
సీఎస్‌గా మహంతి కొనసాగింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రసన్నకుమార్ మహంతి మరో మూడు నెలలపాటు కొనసాగనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం రాకుండా ఉండాలంటే మహంతినే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి జైరాం రమేష్, రాష్ట్ర గవర్నర్ నర్సింహన్ ఈ విషయంలో చొరవ తీసుకుని కేంద్ర హోం మంత్రిత్వశాఖలోనూ, ప్రధాని కార్యాలయంతోనూ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని సమాచారం. వాస్తవానికి మహంతి శుక్రవారం పదవీ విరమణ చేయాల్సి ఉండగా... ప్రధాని కార్యాలయం మహంతి పదవీకాలాన్ని మూడునెలలపాటు పొడగిస్తూ శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు నూతన సీఎస్ ఎంపికకు సంబంధించిన ఫైలును మహంతి గురువారం రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌కు పంపించారు. నూతన సీఎస్ ఎంపికకు మహంతి గతంలోనే సీనియారిటీ ప్రకారం ఏడుగురు ఐఏఎస్‌ల పేర్లతో కూడిన జాబితాను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపగా ఆయన ఫైలును చూసేందుకు అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో మహంతి సంబంధిత ఫైలును గవర్నర్‌కు పంపించారు. అయతే రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం ఉన్నందున ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా నేరుగా గవర్నర్ సీఎస్‌ను నియమించలేరు. సీఎస్ ఎంపిక కోసం పంపిన ఫైలులో మహంతి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ఐఏఎస్ అధికారుల పేర్లను పేర్కొన్నట్లు తెలిసింది. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐవైఆర్ కృష్ణారావుతోపాటు చందనాఖన్, జె.ఆర్. ఆనంద్, సత్యనారాయణ మహంతి, డి. లక్ష్మీపార్థసారథి, అశ్విని కుమార్ పరీడా పేర్లు జాబితాలో ఉన్నాయి. సాధారణంగా భూ పరిపాలన కమిషనర్‌గా పనిచేస్తున్న అధికారినే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారు.