ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.
చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.
ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్‌లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.
ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే!
Comments
Please login to add a commentAdd a comment