నిత్యం కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైళ్లను వినియోగిస్తుంటారు. ఇందులో ప్రధానంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లుంటాయి. అసలు వేర్ అంటే ఏమిటో తెలుసా.. సాధనమని అర్థం. కంప్యూటర్‌లో మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్ వంటి భాగాలన్నీ హార్డ్‌వేర్లు. ఈ హార్డ్‌వేర్లను పనిచేయించేవి సాఫ్ట్‌వేర్లు. ఈ సాఫ్ట్‌వేర్‌ల్లో చాలారకాలు ఉంటాయి. వీటిల్లో మంచి చేసేవే కాదు, హాని చేసేవీ ఉంటాయి. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
రాన్‌సమ్‌వేర్
ఇది హానికర సాఫ్ట్‌వేర్. పీసీలో ఇన్‌స్టాల్ అయ్యి, లోపలి భాగాలను ఎన్‌క్రిప్ట్ చేస్తుంది. పరికరాన్ని, డేటాను తిరిగి వినియోగించుకోనీయకుండా చేస్తుంది. రాన్‌సమ్ అంటే డబ్బులు తీసుకొని, విడుదల చేయటం. పేరుకు తగ్గట్టుగానే ఇది డబ్బులు చెల్లించాలంటూ సందేశాన్ని తెర మీద కనిపించేలా చేస్తుంది. డబ్బులు చెల్లిస్తే గానీ డేటాను వాడుకోనీయదు. మనకు సంబంధించిన ఏ వివరాలు కనిపించవు. రాన్‌సమ్‌వేర్లలో చాలా రకాలున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవటం, నాణ్యమైన యాంటీవైరస్/ యాంటీ మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు.
స్పైవేర్
ఇదొక మాల్వేర్. ఒకసారి కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయితే చాలు. మన అనుమతి లేకుండానే, మనకు తెలియకుండానే ఆన్‌లైన్ వ్యవహారాలన్నింటినీ పసిగడుతుంది. ప్రకటనకర్తలు, మార్కెటింగ్ డేటా సంస్థలు సైతం ఇంటర్నెట్ వాడేవారి తీరుతెన్నులను తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగిస్తుంటాయి. మార్కెటింగ్, ప్రకటనల కోసం తోడ్పడే స్పైవేర్లను ‘యాడ్‌వేర్’ అంటారు. ఇవి డౌన్‌లోడ్ లేదా ట్రోజన్ల ద్వారా పీసీలో ఇన్‌స్టాల్ అవుతాయి. ఈమెయిల్ ఐడీలు, వెబ్‌సైట్లు, సర్వర్ల వంటి వివరాలను పీసీ నుంచి సేకరించి, ఇంటర్నెట్ ద్వారా థర్డ్ పార్టీలకు చేరవేస్తాయి. కొన్ని స్పైవేర్లు లాగిన్, పాస్‌వర్డ్‌ల వంటి వాటినీ దొంగిలిస్తాయి. ఈ సాఫ్ట్‌వేర్లను ‘కీలాగర్స్’ అని పిలుచుకుంటారు. సీపీయూ మెమరీని, డిస్క్ స్టోరేజినీ, నెట్‌వర్క్ ట్రాఫిక్‌నూ వాడుకుంటాయి.
నాగ్వేర్
ఒకరకంగా దీన్ని వేధించే సాఫ్ట్‌వేర్ అనుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఏదైనా పని చేస్తున్నప్పుడో, ఫీచర్‌ను ప్రయత్నిస్తున్నప్పుడో పాపప్, నోటిఫికేషన్ మెసేజ్‌లతో లేదా కొత్త విండో ఓపెన్ చేస్తుండడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు- వెబ్‌పేజీ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నామనుకోండి. ఏదో యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని న్యూవిండోలో అడగొచ్చు. ప్రోగ్రామ్‌ను లోడ్ చేస్తున్నప్పుడు లైసెన్స్ కొనమనీ చెబుతుండొచ్చు. దీని ద్వారా వచ్చే మెసేజ్‌లు చాలా చిరాకు పుట్టిస్తుంటాయి. ఆగకుండా అలా వస్తూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయటం ఉత్తమం.
ఇదీ చదవండి: పేటీఎంపై నిషేధం.. ఆర్‌బీఐ కీలక వ్యాఖ్యలు
క్రాప్‌వేర్
ఇది కొత్త పీసీతో వచ్చే సాఫ్ట్‌వేర్. కంప్యూటర్‌లో ముందే ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. ఇవి ప్రయోగ పరీక్షల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వీటితో మనకు నేరుగా ఉపయోగమేమీ ఉండదు. గడువు తీరిన తర్వాత పోతాయి. కొన్నిసార్లు అప్లికేషన్లను పరీక్షించటానికి తయారీదారులు క్రాప్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తుంటారు. ఇందుకోసం థర్డ్ పార్టీలు డబ్బు కూడా చెల్లిస్తుంటాయి. దీంతో పీసీల ధరా తగ్గుతుంది. డిస్క్ స్పేస్‌ను వాడుకున్నా క్రాప్‌వేర్ హాని చేయదు.
Comments
Please login to add a commentAdd a comment