టీడీపీకి ఇప్పుడు జ్ఞానోదయమైంది... | Raghuveera reddy comments on TDP-Congress alliance | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఇప్పుడు జ్ఞానోదయమైంది...

Published Wed, Feb 20 2019 10:59 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Raghuveera reddy comments on TDP-Congress alliance  - Sakshi

సాక్షి, అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీతో పాటు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆసక‍్తికర వ్యాఖ్యలు చేశారు. 35 ఏళ్లు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన టీడీపీకి ఇప్పుడే జ్ఞానోదయం అయిందని అన్నారు. కాంగ్రెస్‌తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాలర్‌ ఎగరేసి తిరగాలని రఘువీరా పేర్కొన్నారు. టీడీపీ తప్పులను పక్కనపెట్టాలని ఆయన సూచించారు.

ఢిల్లీ రాజకీయాలు వేరన్న రఘువీరా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు భిన్నమైనవని చెప్పుకొచ్చారు. ఏపీలో పొత్తులపై రఘువీరా రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో పొత్తులు పెట్టుకోవాలా లేక ఒంటరిగా పోటీ చేయాలన్న దానిపై త్వరలో రోజుల్లో స్పష్టత వస్తుందని ... రాష్ట్ర పార్టీలోనూ పొత్తు కావాలి,  పొత్తు వద్దు అనే నాయకులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక రైతు కోటయ్య మృతి వెనుక ఉన్న వివాదాల జోలికి తాము వెళ్లమని, వ్యవసాయ వ్యతిరేక విధానాలే కోటయ్య మరణానికి కారణమని భావిస్తున్నామని రఘువీరా తెలిపారు.

కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసిన ఈ రెండు పార్టీలను ప్రజలు ఏమాత్రం ఆదరించలేదు సరికదా, రెండోసారి కూడా టీఆర్ఎస్‌కే పట్టం కట్టారు. గత ఎన్నికల్లో బీజేపీతో జత కట్టిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎన్డీయే సర్కార్‌ నుంచి బయటకు వచ్చేసిన విషయం విదితమే. తాజాగా ఆయన కాంగ్రెస్ చేయందుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ సర్కార్‌ను గద్దె దించేందుకు పొత్తులపై కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నారు.



 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement