తరచూ మకాం మారుస్తున్న దావూద్
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, కానీ ప్రస్తుతం అతను తరచూ మకాం మారుస్తున్నాడని కేంద్రప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపింది. 1993 ముంబై వరుస పేలుళ్ల నిందితుడు అయిన దావూద్ పాక్‌లోనే తలదాచుకుంటున్న విషయాన్ని ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు తెలియజేస్తూనే ఉన్నాయని, అయితే అతను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తన స్థావరాన్ని మారుస్తున్నాడని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌదరి సభకు తెలిపారు.
దావూద్ వివరాలు, అతడి పాస్‌పోర్టు, నివాస చిరునామాకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు పాకిస్థాన్ అధికారులకు భారత్ అందజేస్తూనే ఉందని, భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న అతన్ని తమకు అప్పగించాలని పాక్‌ను కోరుతూ వస్తున్నామని ఆయన వివరించారు. దావూద్‌ను తిరిగి భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్విరామంగా ప్రయత్నిస్తున్నదని, అతనిపై రెడ్‌కార్నర్ నోటీసు, ఐరాసలో తీర్మానం నేపథ్యంలో వివిధ మార్గాల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్నామని హరిభాయ్ చౌదరి వివరించారు. దావూద్‌ను తిరిగి భారత్ తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తామని కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గతంలో పార్లమెంటుకు చెప్పిన సంగతి తెలిసిందే.