తెలుగు అధికారులను అవమానించడమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో సీఎస్‌గా రాష్ట్రేతర అధికారి ఉండాలంటూ ప్రస్తుత సీఎస్ మహంతి పదవీ కాలాన్ని పొడిగించడం తెలుగు అధికారులను అవమానించడమేనని సీనియర్ ఐఏఎస్ అధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) ఐ.వై.ఆర్. కృష్ణారావు మండిపడ్డారు. విభజన సమయంలో స్థానిక కేడర్‌లో సమర్థులున్నా గుర్తించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహించారు. సమర్థులైన అధికారులు లేనప్పుడు, ప్రతిభావంతులైన అధికారులకు మాత్రమే పదవీ కాలం పొడిగింపు ఇవ్వాలనే నిబంధన ఉందని, ఆ నిబంధనను తుంగలో తొక్కారని విమర్శించారు.
విభజన సమయంలో రాష్ట్రానికి చెందిన అధికారులు పనికిరారనే భావన వచ్చేలా, మహంతి పదవీ కాలం పొడిగించడం అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి శుక్రవారం ఐ.వై.ఆర్. ఘాటుగా లేఖ రాశారు. తెలుగు అధికారులను అవమానించేలా వ్యవహరించినందుకు నిరసనగా శనివారం నుంచి 10వ తేదీ వరకు పది రోజుల సెలవుపై వెళుతున్నట్లు సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. సీఎస్ మహంతి పదవీ కాలం పొడిగించడంపట్ల మిగతా తెలుగు ఐఏఎస్ అధికారులు కూడా భగ్గుమంటున్నారు. దీనిపై త్వరలో రాష్ట్రపతి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు. మహంతి తరువాత సీనియర్ అధికారైన ఐ.వై.ఆర్. కృష్ణారావును సీఎస్‌గా నియమించాల్సి ఉంది. చివరివరకు ఐ.వై.ఆర్. సీఎస్ అవుతారని భావించిన మిగతా ఐఏఎస్ అధికారులు కూడా చివరి నిముషంలో జరిగిన పరిణామాల పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇది రాష్ట్రానికి చెందిన ఐఏఎస్‌లందరినీ అవమానించడమేనని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శామ్యూల్ కూడా కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.