
నగదు రహితం అంతంత మాత్రమే
► డల్‌గా..డిజిటల్ టాన్సాక్షన్
► సైబర్‌నేరగాళ్ల భయంతో వెనకడుగు..
► ఏప్రిల్ 1 నుంచి క్యాష్‌లెస్ సాధ్యమేనా?
రాజంపేట: జిల్లాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ డల్‌గానే కొనసాగుతోంది. నగదు లావాదేవీల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఫిబ్రవరి నాటికి డిజిటల్ లావాదేవీలు తగ్గినట్లు రిజర్వుబ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వా త నగదు ఉపసంహరణ పరిమితిలో సడలింపుల వల్ల మార్కెట్‌లో డబ్బు అందుబాటులో ఉంటోంది. రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం గత ఏడాది నవంబరులో 675.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. డిసెంబరు 957.5, ఈ ఏడాది జనవరిలో 870.4 మిలియన్లు, ఫిబ్రవరిలో 537.5 మిలియన్ల లావాదేవీలు జరిగాయి. గత ఏడాది డిసెంబరుతో పోలీస్తే జనవరిలో 87.1 మిలియన్ల మేర లావాదేవీల్లో తగ్గుదల ఉంది.
నగదు అందుబాటులో..: జిల్లాలో వ్యాపార కేంద్రాలైన కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల పరిధిలో నగదు అందుబాటులో ఉండటంతో డిజిటల్ లావాదేవీలు తగ్గిపోయాయి. గత ఏడాది నవంబరులో నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద పెద్దనోట్లు ఉన్నా అవి చిత్తు కాగితాలుగా మిగలడంతో బ్బం దులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ దశలో నగదు రహితంపై ప్రభుత్వంపై దృష్టి సారిం చింది. దాదాపు జిల్లాలో 25 శాతం వరకు నగదు రహిత లావాదేవీలు చేసే స్ధాయికి వెళ్లింది.
ప్రచారం చేసినా స్పందనేది..: నగదు రహితలావాదేవీలపై విద్యార్ధులతో ప్రచారం..ప్రతిరోజు సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహించిన ప్రజల నుంచి స్పందన లేదరు. డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ చార్జి మినహాయించినా ప్రజలు, వ్యాపారుల నుంచి నిరాస్తకత కనిపిస్తోం ది. డిజిటల్ లావాదేవీల పెంపునకు ఎపీ పర్స్ అనే యాప్‌ను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. లక్షకుపైగా డౌన్‌లోడ్‌తో 3.2 స్టార్ రేటింగ్‌తో ఇది కొనసాగుతోంది. చౌక దుకాణాల్లో రేషన్‌ను పూర్తి స్ధాయిలో నగదు రహితంగా అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలో పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది. లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు, ఆధార్‌తో అనుసంధానం కాకపోడవం, డీలర్ల ఖాతాలు కూడా అనుసంధానం కాకపోవడం, సాప్ట్‌వేర్, సర్వర్ సమస్యలతో ఇది పూర్తిగా అమలులోకి రాలేదు.ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలు నిర్వహించాలన్న ప్రభుత్వం లక్ష్యం నెరవేరడం కష్టమేనని పలువురు అంటున్నారు.
సైబర్ నేరగాళ్ల భయంతోనే..: పెద్దనోట్లు రద్దు చేశాక నగదు రహిత లావాదేవీలు కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. 75శాతం అక్షరాస్యత దాటని మనదేశంలో ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి స్ధాయిలో అవగాహన లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని సైబర్‌నేరగాళ్లు రెచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో డబ్బు జమ చేయాలంటే ఇబ్బందులు పడుతున్నామని, స్వైపింగ్ బాగోతం గోరుచుట్టుపై రోకలిపోటుగా తయారైందని సామాన్య ప్రజలు, వ్యాపారులు అంటున్నారు.చిరు వ్యాపారులు చేసుకొనేవారికి వీటివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు.