కలెక్టరేట్, న్యూస్‌లైన్ : దేశంలోనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందిస్తున్నాం. వీటి ద్వారా కౌలుదారులు ఇప్పటివరకు పడుతున్న కష్టాలు తీరనున్నాయి. వారికి బ్యాంకుల నుంచి అప్పులు ఇప్పిస్తాం. గుర్తింపు కార్డు ఉంటే చాలు బ్యాంకుల్లో అప్పులు తీసుకోవచ్చు... అంటూ ప్రభుత్వం చేసిన ఆర్బాటపు ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది.
జిల్లావ్యాప్తంగా కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పులు పుట్టకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని వాటిని చెల్లించలేక ఆందోళన చెందుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పటికీ బ్యాం కర్లు మాత్రం మొహం చాటేస్తున్నారు. పట్టాదారు, కౌలుదారుల మధ్య నెలకొం టున్న వివాదాలను సాకుగా చూపి రుణాలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు పట్టాదారులు పంటరుణాలు తీసుకుంటుండడంతో కౌలుదారులకు రుణాలు దక్కడం లేదు. జిల్లాలో 2013-14 సంవత్సరంలో 9,416 మందిని కౌలుదారులుగా గుర్తించగా, ఇందులో 7,256 మంది కొత్తవారు కాగా, 2,210 మందిని రెన్యూవల్ చేశారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 586 మందికే రూ.1.95 కోట్లు రుణాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. రెన్యూవల్ చేసిన 2,210 మందికి కూడా రుణాలు మంజూరు చేయకపోవడం కౌలు రైతుల కష్టాలకు నిదర్శనం. గతేడాది 8వేల మందిని గుర్తించినా, 3800 మందికి మాత్రమే రూ.8.26 కోట్ల రుణాలు పంపిణీ చేశారు.
జిల్లావ్యాప్తంగా 80వేల మంది..
జిల్లావ్యాప్తంగా దాదాపు 80వేల మంది కౌలుదారులు ఉన్నట్లు అంచనా. వీరిలో చాలా మంది అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోలేదు. దరఖాస్తు చేసుకున్న వారిలో కూడా అధికారులు కుంటిసాకులు చెబుతూ చాలా మందిని పట్టించుకోలేదు. కౌలుదారులుగా గుర్తించిన వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖంగా లేరు. దీనంతటికి అధికారుల వైఫల్యమే కారణమని స్పష్టమవుతోంది. గుర్తింపు కార్డుల జారీ సమయంలో గ్రామ సభలు పెట్టి రెవెన్యూ రికార్డులు పరిశీలించి రైతులను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
కానీ గ్రామ సభలు నిర్వహించకుండానే పలు మండలాల్లో కౌలు రైతుల ఎంపిక జరిగిపోయిందన్న విమర్శలున్నాయి. భూ యజమానుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయలేకపోవడం వల్ల కూడా కౌలు రైతుల దరఖాస్తులు చేసుకోలేకయారని ఆరోపణలున్నాయి. భూమిని వరుసగా ఎవరైనా పన్నెండేళ్ల పాటు సాగు చేస్తే అది వారికే సొంతమవుతుందనే అనుమానం భూ యజమానుల్లో నెలకొంది. దీంతోపాటు కౌలు రైతుల రుణం తమకు చుట్టుకుందనే అనుమానాలు ఉన్నాయి.
పొలాన్ని ఒకటి రెండు సీజన్లకు కౌలుకు తీసుకుంటూ సాగు సమయంలో ప్రకృతి విపత్తుల తలెత్తి అప్పులు తీర్చలేకపోతే బ్యాంకులకు తిరిగి చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తిరిగి చెల్లిస్తారో లేదో అన్న అనుమానాలతో కూడా బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. రైతులు తీసుకున్న రుణాలను బ్యాంకులు రీ షెడ్యూల్ చేసేందుకు సైతం సుముఖంగా లేవు. ఈ విషయమై లీడ్ బ్యాంక్ మేనేజర్ డీఏ చౌదరి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ.. కౌలు రైతులందరికీ రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించామన్నారు.
కౌలుదారులపై చిన్నచూపు
Published Wed, Aug 7 2013 5:13 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
Advertisement