CS mohanty
-
కొత్త రుణాలను చెల్లించేది లేదు!
హైదరాబాద్:రుణ మాఫీపై కోటి ఆశలు పెట్టుకున్న సామాన్యుని ఆశలు తీరేటట్లు కనబడుటలేదు. ఎన్నికలకు ముందు పార్టీలు హామీలు గుప్పించినా.. ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వాలు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలపై వెనుకడుగువేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర బ్యాంకర్ల సమావేశానికి హాజరైన సీఎస్ మహంతికి బ్యాంకర్ల నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. ఎట్టిపరిస్థితుల్లోనూ కొత్త రుణాలను ఇవ్వడానికి తాము సుముఖంగా లేమని వారు తేల్చిచెప్పారు. పాత రుణాలను చెల్లిస్తేనే కొత్త రుణాలను పరిశీలిస్తామని సమావేశంలో బ్యాంకర్లు కరాఖండిగా చెప్పేశారు. ఈ అంశానికి సంబంధించి ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు వెంటనే నిర్ణయం తీసుకోవాలని మహంతి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షా 37 వేల 176 కోట్ల రుణాలున్నాయని వీటిపై ఇరు ప్రాంతాల ప్రభుత్వాలు ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలని మహంతి పేర్కొన్నారు. -
రాష్ట్ర విభజనలో భాగంగా ఆలిండియా సర్వీసు
-
'ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నో ఆప్షన్స్'
న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ఎక్కడ పనిచేయాలోననే ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే అవకాశం (ఆప్షన్) ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ అయ్యారు. అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్ఎఫ్ అధికారుల విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 284మంది ఐఏఎస్ అధికారులు, 209మంది ఐపీఎస్ అధికారులు, 136మంది ఐఎఫ్ఎస్ అధికారులున్నట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. కేంద్ర సర్వీసు అధికారుల విభజన కోసం రాష్ట్రస్థాయిలో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ కమలనాథన్ నేతత్వంలో పనిచేస్తున్న కమిటీ పరిశీలనలు, అభిప్రాయాలను కూడా ప్రత్యూష్ సిన్హా కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఇక జాతీయ సర్వీసు అధికారుల విభజన ప్రక్రియలో నిర్దేశిత కోటా వారీగా ఉన్న డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీలను ఇన్సైడర్, అవుట్ సైడర్లుగా గుర్తించి వారిలో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ), షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) కేటగిరీలుగా విభజించనున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్వీసు అధికారులను ఇరు రాష్ర్టాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కేటాయింపుల కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) మాజీ అధికారి ప్రత్యూష్ సిన్హా నేతత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటయిన విషయం తెలిసిందే. -
కేంద్ర హోంశాఖ కార్యదర్శితో మహంతి భేటీ
న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి గురువారం కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశం అయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన, ఉద్యోగుల పంపిణీపై ఆయన చర్చిస్తున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు ఖరారు చేయనుంది. అలాగే ప్రత్యూష్ సిన్హా కమిటీతో కూడా మహంతి భేటీ కానున్నారు. ఐఏఎస్‌ల ఆప్షన్లపై గత కొంతకాలంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు కమలనాథన్ కమిటీ, ప్రత్యూష్ సిన్హా కమిటీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల్లో పాలనా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఎక్కడివారిని అక్కడనే నియమిస్తే మంచిదన్న అభిప్రాయంలో సీఎస్, ప్రత్యూష్ సిన్హా కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. -
ఆప్షన్లా?లాటరీయా?
ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై సిన్హా కమిటీతో మహంతి భేటీ ముందుగా అధికారుల అభిప్రాయాలు.. ఆ తర్వాతే మార్గదర్శకాలు ఈ నెల 15న రాష్ట్రానికి ప్రత్యూష సిన్హా కమిటీ.. అదేరోజు అభిప్రాయాల స్వీకరణ విభజనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంతృప్తి రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని కోరిన సీఎస్ సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో అఖిల భారత సర్వీసు అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? లేక లాటరీ విధానంలో కేటాయించాలా అనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీనిని నిర్ణయించే ముందు అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష సిన్హా కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతి శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలతో కమిటీకి నివేదిక అందించారు. రాష్ట్రం నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల అధికారుల వివరాలను, వారి స్థానికతను అందులో వివరించారు. వీరి పంపిణీకి ఏ విధానాన్ని అనుసరించాలన్న విషయంపై చర్చించారు. అయితే ఏ విషయంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. అధికారులకు అప్షన్లు ఇస్తే ఎక్కువ మంది ఒక రాష్ట్రాన్నే ఎంచుకుంటే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆప్షన్లు ఉండాలా లేదా అనే అంశం చట్టంలో ఎక్కడా లేదని అధికారులు తేల్చారు. అప్షన్లు ఇవ్వకుండా లాటరీ విధానాన్ని అవలంభిస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా చర్చించారు. పంపిణీ విధానాన్ని నిర్ణయించే ముందు అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యూష సిన్హా కమిటీ ఈ నెల 15న హైదరాబాద్ రానుంది. అదేరోజు అధికారుల సంఘాలతోపాటు, వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు, వినతిపత్రాలను స్వీకరించనుంది. ఆ తరువాతే మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు. విభజన పనులకు మే 15 గడువు! విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎస్ మహంతి వివరించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై మూడు గంటల పాటు చర్చించారు. విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంతృప్తి వ్యక్తంచేశారు. ఏప్రిల్ 30 నాటి కి విభజనకు సంబంధించిన అన్ని నివేదికలు తమ ముందుంచాలని, మే 15 నాటికి విభజన పూర్తి చేయాలని ఆయన గడువు విధించినట్లు తెలిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలపై పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ పనిని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2కు ముందు తీసుకోవాల్సిన చర్యలు, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఆర్థిక వనరుల ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కేంద్ర సాయం ఎంత, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎంత సాయమందించాలో విభజన తర్వాతే నిర్ధారించగలమని సమావేశంలో తేల్చారు. తొలుత విభజనకు ముందు పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర అధికారులకు అజిత్‌కుమార్ సూచించారు. విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని సీఎస్ కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ నిధుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ భవన్ విభజన షురూ! ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్కడి రెసిడెంట్ కమిషనర్ శశాంక్‌గోయల్‌ను పిలిపించుకొని, ఈనెల 30 నాటికి ఉద్యోగులు, గదుల వివరాలు పంపాలని ఆదేశించారు. ఏపీ భవన్ గోదావరి బ్లాక్‌లో 64, స్వర్ణముఖిలో 12, శబరి బ్లాక్‌లో 6 చొప్పున మొత్తం 82 గదులు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలకు సమానంగా పంచనున్నారు. ఇదిగాక ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సీఎం కాటేజ్ ఉంది. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం అధికారులు సేకరించారు. -
అన్నివర్గాలకూ జయం కలగాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: జయ నామ సంవత్సరంలో అన్నివర్గాల వారికి జయం కలగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా సోమవారం రవీంద్రభారతిలో జరిగిన మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలందరికీ ఆయురారోగ్య, ఐశ్వర్యాలు సిద్ధించాలని మహంతి ఆకాంక్షించారు. భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఎస్ ముక్తేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుభాషకు సంబంధించి విధాన పత్రం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు మాచిరాజు వేణుగోపాల్, చిలుకూరి శ్రీనివాస్‌లు పంచాంగాన్ని పఠిస్తూ... జయనామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పథకాల అమలుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేస్తాయని, అంతా శుభమే జరుగుతుందని తెలిపారు. నూతన సంవత్సర పంచాంగంతో పాటు కవిత సంపుటాలను సీఎస్ మహంతి ఆవిష్కరించారు. -
'మహంతి పదవీకాలాన్ని పొడగించడం సరికాదు'
రాజమండ్రి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా మహంతి పదవీ కాలాన్ని పొడగించడం సరికాదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాజధాని ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య విద్వేషాలను పెంచుతున్నారని విమర్శించారు. సీఎస్ గా మహంతి పదవీ కాలం పొడగించడం ఎంతమాత్రం సరైన విధానం కాదని సోమవారం రాజమండ్రి మీడియాతో మాట్లాడిన వెంకయ్య తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో మహంతి పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మహంతి పదవీ కాలం పొడగించడంపై సీనియర్ ఐఏఎస్ అధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ఐ.వై.ఆర్. కృష్ణారావు మండిపడిన విషయం తెలిసిందే. విభజన సమయంలో స్థానిక కేడర్‌లో సమర్థులున్నా గుర్తించలేదన్నారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు. -
తెలుగు అధికారులను అవమానించడమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో సీఎస్‌గా రాష్ట్రేతర అధికారి ఉండాలంటూ ప్రస్తుత సీఎస్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడం తెలుగు అధికారులను అవమానించడమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఐ.వై.ఆర్. కృష్ణారావు మండిపడ్డారు. విభజన సమయంలో స్థానిక కేడర్‌లో సమర్థులున్నా గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహించారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు. విభజన సమయంలో రాష్ట్రానికి చెందిన అధికారులు పనికిరారనే భావన వచ్చేలా, మహంతి పదవీ కాలం పొడిగించడం అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి శుక్రవారం ఐ.వై.ఆర్. ఘాటుగా లేఖ రాశారు. తెలుగు అధికారులను అవమానించేలా వ్యవహరించినందుకు నిరసనగా శనివారం నుంచి 10వ తేదీ వరకు పది రోజుల సెలవుపై వెళుతున్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగించడంపట్ల మిగతా తెలుగు ఐఏఎస్ అధికారులు కూడా భగ్గుమంటున్నారు. దీనిపై త్వరలో రాష్ట్రపతి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు. మహంతి తరువాత సీనియర్ అధికారైన ఐ.వై.ఆర్. కృష్ణారావును సీఎస్‌గా నియమించాల్సి ఉంది. చివరివరకు ఐ.వై.ఆర్. సీఎస్ అవుతారని భావించిన మిగతా ఐఏఎస్ అధికారులు కూడా చివరి నిముషంలో జరిగిన పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌లందరినీ అవమానించడమేనని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. -
సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్:రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమార్ మహంతి మరో నాలుగు నెలలపాటు కొనసాగనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం రాకుండా ఉండాలంటే మహంతినే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి మహంతి శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ప్రధాని కార్యాలయం మహంతి పదవీకాలాన్ని మూడునెలలపాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రమంత్రి జైరాం రమేష్, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖలోనూ, ప్రధాని కార్యాలయంతోనూ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపి మహంతి పదవీ కాలాన్ని జూన్ వరకూ పొడిగించినట్లు తెలుస్తోంది. -
సీఎస్‌గా మహంతి కొనసాగింపు!
-
సీఎస్‌గా మహంతి కొనసాగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమార్ మహంతి మరో మూడు నెలలపాటు కొనసాగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం రాకుండా ఉండాలంటే మహంతినే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి జైరాం రమేష్, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖలోనూ, ప్రధాని కార్యాలయంతోనూ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని సమాచారం. వాస్తవానికి మహంతి శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ప్రధాని కార్యాలయం మహంతి పదవీకాలాన్ని మూడునెలలపాటు పొడగిస్తూ శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నూతన సీఎస్ ఎంపికకు సంబంధించిన ఫైలును మహంతి గురువారం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌కు పంపించారు. నూతన సీఎస్ ఎంపికకు మహంతి గతంలోనే సీనియారిటీ ప్రకారం ఏడుగురు ఐఏఎస్‌ల పేర్లతో కూడిన జాబితాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపగా ఆయన ఫైలును చూసేందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో మహంతి సంబంధిత ఫైలును గవర్నర్‌కు పంపించారు. అయతే రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం ఉన్నందున ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా నేరుగా గవర్నర్ సీఎస్‌ను నియమించలేరు. సీఎస్ ఎంపిక కోసం పంపిన ఫైలులో మహంతి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నట్లు తెలిసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐవైఆర్ కృష్ణారావుతోపాటు చందనాఖన్, జె.ఆర్. ఆనంద్, సత్యనారాయణ మహంతి, డి. లక్ష్మీపార్థసారథి, అశ్విని కుమార్ పరీడా పేర్లు జాబితాలో ఉన్నాయి. సాధారణంగా భూ పరిపాలన కమిషనర్‌గా పనిచేస్తున్న అధికారినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారు. -
హస్తినకు సీఎస్ మహంతి పయనం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ మహంతి బుధవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆయన కేంద్ర హోంశాఖతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు. కేంద్ర సూచనలు,ఆదేశాలకనుగుణంగా ఢిల్లీ నుంచి వచ్చాక సీఎస్ మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎస్ పర్యవేక్షణలోనే రాష్ట్ర విభజన కార్యక్రమం కొనసాగుతోంది. ఆయన నిన్న వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం అయ్యారు. పాలనాపరమైన విభజనను వారం రోజుల్లో పూర్తి చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా మహంతి ఆదేశించారు. రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ రాకముందే విభజన వేగం పెరగటంతోరెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులను త్వరలోనే ఏర్పాటు చేస్తారనే చర్చ జరుగుతోంది. -
వారంలోగా పూర్తి చేయాలి
-
వారంలోగా పూర్తి చేయాలి
విభజన పనిపై ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్ర ప్రభుత్వ హడావుడి చూస్తుంటే వారంలోగా రాష్ట్రాన్ని విభజించేసి ఇద్దరు ముఖ్యమంత్రులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది... ఇందుకు అనుగుణంగా మనం సిద్ధం కాగలమా?’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ప్రశ్నించారు. దీనిపై చాలా మంది సీనియర్ ఐఏఎస్‌లు విముఖత వ్యక్తంచేశారు. ఇంత హడావుడిగా విభజించటం సాధ్యం కాదని, కనీసం మూడు నెలల సమయం పడుతుందని స్పష్టంచేశారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. మూడు నెలల సమయం పడుతుందని చెప్తానని, అయితే కేంద్ర ప్రభుత్వం వారం లోగానే విభజన చేయాలంటే అందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర విభజన సమయంపై సోమవారం సీఎస్ మహంతితో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ‘సాక్షి’ పాఠకులకు తెలిపింది. ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి వారం లోగానే ‘అపాయింటెడ్ డే’ ఇచ్చేలా ఉందని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రతి శాఖలోనూ విభజన పనిని ప్రారంభించేయాలని ఆయన నిర్దేశించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రతి శాఖ నమూనా పత్రాల్లో మార్చి 3వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు ప్రతి శాఖా నోడల్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. అలాగే.. రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకూ కొత్తగా ఎలాంటి పనులు కానీ, నిధులు కానీ మంజూరు చేయరాదని సీఎస్ అన్ని శాఖల అధికారులనూ ఆదేశించారు. నేడు ఢిల్లీలో హోంశాఖతో సీఎస్ మంతనాలు పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును అన్నిశాఖల ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించటానికి కేంద్ర హోంశాఖతో బుధవారం ఢిల్లీలో సమావేశానికి వెళ్తున్నానని సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఏపీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు అందులోని సిబ్బంది వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఏపీపీఎస్సీ పనితీరు కూడా సరిగా లేదని సీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర ఫైళ్లను విడివిడిగా కంప్యూటరీకరించేందుకు అన్ని శాఖలకూ ప్రత్యేక నమూనాను అందచేశారు. విభజన కసరత్తుపై సీఎస్ సూచించిన ప్రధానాంశాలివీ.. ఫైళ్లు, నోట్ ఫైళ్ల మూడు జిరాక్స్ ప్రతులతో పాటు ఏ ప్రాంతానికి ఏ ఫైళ్లో నోట్ ఫైళ్లతో పాటు విభజన చేయాలి. ఈ ప్రతులను మాతృశాఖ, సీఎస్, ఆర్థికశాఖకు పంపాలి. ఆస్తులు, అప్పులు లెక్కించటంతో పాటు అవి ఏ ప్రాంతానికి చెందినవో గుర్తించి ఆ మేరకు విభజించాలి. భూములేవైనా ఉంటే ఆ భూములు ఏ ప్రాంతానికి చెందినవో గుర్తించి అందుకు అనుగుణంగా విభజించాలి. ఉప కార్యాలయాలు ఎక్కెడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి విభజన పూర్తి చేయాలి. భవనాలు, కార్యాలయాల్లో ఫర్నిచర్, వాహనాల సంఖ్య ఎంతో గుర్తించి వాటి విభజన పూర్తి చేయాలి. ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, పెన్షనర్లు ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంత మందో లెక్కించి సిద్ధంగా ఉంచాలి. రాష్ట్రం వెలుపల ఉన్న స్థిరాస్తులను గుర్తించాలి. ప్రాంతం ఆధారంగా ఆస్తులు ఏ రాష్ట్రానికి చెందుతాయో జాబితా రూపొందించాలి. ఏదైనా కారణంతో ఆస్తిని ఏ రాష్ట్రానికి వస్తుందో గుర్తించకపోతే వాటి జాబితాను విడిగా తయారు చేయాలి. రెవెన్యూ శాఖలోని భూములు, అటవీ భూముల వివరాలను ప్రాంతాల వారీగా నిర్ధారించిన నమూనా పత్రంలో తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలి. ఫైళ్లతో సహా అన్ని వివరాలను ప్రతీ శాఖ ప్రాంతాల వారీగా కంప్యూటరీకరించి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ అని కంప్యూటర్లో టైపు చేస్తే తెలంగాణ ఫైళ్లు రావాలి, సీమాంధ్ర అని టైపు చేస్తే సీమాంధ్ర ఫైళ్లు రావాలి. రాష్ట్ర కేడర్ ఉద్యోగాలు 84 వేలు ఉండగా.. అందులో 50 వేల మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. మిగతా 34 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా విభజించాలని సీఎస్ ఆదేశించారు. విభజన పర్యవేక్షణకు గవర్నర్ అధ్యక్షతన అపెక్స్ కమిటీ రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి గవర్నర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి (అపెక్స్) కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఇద్దరేసి ఐఏఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరు నిపుణులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారు. దీంతో పాటు విభజనకు రంగాల వారీగా మరో 14 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. భవనాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సిబ్బంది, ఉమ్మడి రాజధాని, ఆస్తులు-అప్పులు, విద్యుత్, నీటి వనరులు, సచివాలయం, రెవెన్యూ, భూములు, పోలీసు, వైద్య ఆరోగ్యం, పెట్టుబడులు విభజనలపై ఈ ఉప కమిటీలు పనిచేస్తాయి. రెండు రాష్ట్రాల్లో పాలన వికేంద్రీకరణ, సంస్కరణలు. సిబ్బంది ఎంత అవసరం, ఏ శాఖ ఉపయోగం.. ఏ శాఖ ఉపయోగం లేదో గుర్తిండానికి 25 పరిశోధన కమిటీలు ఏర్పాటు చేస్తారు. మహంతి కొనసాగింపు? రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్సి ప్రసన్నకుమార్ మహంతిని మరో మూడు నెలలు పాటు అదే పదవిలో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించడం కంటే ప్రస్తుత సీఎస్‌ను కొనసాగించటం మేలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు ఫోన్ ద్వారా సీఎస్ మహంతితో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్ పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మహంతి కొత్త సీఎస్ ఎంపిక కోసం ఫైలును అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిన విషయం విదితమే. వాస్తవంగా మహంతి తన రిటైర్మెంట్ గడువు ప్రకారం ఈ నెల 28వ తేదీన పదవీ విరమణ చేయాలని, అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌరవ అధ్యక్షునిగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సీఎం కిరణ్ రాజీనామాకు ముందే ఫైలును ఆమోదింపచేసుకున్నారు. సీఎస్‌గా మహంతి కొనసాగుతారా? లేదా? అన్న విషయం ఈ నెల 28వ తేదీన కానీ తేలదు. బుధవారం మహంతి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నందున కొనసాగింపుపై కూడా కేంద్రం చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. రాష్ట్ర విభజనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సీఎస్ మహంతి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరించారు. అలాగే కేంద్ర హోంశాఖతో బుధవారం జరగబోయే భేటీకి సంబంధించి విరాలనూ చర్చించారు.