
గత రెండేళ్లలో(2019–2020) దేశవ్యాప్తంగా 15.5 లక్షల సైబర్ సెక్యూరిటీ దాడులు సంభవించాయని, ఒక్క 2020లోనే 11.58 లక్షల సమస్యలు నమోదయ్యాయని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది.
సాక్షి, న్యూఢిల్లీ: గత రెండేళ్లలో(2019–2020) దేశవ్యాప్తంగా 15.5 లక్షల సైబర్ సెక్యూరిటీ దాడులు సంభవించాయని, ఒక్క 2020లోనే 11.58 లక్షల సమస్యలు నమోదయ్యాయని కేంద్రం లోక్‌సభలో వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ ప్రమాదాలపై జాతీయ స్థాయిలో సీఈఆర్‌టీ-ఇన్(ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్) పరిశోధన చేస్తుందని హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రాతపూర్వక సమాధానంలో తెలిపారు. 2020 ఐటీ చట్టం సెక్షన్ 70బీ నిబంధనల ప్రకారం ఈ సంస్థ వ్యవహరిస్తుందన్నారు. 2019లో 3.95 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగాయన్నారు. ఆయా రంగాల్లో మాల్‌వేర్ ప్రమాదాల గురించి సిట్యువేషనల్ అవేర్‌నెస్ సిస్టమ్స్, థ్రెట్ ఇంటిలిజెన్స్ సోర్సుల నుంచి సీఈఆర్‌టీ సమాచారం సేకరిస్తుందన్నారు. ఏదైనా సైబర్ సెక్యూరిటీ ఘటన సంస్థ దృష్టికి రాగానే సదరు వ్యవస్థను హెచ్చరించి తగిన సలహాలిస్తుందని, తదుపరి చర్యల కోసం ఆయా విభాగాలకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కు సమాచారమందిస్తుందని తెలిపారు.