సాక్షి,న్యూఢిల్లీ: ఇంటర్‌నెట్ సర్ఫింగ్ ఎలాంటి రిస్క్ లేకుండా సాఫీగా సాగే రోజులు కావివి. ఇంటింటికీ నెట్ అందుబాటులోకి రావడంతో ఆ స్క్రీన్‌ల వెనుకే ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. నెట్ అనేది లగ్జరీ నుంచి అవసరంగా మారడంతో దాంతోపాటు రిస్క్‌లూ సవాల్ విసురుతున్నాయి. సామాన్యులతో పాటు హ్యాకర్లు ఇప్పుడు కార్పొరేట్లనూ టార్గెట్ చేస్తున్నారు. కంపెనీలను లక్ష్యంగా చేసుకుని వాటిపై సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. టార్గెట్ దాడులు పక్కా ప్రణాళికతో సాగుతుండటంతో వీటికి చెక్ పెట్టడం సంక్లిష్టంగా మారింది.
గత ఏడాదిగా టార్గెట్ అటాక్‌కు గురై పెద్ద మొత్తంలో మేథో సంపత్తి వ్యాపారాన్ని కోల్పోయామని సర్వేలో పాల్గొన్న వాటిలో 9 శాతం సంస్థలు వాపోయాయి. 2016లో ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో దాదాపు సగం కంపెనీలు కనీసం ఒక సందర్భంలోనైనా సైబర్ దోపిడీకి గురైన ఉదంతాలు వెల్లడయ్యాయి. 39 శాతం కంపెనీలు రాన్సమ్‌వేర్ దాడికి గురయ్యాయి. పెద్ద కంపెనీలు సన్నద్ధంగా లేకపోవడమే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
కేవలం 45 శాతం కంపెనీలే సైబర్ దాడులను తిప్పికొట్టేలా సన్నద్ధంగా ఉన్నాయని సిస్కో 2017 సెక్యూరిటీ క్యాపబిలిటీస్ సర్వే వెల్లడించడం గమనార్హం. వెబ్‌లో తమ ఆస్తుల పరిరక్షణకు బడా, మధ్యతరహా కంపెనీలు సరైన వ్యూహాలతో ముందుకు రావాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. సంస్థల ఆన్‌లైన్ కార్యకలాపాలను ఛిద్రం చేసేందుకు సైబర్ నేరస్తులు భిన్న వ్యూహాలతో విరుచుకుపడే ప్రమాదం పొంచిఉండటంతో విభిన్న సెక్యూరిటీ ప్రమాణాలతో సంస్థలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. ఏటా హ్యాకింగ్ విచ్చలవిడిగా పెరుగుతూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలపై సైబర్ దాడులకు దిగుతుండటంతో దీన్ని అధిగమించే భద్రతా ప్రమాణాలకు పదును పెట్టాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చెక్ పెట్టొచ్చు
కంపెనీలు తమ ఉద్యోగులకు సైబర్ సెక్యూరిట్ ముప్పులపై సరైన అవగాహన కలిగించాలి. స్పామ్ మెయిల్స్ ఓపెన్ చేయకుండా సూచనలు చేయడంతో పాటు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడేలా చొరవ చూపాలి. సైబర్ నేరగాళ్ల నుంచి తమ కంపెనీని రక్షించుకునేందుకు ఎలా వ్యవహరించాలనే దానిపై శిక్షణ ఇప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. సంస్థకు చెందిన అన్ని సిస్టమ్స్, బ్రౌజర్‌లు, ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ చేస్తుండాలి. పెద్ద కంపెనీలు సైతం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుండటంతో హ్యాకర్లు సులభంగా సెక్యూరిటీ సిస్టమ్స్‌ను బ్రేక్ చేస్తూ యధేచ్చగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. డేటా స్టోరేజ్‌కు క్లౌడ్ సర్వీసులు వాడటం ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక సంస్థలు సైబర్ దాడులకు చెక్ పెట్టేందుకు పూర్తిస్ధాయి భద్రతా సలహాదారును నియమించుకోవడం మేలని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment