న్యూఢిల్లీ : విభజన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు ఎక్కడ పనిచేయాలోననే ఆప్షన్ ఇవ్వరాదని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. అయితే రాష్ట్ర ఉద్యోగులకు మాత్రం ఎక్కడ పనిచేయాలో ఎంచుకునే అవకాశం (ఆప్షన్) ఇవ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి గురువారం ఉదయం కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీతో భేటీ అయ్యారు.
అఖిల భారత సర్వీసులకు సంబంధించి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎస్‌ఎఫ్ అధికారుల విషయంలో మాత్రం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 284మంది ఐఏఎస్ అధికారులు, 209మంది ఐపీఎస్ అధికారులు, 136మంది ఐఎఫ్‌ఎస్ అధికారులున్నట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు పేర్కొంటున్నాయి. కేంద్ర సర్వీసు అధికారుల విభజన కోసం రాష్ట్రస్థాయిలో ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీఆర్ కమలనాథన్ నేతత్వంలో పనిచేస్తున్న కమిటీ పరిశీలనలు, అభిప్రాయాలను కూడా ప్రత్యూష్ సిన్హా కమిటీ పరిగణనలోకి తీసుకుంది.
ఇక జాతీయ సర్వీసు అధికారుల విభజన ప్రక్రియలో నిర్దేశిత కోటా వారీగా ఉన్న డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీలను ఇన్‌సైడర్, అవుట్ సైడర్లుగా గుర్తించి వారిలో అదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (ఓబీసీ), షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ) కేటగిరీలుగా విభజించనున్నారు. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర సర్వీసు అధికారులను ఇరు రాష్ర్టాలకు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) కేటాయింపుల కోసం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) మాజీ అధికారి ప్రత్యూష్ సిన్హా నేతత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటయిన విషయం తెలిసిందే.
'ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నో ఆప్షన్స్'
Published Thu, May 8 2014 12:07 PM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement