సాక్షి, కరీంనగర్: సోమవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో జిల్లాకు చెందిన లోకసభ సభ్యులు ఇక్కడి సమస్యలపై గళం విప్పుతారా? వారికి ఆ అవకాశం లభిస్తుందా? జాతీ య ప్రాధాన్యం ఉన్న అనేక అంశాలపై వివాదాలున్నందున సమావేశాలు సజావుగా సాగుతా యా? ప్రజా సమస్యలు ప్రస్తావనకు వచ్చే వీ లుంటుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని, దాదాపు ఇవే పార్లమెంటు చివరి స మావేశాలు కావచ్చునని ప్రచారం జరుగుతోం ది.
తాము ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చేందుకు ఈ సమావేశాలను వాడుకోవాలని ఎంపీలు పొన్నం ప్రభాకర్, జి.వివేక్ భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కారణంగా చాలాకాలం పాటు సమావేశాలకు దూరంగా ఉండా ల్సి వచ్చింది. ఫలితంగా జిల్లా సమస్యలు చర్చ కు తేలేకపోయారు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వేలైను పూర్తి, కరీంనగర్ నుంచి సికింద్రాబాద్‌కు సిద్దిపేట మీదుగా కొత్త రైల్వేలైను కోసం సర్వే, కరీంనగర్-తిరుపతి రైలు వారానికి రెం డు రోజులపాటు నడిపించడంతోపాటు ఎంపీ పొన్నం ప్రభాకర్ వివిధ హామీలు ఇచ్చారు. వీటిని కార్యరూపంలోకి తెచ్చేందుకు ఆయా శాఖల మంత్రులను కలిసి ప్రయత్నాలు చేశా రు.
ఈ అంశాలను లోకసభలో లేవనెత్తితే త్వరి తంగా చేపట్టే అవకాశం ఉండేదన్న అభిప్రా యం ఉంది. కానీ తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలు తమకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని, తమ ఆకాంక్షలను నెరవేరుస్తారని భావించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. కా రణాలేవైనా ఎంపీలు ప్రజల నమ్మకాలకు తగ్గట్టుగా వ్యవహరించలేకపోయారు. కేంద్ర ప్రభు త్వ పరంగా జిల్లాకు శాశ్వత ప్రయోజనాలు సాధించే ప్రయత్నాలు అంతగా జరగలేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగయడంతో పాటు జిల్లా అవసరాలకు సంబంధించి నిర్ధిష్ట ప్రణాళిక లేకపోవడం ఇందుకు కారణం.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించిన ఫలితాలు కూడా అర్హులకు అందని పరిస్థితి ఉం ది. విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఉన్నా పథకాలు పక్కదారి పడుతున్నాయి. సమస్యల విషయంలో అసంతృప్తి ఉన్నా లోకసభ సభ్యులుగా ప్రభాకర్, వివేక్ తెలంగాణ ఉద్యమంలో మాత్రం క్రియాశీల పాత్ర నిర్వహించారు. పార్లమెంటు వేదికగా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించారు. తెలంగాణ అంశంలో కాంగ్రెస్ వైఖరికి నిరసనగా పార్టీ వీడిన వివేక్ ఈసారి టీఆర్‌ఎస్ ఎంపీగా సమావేశాలకు హాజరవుతున్నారు. దీంతో జిల్లా నుంచి లోకసభలో కాంగ్రె స్ ప్రాతినిధ్యం సగానికి తగ్గిపోయింది.