వారంలోగా పూర్తి చేయాలి | cs orders to officers for early creation of telangana | Sakshi
Sakshi News home page

వారంలోగా పూర్తి చేయాలి

Published Wed, Feb 26 2014 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

వారంలోగా పూర్తి చేయాలి - Sakshi

వారంలోగా పూర్తి చేయాలి

విభజన పనిపై ఉన్నతాధికారులకు సీఎస్ ఆదేశాలు
 
 సాక్షి, హైదరాబాద్:  ‘‘కేంద్ర ప్రభుత్వ హడావుడి చూస్తుంటే వారంలోగా రాష్ట్రాన్ని విభజించేసి ఇద్దరు ముఖ్యమంత్రులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది... ఇందుకు అనుగుణంగా మనం సిద్ధం కాగలమా?’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ప్రశ్నించారు. దీనిపై చాలా మంది సీనియర్ ఐఏఎస్‌లు విముఖత వ్యక్తంచేశారు. ఇంత హడావుడిగా విభజించటం సాధ్యం కాదని, కనీసం మూడు నెలల సమయం పడుతుందని స్పష్టంచేశారు. దీనిపై సీఎస్ స్పందిస్తూ.. మూడు నెలల సమయం పడుతుందని చెప్తానని, అయితే కేంద్ర ప్రభుత్వం వారం లోగానే విభజన చేయాలంటే అందుకు సిద్ధంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర విభజన సమయంపై సోమవారం సీఎస్ మహంతితో సంప్రదింపులు జరిపిన విషయాన్ని ‘సాక్షి’ పాఠకులకు తెలిపింది.
 
 ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి వారం లోగానే ‘అపాయింటెడ్ డే’ ఇచ్చేలా ఉందని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రతి శాఖలోనూ విభజన పనిని ప్రారంభించేయాలని ఆయన నిర్దేశించారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ప్రతి శాఖ నమూనా పత్రాల్లో మార్చి 3వ తేదీలోగా పూర్తి వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఇందుకు ప్రతి శాఖా నోడల్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. అలాగే.. రాష్ట్ర విభజన పూర్తయ్యే వరకూ కొత్తగా ఎలాంటి పనులు కానీ, నిధులు కానీ మంజూరు చేయరాదని సీఎస్ అన్ని శాఖల అధికారులనూ ఆదేశించారు.
 
 నేడు ఢిల్లీలో హోంశాఖతో సీఎస్ మంతనాలు
 పార్లమెంటు ఉభయసభలు ఆమోదించిన తెలంగాణ బిల్లును అన్నిశాఖల ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ అందజేశారు. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డేతో పాటు అందుకు అనుగుణంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై చర్చించటానికి కేంద్ర హోంశాఖతో బుధవారం ఢిల్లీలో సమావేశానికి వెళ్తున్నానని సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. ఏపీ ఇన్వెస్ట్ వంటి సంస్థలు అందులోని సిబ్బంది వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఏపీపీఎస్‌సీ పనితీరు కూడా సరిగా లేదని సీఎస్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర ఫైళ్లను విడివిడిగా కంప్యూటరీకరించేందుకు అన్ని శాఖలకూ ప్రత్యేక నమూనాను అందచేశారు.
 
 విభజన కసరత్తుపై సీఎస్ సూచించిన ప్రధానాంశాలివీ..
 
  ఫైళ్లు, నోట్ ఫైళ్ల  మూడు జిరాక్స్ ప్రతులతో పాటు ఏ ప్రాంతానికి ఏ ఫైళ్లో నోట్ ఫైళ్లతో పాటు విభజన చేయాలి. ఈ ప్రతులను మాతృశాఖ, సీఎస్, ఆర్థికశాఖకు పంపాలి.
 
  ఆస్తులు, అప్పులు లెక్కించటంతో పాటు అవి ఏ ప్రాంతానికి చెందినవో గుర్తించి ఆ మేరకు విభజించాలి.
  భూములేవైనా ఉంటే ఆ భూములు ఏ ప్రాంతానికి చెందినవో గుర్తించి అందుకు అనుగుణంగా విభజించాలి.
 
  ఉప కార్యాలయాలు ఎక్కెడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటి విభజన పూర్తి చేయాలి.
  భవనాలు, కార్యాలయాల్లో ఫర్నిచర్, వాహనాల సంఖ్య ఎంతో గుర్తించి వాటి విభజన పూర్తి చేయాలి.
  ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్, పెన్షనర్లు ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంత మందో లెక్కించి సిద్ధంగా ఉంచాలి.
 
  రాష్ట్రం వెలుపల ఉన్న స్థిరాస్తులను గుర్తించాలి.
 
  ప్రాంతం ఆధారంగా ఆస్తులు ఏ రాష్ట్రానికి చెందుతాయో జాబితా రూపొందించాలి. ఏదైనా కారణంతో ఆస్తిని ఏ రాష్ట్రానికి వస్తుందో గుర్తించకపోతే వాటి జాబితాను విడిగా తయారు చేయాలి.
 
  రెవెన్యూ శాఖలోని భూములు, అటవీ భూముల వివరాలను ప్రాంతాల వారీగా నిర్ధారించిన నమూనా పత్రంలో తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలి.
 
  ఫైళ్లతో సహా అన్ని వివరాలను ప్రతీ శాఖ ప్రాంతాల వారీగా కంప్యూటరీకరించి సిద్ధంగా ఉండాలి. తెలంగాణ అని కంప్యూటర్లో టైపు చేస్తే తెలంగాణ ఫైళ్లు రావాలి, సీమాంధ్ర అని టైపు చేస్తే సీమాంధ్ర ఫైళ్లు రావాలి.
  రాష్ట్ర కేడర్ ఉద్యోగాలు 84 వేలు ఉండగా.. అందులో 50 వేల మంది మాత్రమే ఉద్యోగులు ఉన్నారు. మిగతా 34 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా విభజించాలని సీఎస్ ఆదేశించారు.
 
 విభజన పర్యవేక్షణకు
 గవర్నర్ అధ్యక్షతన అపెక్స్ కమిటీ
 
 రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షించడానికి గవర్నర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి (అపెక్స్) కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీకి ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి.టక్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుంచి ఇద్దరేసి ఐఏఎస్ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఇద్దరు నిపుణులు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉంటారు. దీంతో పాటు విభజనకు రంగాల వారీగా మరో 14 ఉప కమిటీలను ఏర్పాటు చేశారు. భవనాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సిబ్బంది, ఉమ్మడి రాజధాని, ఆస్తులు-అప్పులు, విద్యుత్, నీటి వనరులు, సచివాలయం, రెవెన్యూ, భూములు, పోలీసు, వైద్య ఆరోగ్యం, పెట్టుబడులు విభజనలపై ఈ ఉప కమిటీలు పనిచేస్తాయి. రెండు రాష్ట్రాల్లో పాలన వికేంద్రీకరణ, సంస్కరణలు. సిబ్బంది ఎంత అవసరం, ఏ శాఖ ఉపయోగం.. ఏ శాఖ ఉపయోగం లేదో గుర్తిండానికి 25 పరిశోధన కమిటీలు ఏర్పాటు చేస్తారు.
 
 మహంతి కొనసాగింపు?
 
 రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్సి ప్రసన్నకుమార్ మహంతిని మరో మూడు నెలలు పాటు అదే పదవిలో కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త ప్రధాన కార్యదర్శిని నియమించడం కంటే ప్రస్తుత సీఎస్‌ను కొనసాగించటం మేలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు ఫోన్ ద్వారా సీఎస్ మహంతితో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో సీఎస్ పదవిలో కొనసాగాలని సూచించినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మహంతి కొత్త సీఎస్ ఎంపిక కోసం ఫైలును అపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపిన విషయం విదితమే. వాస్తవంగా మహంతి తన రిటైర్మెంట్ గడువు ప్రకారం ఈ నెల 28వ తేదీన పదవీ విరమణ చేయాలని, అనంతరం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గౌరవ అధ్యక్షునిగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి సీఎం కిరణ్ రాజీనామాకు ముందే ఫైలును ఆమోదింపచేసుకున్నారు. సీఎస్‌గా మహంతి కొనసాగుతారా? లేదా? అన్న విషయం ఈ నెల 28వ తేదీన కానీ తేలదు. బుధవారం మహంతి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నందున కొనసాగింపుపై కూడా కేంద్రం చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే.. రాష్ట్ర విభజనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సీఎస్ మహంతి మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి వివరించారు. అలాగే కేంద్ర హోంశాఖతో బుధవారం జరగబోయే భేటీకి సంబంధించి విరాలనూ చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement