కరెంట్‌కూ సైబర్‌ షాక్‌ | Central Govt Warned All States About Cyber Threat To Power Supply | Sakshi
Sakshi News home page

కరెంట్‌కూ సైబర్‌ షాక్‌

Published Tue, Nov 24 2020 10:36 AM | Last Updated on Tue, Nov 24 2020 10:52 AM

Central Govt Warned All States About Cyber Threat To Power Supply  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ సరఫరా వ్యవస్థకూ సైబర్‌ ముప్పు పొంచి ఉందని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే విద్యుత్‌ నిర్వహణ సంబంధ ఎలక్ట్రానిక్‌ పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌/ట్రోజన్స్‌ తదితర వైరస్‌లను హ్యాకర్లు చొప్పించే ప్రమాదం ఉందని, వాటి వాడకం వల్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై సైబర్‌ దాడులు జరిగే అవకాశాలున్నాయని పేర్కొంది. రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. ఇటీవల చైనాతో సరిహద్దుల వెం బడి ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. 
కేంద్రం సూచనలివీ... 
►  విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని రకాల పరికరాలు, విడిభాగాల్లో మాల్‌వేర్‌/ట్రొజన్స్‌/సైబర్‌ ముప్పు ఉందా అని పరీక్షించించాలి. ఇవి భారతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. 
►    కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ గుర్తించిన సరి్టఫైడ్‌ ల్యాబ్‌లలో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి. 
►   చైనా, పాకిస్తాన్‌ వంటి కొన్ని దేశాల నుంచి లేదా ఆయా దేశాల వ్యక్తుల యాజమాన్యంలోని కంపెనీ ల నుంచి పరికరాలు, విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి తప్పనిసరిగా కేంద్రం నుంచి అనుమతి        తీసుకోవాలి. 
►    ఈ దేశాల నుంచి ప్రత్యేక అనుమతితో ఏవైనా పరికరాలను దిగుమతి చేసుకుంటే వాటిని సర్టిఫైడ్‌ ల్యాబ్‌లలో పరీక్షించాలి. 
►  విదేశాల నుంచి విద్యుత్‌ పరికరాలను దిగుమతి చేసుకొని వినియోగిస్తున్నా, ఇతర వస్తువుల తయారీ/అసెంబ్లింగ్‌కు వాటిని వినియోగించినా, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో వాడినా ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలి. 
►    కేంద్ర జాబితాలోని దేశాల నుంచి గత జూలై 7కి ముందు విద్యుత్‌ పరికరాలు, విడిభాగాల దిగుమతి కోసం వర్క్‌ ఆర్డర్లు ఇచ్చి ఉంటే ఆ పరికరాలు వచి్చన వెంటనే పరీక్షలు నిర్వహించాలి.  
►    విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (గ్రిడ్‌)పై ఈ పరికరాలు సైబర్‌ భద్రతతోపాటు నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎలాంటి ముప్పు కలిగించే అవకాశం లేదని ధ్రువీకరించుకోవాలి.

చైనా నుంచి భారత్‌కు దిగుమతుల్లో విద్యుత్‌ పరికరాలు, విడిభాగాలదే ప్రథమ స్థానం. సాధారణ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి స్మార్ట్‌ గ్రిడ్ల నిర్వహణకు అవసరమైన అత్యాధునిక పరికరాలు చైనాలో అత్యంత చౌకగా లభిస్తుండటమే దీనికి కారణం. 2018–19లో చైనా నుంచి రూ. 1.84 లక్షల కోట్లు, 2019–20లో రూ. 1.44 లక్షల కోట్ల విలువైన విద్యుత్‌ పరికరాలు, విడిభాగాలను మన దేశం దిగుమతి చేసుకుంది. చైనాతో ఇటీవల ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దేశం నుంచి దిగుమతులపై నియంత్రణ విధించింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో వినియోగించే విడిభాగాల దిగుమతి నిలిచిపోయి రాష్ట్రంలో నాలుగైదు నెలలుగా ట్రాన్స్‌ఫార్మర్ల కొరత ఏర్పడింది. రైతులతోపాటు కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్లకు ట్రాన్స్‌ఫార్మర్లను సరఫరా చేయలేక డిస్కంలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

విద్యుదుత్పత్తి కేంద్రాల, గ్రిడ్‌ నిర్వహణ  ఆటోమేషన్‌ ద్వారానే సాగుతోంది. ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లతో నడిచే కం ప్యూటర్‌/ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలతో  అవసరాలకు తగ్గట్లు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా జరిగేలా గ్రిడ్‌ను అనుక్షణం నియంత్రిస్తుం టారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరికరాల్లో ఏవైనా మాల్‌వేర్‌/వైరస్‌ చొప్పించి ఉంటే మన విద్యుదుత్పత్తి వ్యవస్థలను ముష్కరులు హైజాక్‌ చేసి వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహ రించే అవకాశాలుంటాయి. దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడినా, వ్యూహాత్మకమైన దేశ భద్రతావ్యవస్థలు పనిచేయకుండా హైజాకర్లు విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement