ఆప్షన్లా?లాటరీయా?
ఐఏఎస్, ఐపీఎస్‌ల పంపిణీపై సిన్హా కమిటీతో మహంతి భేటీ
ముందుగా అధికారుల అభిప్రాయాలు.. ఆ తర్వాతే మార్గదర్శకాలు
ఈ నెల 15న రాష్ట్రానికి ప్రత్యూష సిన్హా కమిటీ.. అదేరోజు అభిప్రాయాల స్వీకరణ
విభజనపై రాష్ట్ర ప్రభుత్వ చర్యల పట్ల కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంతృప్తి
రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలని కోరిన సీఎస్
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అనంతరం ఏ రాష్ట్రానికి వెళ్లాలనే విషయంలో అఖిల భారత సర్వీసు అధికారులకు ఆప్షన్లు ఇవ్వాలా? లేక లాటరీ విధానంలో కేటాయించాలా అనే అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. దీనిని నిర్ణయించే ముందు అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీకి నియమించిన ప్రత్యూష సిన్హా కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) మహంతి శుక్రవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్, ఐఈఎస్, ఐఐఎస్‌ల వివరాలతో కమిటీకి నివేదిక అందించారు.
రాష్ట్రం నుంచి కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల అధికారుల వివరాలను, వారి స్థానికతను అందులో వివరించారు. వీరి పంపిణీకి ఏ విధానాన్ని అనుసరించాలన్న విషయంపై చర్చించారు. అయితే ఏ విషయంపైనా తుది నిర్ణయం తీసుకోలేదు. అధికారులకు అప్షన్లు ఇస్తే ఎక్కువ మంది ఒక రాష్ట్రాన్నే ఎంచుకుంటే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆప్షన్లు ఉండాలా లేదా అనే అంశం చట్టంలో ఎక్కడా లేదని అధికారులు తేల్చారు. అప్షన్లు ఇవ్వకుండా లాటరీ విధానాన్ని అవలంభిస్తే ఎలా ఉంటుందనే విషయంపైనా చర్చించారు. పంపిణీ విధానాన్ని నిర్ణయించే ముందు అధికారుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యూష సిన్హా కమిటీ ఈ నెల 15న హైదరాబాద్ రానుంది. అదేరోజు అధికారుల సంఘాలతోపాటు, వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు, వినతిపత్రాలను స్వీకరించనుంది. ఆ తరువాతే మార్గదర్శకాలను ఖరారు చేయాలని నిర్ణయించారు.
విభజన పనులకు మే 15 గడువు!
విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను శుక్రవారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎస్ మహంతి వివరించారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు తీసుకోవాల్సిన చర్యలపై మూడు గంటల పాటు చర్చించారు. విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల కేంద్ర కేబినెట్ కార్యదర్శి సంతృప్తి వ్యక్తంచేశారు. ఏప్రిల్ 30 నాటి కి విభజనకు సంబంధించిన అన్ని నివేదికలు తమ ముందుంచాలని, మే 15 నాటికి విభజన పూర్తి చేయాలని ఆయన గడువు విధించినట్లు తెలిసింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అనేక అంశాలపై పలు కేంద్ర మంత్రిత్వ శాఖలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఈ పనిని త్వరగా పూర్తిచేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2కు ముందు తీసుకోవాల్సిన చర్యలు, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఆర్థిక వనరుల ఆధారంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కేంద్ర సాయం ఎంత, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎంత సాయమందించాలో విభజన తర్వాతే నిర్ధారించగలమని సమావేశంలో తేల్చారు. తొలుత విభజనకు ముందు పూర్తి చేయాల్సిన పనులపై దృష్టి సారించాలని కేంద్ర, రాష్ట్ర అధికారులకు అజిత్‌కుమార్ సూచించారు. విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాలని సీఎస్ కేంద్ర కేబినెట్ కార్యదర్శిని కోరారు. రెండు రాష్ట్రాల్లోనూ నిధుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీ భవన్ విభజన షురూ!
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన మొదలైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇక్కడి రెసిడెంట్ కమిషనర్ శశాంక్‌గోయల్‌ను పిలిపించుకొని, ఈనెల 30 నాటికి ఉద్యోగులు, గదుల వివరాలు పంపాలని ఆదేశించారు. ఏపీ భవన్ గోదావరి బ్లాక్‌లో 64, స్వర్ణముఖిలో 12, శబరి బ్లాక్‌లో 6 చొప్పున మొత్తం 82 గదులు ఉన్నాయి. వాటిని రెండు రాష్ట్రాలకు సమానంగా పంచనున్నారు. ఇదిగాక ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సీఎం కాటేజ్ ఉంది. ఈ వివరాలన్నింటినీ శుక్రవారం అధికారులు సేకరించారు.