హైదరాబాద్:రుణ మాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న సామాన్యుని ఆశలు తీరేటట్లు కనబడుటలేదు. ఎన్నికలకు ముందు పార్టీలు హామీలు గుప్పించినా.. ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలపై వెనుకడుగువేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎస్ మహంతికి బ్యాంకర్ల నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త రుణాలను ఇవ్వడానికి తాము సుముఖంగా లేమని వారు తేల్చిచెప్పారు.
పాత రుణాలను చెల్లిస్తేనే కొత్త రుణాలను పరిశీలిస్తామని సమావేశంలో బ్యాంకర్లు కరాఖండిగా చెప్పేశారు. ఈ అంశానికి సంబంధించి ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని మహంతి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 37 వేల 176 కోట్ల రుణాలున్నాయని వీటిపై ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మహంతి పేర్కొన్నారు.