నోటీసులివ్వద్దంటే ఎట్టా?
- మొండిబకాయిలున్న రైతులకు నోటీసులిస్తాం
- ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోంది
- సమావేశంలో ఎల్డీఎంకు తేల్చిచెప్పిన బ్యాంకర్లు
చిత్తూరు (అగ్రికల్చర్): ‘2011 నుంచి రుణాలు పేరుకుపోతున్నాయి. బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాలకు అసలుకంటే వడ్డీలే అధికమవుతున్నాయి. వీటిని మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. పేరుకుపోతున్న వడ్డీలు, అప్పులు మాకు నిద్రపట్టనివ్వడంలేదు. ఎలాంటి స్పష్టత లేకుండా నోటీసులు ఆపమంటే ఎలా?. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ పలువురు బ్యాంకర్లు లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజరు (ఎల్డీయం) వెంకటేశ్వరరెడ్డికి తేల్చి చెప్పారు.
శుక్రవారం స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయ సమావేశ భవనంలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. దీనికి డీఆర్‌డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఎల్డీఎం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినందున వారికి కొంత కాలంపాటు నోటీసులు ఇవ్వకుండా ఉండాలని కోరారు.
నోటీసులు ఇవ్వడం వల్ల రైతులు కంగారు పడుతున్నారని, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు నోటీసులు ఇవ్వకుండా ఆపాలని చెప్పారు. దీనిపై పలువురు బ్యాంకర్లు స్పందించారు. ‘రైతులకు నోటీసులు ఇవ్వద్దని చెబితే మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి’ అంటూ ఎల్డీఎంను ప్రశ్నించారు. 2011 నుంచి పలువురు రైతులు బంగారుపై తీసుకున్న రుణాలను కట్టలేదన్నారు. వారు పెట్టిన బంగారు కంటే రుణ మొత్తాలు అధికమవుతున్నాయని, ఆ ఓవర్ డ్యూస్ మొత్తాలు తామే కట్టాల్సి వస్తుందని తేల్చారు.
బంగారు రుణాలకు పట్టాదారు పాసుపుస్తకాలను నమోదు చేసుకోవడం కేవలం తక్కువ వడ్డీలు వర్తించేందుకు మాత్రమే అన్నారు. అవన్నీ పంట రుణాల కిందకు రావన్నారు. ప్రభుత్వం రైతుల రుణాలపై ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తే దానికి తాము ఏమి చేసేదంటూ నిట్టూర్చారు. రుణాల మాఫీ ఎప్పుడు చేస్తారనేదానికి గాని, ఎలాంటి రుణాలను, ఎంత మొత్తాలను మాఫీ చేస్తారనేదానిపైగానీ స్పష్టతరావడం లేదన్నారు.
కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తున్నందున రోజురోజుకూ పెరుగుతున్న ఓవర్ డ్యూస్ వడ్డీల భారం తమకు నిద్ర పట్టనీయడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చించి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు నోటీసులు ఇస్తూనే ఉంటామన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలు కూడా బ్యాంకు రుణాలను చెల్లించకుండా, నెలవారీ చెల్లింపు మొత్తాలను సంఘాల పొదుపుల్లో వేసుకుంటున్నారని చెప్పారు. దీనివల్ల కూడా తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.