న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 48 గంటలపాటు ఇంటర్నెట్ ఆగిపోతుందంటూ శుక్రవారం ఓ వార్త కలకలం రేపింది. డీఎన్‌ఎస్‌ఎస్‌ఈసీ (డొమైన్ నేమ్ సిస్టమ్ సెక్యూరిటీ ఎక్స్‌టెన్షన్స్) అప్డేషన్ కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయంటూ రష్యాటుడే అనే వెబ్‌సైట్ పేర్కొంది. అప్డేషన్‌ను చేపట్టే ఐసీఏఎన్‌ఎన్ (ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్) మాత్రం ఈ వార్తలను ఖండించింది. సైబర్ దాడులు, మోసాలు పెరిగిపోతున్నందున మరింత భద్రమైన ఇంటర్నెట్ సౌకర్యాలను అందించేందుకు అప్‌డేట్‌ను చేపడుతున్నారు. ఇది సాధారణంగా జరుగుతున్న నిర్వహణ పనేనని ఐసీఏఎన్‌ఎన్ వెల్లడించింది. ఎక్కువమంది పాఠకులు తమ వార్త చదివేలా చేసి, తద్వారా ఆదాయం పొందేందుకు రష్యా టుడే వెబ్‌సైట్ ఈ వార్తకు తప్పుదారి పట్టించే శీర్షికను పెట్టడం కారణంగానే గందరగోళం తలెత్తిందని ఐసీఏఎన్‌ఎన్ ఆక్షేపించింది.
గురువారమే మొదలైంది: ఐసీఏఎన్‌ఎన్
డీఎన్‌ఎస్‌ఎస్‌ఈసీని అప్‌డేట్ చేయడం గురువారమే మొదలైందనీ, ఇప్పటికే ఓ రోజు గడిచినా అక్కడక్కడా చిన్న చిన్న అంతరాయాలు తప్పించి ఇంటర్నెట్ వినియోగదారులకెవ్వరికీ ఇబ్బంది కలగలేదని ఐసీఏఎన్‌ఎన్ చెప్పింది. భద్రమైన, స్థిరమైన డీఎన్‌ఎస్ కోసం ఈ నిర్వహణ పనులు తప్పవని సమాచారాల నియంత్రణ ప్రాధికార సంస్థ (సీఆర్‌ఏ) ఓ ప్రకటనలో తెలిపింది.
‘ప్రాథమిక పరీక్షలు జరిపిన అనంతరం ఎన్క్రిప్షన్ కీ అప్‌డేట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కేవలం 1 శాతం (దాదాపు 3.5 కోట్లు) మందికే ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉందని గుర్తించాం. మిగతా 99 శాతం మందిపై ప్రభావం పెద్దగా ఉండదు. డీఎన్‌ఎస్‌లోని అన్ని వెబ్ అడ్రస్‌లకు ఎన్క్రిప్షన్ కీని ఒకేసారి కాకుండా, వివిధ విడతల్లో చేపడుతున్నాం. కాబట్టి ఇంటర్నెట్ మొత్తం ఒక్కసారిగా ఆగిపోదు. ఒక్కో సమయంలో కొన్ని వెబ్‌సైట్లు ప్రభావమవుతాయి. ఎన్క్రిప్షన్ కీ అప్‌డేట్ అయ్యాక ఇంటర్నెట్ సరఫరాదారులు అందుకు తగ్గట్టుగా తగిన మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులు చేయడంలో వారు ఆలస్యం చేస్తే ఆయా సరఫరాదారుల వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే చాన్సుంది. ఈ అప్‌డేట్ గురించి ఇంటర్నెట్ సరఫరాదారులకు ముందే సమాచారం ఇచ్చినందున వారూ సిద్ధంగానే ఉన్నారు. ఎవరికీ సమస్య లేదు’ అని ఐసీఏఎన్‌ఎన్ వివరించింది.
భారత్‌పై ప్రభావమేదీ లేదు
ఎన్‌క్రిప్షన్ కీ కారణంగా భారత్‌లో ఇంటర్నెట్ సేవలపై ప్రభావమేదీ లేదని జాతీయ సైబర్ భద్రత సమన్వయకర్త గుల్షన్ రాయ్ చెప్పారు. ‘అన్ని ఏర్పాట్లూ చేశాం. కొన్ని వెబ్‌సైట్లలో వస్తున్నట్లుగా భారత్‌లో ఇంటర్నెట్ ఆగిపోయే సమస్యే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. క్రిప్టోగ్రాఫిక్ కీస్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని 2016 జూలైలోనే ఐసీఏఎన్‌ఎన్ ప్రకటించింది. గతేడాది అక్టోబరు 11న ఈ అప్‌డేట్‌ను పూర్తి చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. గురువారం ఈ ప్రక్రియ మొదలైంది. దీని ప్రభావం ఒక శాతం మంది ఇంటర్నెట్ వినియోగదారులపై ఉండొచ్చని ఐఏసీఎన్‌ఎన్ అంచనా వేసినా, అది కేవలం 0.05 శాతమేనని ఆసియా పసిఫిక్ ప్రాంత రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ మరో అంచనాగా చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment