడిల్లాడు. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి పోలీస్‌ దెబ్బలకు రైతు నేలకొరిగిన ఘటన సోమవారం గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. కొన ఊపిరితో ఉన్న తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అనుమతించాలని మృతుడి కుమారుడు వేడుకున్నా సీఎం వస్తున్నారంటూ పోలీసులు అందుకు అంగీకరించలేదు. 

సీఎం హెలికాప్టర్‌ దిగేందుకు.. 
చారిత్రక కొండవీడు కోట ఘాట్‌ రోడ్డు ప్రారంభోత్సవం సందర్బంగా ప్రభుత్వం రెండురోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సోమవారం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో కొండకింద ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి  చంద్రబాబు హెలికాప్టర్‌ దిగేందుకు వీలుగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ సమీపంలో గ్రామానికి చెందిన పిట్టల కోటేశ్వరరావు (40) సుమారు 14 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఇందులో బొప్పాయి, మునగ, కనకాబరం తోటలు సాగు చేస్తున్నాడు. సీఎం రాక నేపథ్యంలో పొలంలో కొంత భాగాన్ని దౌర్జన్యంగా పార్కింగ్‌ కోసం లాక్కున్నారు. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామానికి చెందిన పున్నారావుతో కలిసి కోటేశ్వరరావు తన పొలం వద్దకు వెళ్లగా తోటలోకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఎం వస్తున్నందున ఈ ప్రాంతమంతా తమ ఆధీనంలో ఉందంటూ అడ్డు చెప్పారు. 

పోలీసులు కొడుతున్నారంటూ ఫోన్‌ చేసి చెప్పిన రైతు..
కాపుకొచ్చిన బొప్పాయి తోటలో చొరబడి నాశనం చేయడంతోపాటు ఇష్టారాజ్యంగా కాయలు కోయడాన్ని చూసి ఇదేం అన్యాయమంటూ కోటేశ్వరరావు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు విచక్షణా రహితంగా రైతు కోటేశ్వరావుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో రైతుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ నేపథ్యంలో తనను పోలీసులు తీవ్రంగా కొడుతున్నారంటూ బంధువులకు ఫోన్‌ ద్వారా కోటేశ్వరరావు సమాచారం అందించాడు. ఈ విషయం తెలియడంతో కోటేశ్వరరావు కుమారుడు ఆంజనేయులు పలువురు గ్రామస్తులతో కలిసి పొలానికి చేరుకున్నారు. అక్కడ తన తండ్రి కనిపించకపోవటంతో పోలీసులను ప్రశ్నించాడు. అయితే ఎక్కడున్నాడో తమకు తెలియదని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అనంతరం పొలంలో గాలించగా కోటేశ్వరరావు కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతూ కనిపించాడు.

కాళ్లు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు...
కొన ఊపిరితో ఉన్న తన తండ్రి కోటేశ్వరరావును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాలంటూ ఆంజనేయలు పోలీసులను ప్రాధేయపడ్డాడు. ‘మీ కాళ్లు పట్టుకుంటా.. నాన్నను తీసుకువెళ్లనివ్వండి’ అంటూ కన్నీటితో బతిమలాడినా.. ‘సీఎం వచ్చే సమయమైంది. ఇప్పుడు కుదరదు’ అంటూ కరకు సమాధానం లభించిందని ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యాడు. సీఎం వస్తున్నారంటూ అంబులెన్స్, ఆటోలను కూడా రానివ్వలేదు. చేసేదిలేక చేతులపైనే కోటయ్యను గ్రామస్థులు మోసుకెళ్లారు. మార్గమధ్యలోనే కోటయ్య ప్రాణాలు విడిచాడు.

సీఎం రాకకు ముందు శవం తరలింపు...
సీఎం రాకకు కొద్ది క్షణాల ముందు కోటేశ్వరరావు మృతదేహాన్ని గ్రామంలోకి వ్యానులో తెచ్చి ఇంటి సమీపంలోని బజారులో దించేశారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లేందుకు వారంతా సిద్ధమవుతుండగా.. చనిపోయాక తీసుకువెళ్లి ప్రయోజనం ఏముంటుందని పోలీసులు పేర్కొనడంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు అక్కడే నిరసనకు దిగారు. మృతదేహం వద్ద విలపిస్తూ గంట పాటు బైఠాయించి ఆందోళనకు చేపట్టారు.



అధికారుల చర్చలు... 
అనంతరం పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని... ‘జరిగిందేదో జరిగింది. వివాదం ఎందుకు? మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకువెళ్లండి’ అని వారిని ఆదేశించారు. పోలీసులు భారీగా చుట్టుముట్టి మృతదేహాన్ని ఇంట్లోకి తరలించారు. పోలీసుల తీరుపై మృతుడి బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, ఆర్డీవో కె.శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని మృతుడి బంధువులతో చర్చలు జరిపారు. 

అలాంటి అనవాళ్లే లేవన్న గ్రామస్థులు..
పోలీసులతో జరిగిన ఘర్షణ నేపథ్యంలో కోటేశ్వరరావు మనోవ్యధతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొనడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మండిపడ్డారు. కోటేశ్వరరావు ఎంతో ధైర్యవంతుడని, ఆత్మహత్యకు పాల్పడే ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. పురుగుమందు తాగితే వెంటనే చనిపోరని, నోటినుంచి నురగ రావటం సర్వసాధారణమని, అయితే కోటేశ్వరరావు విషయంలో అలాంటి ఆనవాళ్లు ఏమీ లేవని పేర్కొంటున్నారు. కోటేశ్వరరావును పోలీసులే కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే పురుగులమందు డబ్బా తెచ్చి మృతదేహం సమీపంలో చల్లారని ఆరోపిస్తున్నారు. పండుగ పేరుతో రైతు ఊసురు తీశారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రచారం చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సీఎం సైతం... 
అనంతరం సభ ముగిసే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల వైఖరి కారణంగానో, కుటుంబ సమస్యల కారణంగానో పిట్టల కోటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బహిరంగ వేదిక నుంచి ప్రకటించారు. కారణాలు ఏవైనా ఆత్మహత్యకు పాల్పడరాదని, ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని సీఎం పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి రూ. 5 లక్షలు నష్ట పరిహారంగా అందించనున్నట్లు ప్రకటించారు.

వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు... 
కోటేశ్వరరావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పార్టీ నాయకులతో కలిసి సీఎం రాకముందే  కొత్తపాలెం గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆమెను, పార్టీ నాయకులను మృతుడి ఇంటివద్దకు వెళ్లకుండా గ్రామ శివారులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విధిలేని పరిస్థితుల్లో విడదల రజని ఫిరంగిపురంలోని పార్టీ నేత భాస్కరరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమెను అనుసరించిన పోలీసులు అక్కడ భారీ ఎత్తున మోహరించారు.

సీఎం వెళ్లిపోయిన అనంతరం అనుమతి..
సీఎం వెళ్లిపోయిన అనంతరం పోలీసులు రజనిని అనుమతించటంతో  రాత్రి కొత్తపాలెం చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్‌ కొత్తపాలెం చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement