సాక్షిప్రతినిధి, కరీంనగర్ : నాలుగేళ్ల నాన్చివేత తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేశాయి. తెలంగాణ విషయంలో ఇన్నాళ్లు ప్రజాక్షేత్రంలో ఇబ్బందిపడ్డ కాంగ్రెస్ నేతలకు, శ్రేణులకు ఈ ప్రకటన కొత్త ఊపిరిపోసింది. వచ్చే సాధారణ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించవచ్చనే ఉత్సాహంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఉమ్మడిగా కృషి చేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం సమస్య కాదన్న ఆలోచనలో వారు ఉన్నారు.
అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై చేసిన ప్రకటన విషయంలో ఘనత ఎవరిదనే అంశంపై అధికార పార్టీ జిల్లా ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొనడం హస్తం శ్రేణుల్లో అయోమయం సృష్టిస్తోంది. అధిష్టానం ప్రకటన రావడానికి తమ కృషి కారణమంటే తమ కృషి కారణమంటూ మంత్రి శ్రీధర్‌రాబు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పోటాపోటీగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులే చర్చించుకుంటున్నాయి. తెలంగాణకు అనుకూలంగా జూలై 30న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసింది.
అనంతరం పొన్నం ప్రభాకర్ ఆగస్టు 3న జిల్లాకు వచ్చారు. తెలంగాణ ప్రకటనలో కీలకంగా వ్యవహరించారనే కారణంతో ఆయనకు అదే రోజు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ విషయంలో మొదటి నుంచి దూకుడుగా వ్యవహరించే పొన్నం తెలంగాణ ప్రకటనకు ముందు తాను నిర్వహించిన పాత్ర గురించి వివరించారు. పార్లమెంట్‌ను స్తంభింపజేశానని పేర్కొన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వచ్చిన తర్వాత జిల్లా స్థాయిలో పార్టీపరంగా జరిగిన మొదటి కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొంటారని అంతా భావించారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెలంగాణ ఎమ్మెల్యేల సమావేశం కారణంగా రాలేకపోయారని సభలో పలువురు నేతలు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రితో సమావేశం ఉదయమే ముగిసినా... మంత్రి అదే రోజు జిల్లాకు రాకపోవడంపై పార్టీ శ్రేణుల్లో వేరే రకంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రకటన విషయంలో ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఇష్టం లేకే మంత్రి రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి రాకూడదని మంత్రి ముందుగానే నిర్ణయించుకున్నారని... ఈ కారణంగానే మంత్రికి సన్నిహితంగా ఉండే డీసీసీ అధ్యక్షుడు కొండూరి రవీందర్‌రావు కూడా గైర్హాజరయ్యారని చెప్పుకుంటున్నారు. పార్టీపరంగా జరిగిన ఈ కార్యక్రమంతోపాటు పలు ఉద్యోగ, సామాజిక, కుల సంఘాలు అదే రోజు పొన్నం ప్రభాకర్‌ను సన్మానించాయి. మరుసటి రోజు ఆదివారం కూడా వివిధ సంఘాలు పొన్నం ప్రభాకర్‌ను అభినందించాయి. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలుకావడంతో పొన్నం ఆదివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిపోయారు. ఇలా ఒకరోజు గడిచాక... తెలంగాణ ప్రకటనపై మంత్రి శ్రీధర్‌బాబు కాార్యక్రమాలకు అంకురార్పన జరిగింది. మంగళవారం తెల్లవారుజామున మంత్రి జిల్లాకు చేరుకున్నారు.
వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సాధనలో తన పాత్రను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1999లోనే సోనియాంగాంధీని కోరిన వారిలో తాను ఒకరినని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా ఎంపీ పొన్నం ప్రభాకర్ కంటే ముందుగానే తెలంగాణ కోసం శ్రీధర్‌బాబు కృషి చేసినట్లుగా స్పష్టమవుతోందని మంత్రి వర్గీయులు చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చేది.. తెచ్చేది తామేనని చెప్పామని, ఎవరికీ ఏ అనుమానాలు ఉన్నా అదే నిజమయ్యిందని మంత్రి అన్నారు. అనంతరం శ్రీధర్‌బాబును కూడా ఉద్యోగ సంఘాలు సన్మానించాయి.
ఎంపీ పొన్నంను సన్మానించిన అన్ని సంఘాలు మంత్రి శ్రీధర్‌బాబుకు అభినందనలు తెలిపాయి. అయితే ఒక్కటిగా కాకుండా ఇలా వేర్వేరుగా సన్మానించడం, అభినందనలు తెలుపడం తమకు ఒకింత ఇబ్బందిగానే పరిణమించిందని ప్రైవేటు విద్యాసంస్థల సంఘం నేత ఒకరు చెప్పారు. ఇలా కాకుండా ముఖ్య నేతలు ఇద్దరు ఉమ్మడిగా వస్తే బాగుండేదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఊపిరిపోసే నిర్ణయంపై ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లాల్సిన ముఖ్య నేతలు గొప్పల కోసం పోటీపడి మొత్తం అంశాన్ని పక్కకునెట్టి వేస్తున్నారనే వాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎవరికి వారే..
Published Wed, Aug 7 2013 5:05 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement