సిరిసిల్ల, న్యూస్‌లైన్ : డిగ్రీ చదువుకున్న వెంగల చక్రధర్‌కు ఉద్యోగం కరువైంది. కులవృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుందామని ఆశపడితే వస్త్ర పరిశ్రమ సంక్షోభం ఆ చేతులకు పనిలేకుండా చేసింది. అప్పుల బాధతో పచ్చని సంసారంలో చిచ్చు రేగగా, మానసిక సమస్యలూ చుట్టుముట్టడంతో ఆవేదనకు లోనైన చక్రధర్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చక్రధర్ ఇంట్లో అందరూ శ్రమించేవారే. తల్లి లక్ష్మీదేవి బీడీ కార్మికురాలు. తండ్రి భూపతి మరమగ్గాల కార్మికుడు. చెల్లెలు వీణ డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తోంది. ఇంట్లో అందరూ పనిచేస్తున్నా ఇల్లు గడ వడం కష్టంగానే ఉంది.
పద్మనగర్‌లో చిన్న పెంకుటిం ట్లో ఉంటున్న చక్రధర్ వారం రోజులుగా పని సరిగా లేక.. సాంచాలు నడవక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. ఏడాదిన్నర కిందట శాంతినగర్‌కు చెందిన కవితతో అతడికి పెళ్లయింది. పెళ్లికి రూ.లక్షన్నర వరకు అప్పులయ్యాయి. ఆ అప్పుల బాధలు.. చెల్లెలు పెళ్లికి ఎదగడం... వచ్చే ఆదాయం పొట్టపోసుకోవడానికే సరిపోతుండడంతో మానసిక వేదనకు గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లోనే సెల్‌ఫోన్‌లో పాటలు వింటూ పరదా చాటున కూర్చున్నాడు. ఇంట్లో ఎవరి పనుల్లో వారుండగా ఉరేసుకున్నాడు.
చేనేత దినోత్సవం వేళ..
ప్రపంచ చేనేత దినోత్సవం సంబరాలను సిరిసిల్లలో నేతన్నలు బుధవారం నిర్వహించగా.. ఆ సంబరాల మాటునే విషాదం చోటుచేసుకుంది. చక్రధర్ ఆత్మహత్య సంఘటన కార్మిక క్షేత్రంలో విషాదం నింపింది. సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమకు దిగుమతయ్యే యారన్ (నూలు) రేట్లు భారీగా పెరగడం, ఉత్పత్తవుతున్న పాలిస్టర్ గుడ్డకు మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆదాయం రాకపోవడంతో సిరిసిల్లలోని వస్త్రోత్పత్తిదారులు రెండు వారాలుగా పూర్తిస్థాయిలో వస్త్రోత్పత్తి చేయడం లేదు. దీంతో సిరిసిల్లలో పద్నాలుగు వేల మరమగ్గాలు మూతపడ్డాయి. ఎనిమిది వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఈ సంక్షోభమే ఓ యువకుడి నిండుప్రాణాన్ని బలితీసుకుంది.
భరోసా ఇవ్వని సర్కారు
రాష్ట్రంలోనే అత్యధికంగా 38 వేల మరమగ్గాలు జిల్లాలో ఉండగా... ఒక్క సిరిసిల్లలోనే 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి పాతికవేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి గురై ఇబ్బందులు పడుతుంటే భరోసా ఇవ్వాల్సిన సర్కారు నివేదికల పేరిట కాలయాపన చేస్తోంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి హయాంలో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు 35 కిలోల బియ్యం, ఇంటింటికీ పావలా వడ్డీ రుణాలను సంపూర్ణ ఆర్థిక చేకూర్పు ద్వారా అందించారు. జాబ్‌మేళాలు నిర్వహించి నేత కుటుంబాల యువకులకు ఉద్యోగాలిచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించి ఆదుకున్నారు.
ప్రస్తుత పాలకులు నేతన్న సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బుధవారం సాయంత్రం చేనేత జౌళిశాఖ అధికారులు ఆర్డీవో సమక్షంలో సమావేశమయ్యారు. పరిశ్రమను నడపాలని వస్త్రోత్పత్తిదారులను కోరారు. పెరిగిన నూలు రేట్లతో పరిశ్రమను నడపలేమని యజమానులు తేల్చిచెప్పారు. ప్రభుత్వం మాత్రం నేతన్నలను ఆదుకోవడానికి ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించకపోవడం శోచనీయం.
ఈ కన్నీళ్లకు బాధ్యులెవరు?
ఒక్కగానొక్క కొడుకు కళ్లెదుటే ఉరేసుకుని తనువు చాలిస్తే ఆ కన్నతల్లి గుండె చెరువైంది. గుండెలు బాదుకుంటూ ‘కొడుకా ఎంత పని చేసినావంటూ..’ లక్ష్మీదేవి చేస్తున్న రోదనలు అందరినీ కదిలించాయి. ‘అన్నయ్యా... ఎందుకీ పని చేశావని’ చెల్లెలు వేదనకు అంతేలేదు. ‘అయ్యో కొడుకా.. నేను సాంచాల్ పనికి పొయ్యేసరికి పాణం తీసుకుంటివి..’ అంటూ కన్న తండ్రి భూపతి కుమిలిపోతున్నాడు. అందరికి ఆ‘ధారమై’న చక్రధర్ ఇక సెలవంటూ.. ఈ లోకాన్ని వీడడంతో ఆ కన్నీళ్లకు బాధ్యలెవరు?. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘చితి’కిపోతున్నారు
Published Thu, Aug 8 2013 3:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
Advertisement
Advertisement