కరోనా మహమ్మరి వల్ల డిజిటల్ వినియోగం విపరీతంగా పెరగింది. అందుకే ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన సామాన్య ప్రజానీకం నుంచి సెలిబ్రిటీలు వరకు వీటి బారిన పడుతున్నారు. అంతేగాక ఈ సైబర్ వలలో అనేక దేశాల కూడా చిక్కుకుంటున్నాయి. ఇప్పుడు ఒక దేశం సైబర్ పరంగా ఎంత సురక్షితంగా ఉంటే అంత బలమైనది అని అర్ధం. భవిష్యత్ లో జరగబోయే యుద్దాలు ఎక్కువగా సైబర్ యుద్దాలే అని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఇటువంటి సమయంలో దేశాలు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎంత శక్తివంతంగా ఉన్నాయో తెలుసుకోవడానికి లండన్ కు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) చేసిన ఒక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో వాటి సామర్థ్యాలకు అనుగుణంగా దేశాలకు ర్యాంక్ ఇచ్చింది. సైబర్ శక్తి పరంగా భారతదేశం థర్డ్ టైర్ లో ఉంది. భారతదేశంతో పాటు ఇండోనేషియా, జపాన్, మలేషియా, ఉత్తర కొరియా, ఇరాన్, వియత్నాం వంటి దేశాలు ఈ టైర్ లో ఉన్నాయి. ఇక సెకండ్ టైర్ లో మన శత్రు దేశం చైనా, రష్యా, యుకె, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్ వంటి దేశాలు ఉన్నాయి. టాప్ టైర్ లో కేవలం ఒకే ఒక దేశం అమెరికా మాత్రమే ఉంది.
ఐఐఎస్ఎస్ లో సైబర్ స్పేస్ నిపుణుడైన గ్రెగ్ ఆస్టిన్ మాట్లాడుతూ..ప్రస్తుత ఆన్ లైన్ గూఢచర్యం చాలా శక్తివంతమైనది. ఆర్ధికంగా వేగంగా అభివృద్ది చెందుతున్న భారతదేశం, జపాన్ వంటి శక్తివంతమైన దేశాలు థర్డ్ టైర్ లో ఉండటం ఆశ్చర్యం అని ఆయన అన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా వంటి చిన్న దేశాలు అత్యాధునిక సైబర్ నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. అంతేగాక, ఈ నివేదిక చైనా సైబర్ శక్తి సామర్ధ్యాలు బయట ప్రపంచం అనుకున్నంత రితలో లేవని పేర్కొంది. పేలవమైన భద్రత, బలహీనమైన ఇంటెలిజెన్స్ విశ్లేషణ కారణంగా సైబర్ శక్తిలో చైనా వెనుకబడినట్లు వెల్లడించింది.
మరో దశాబ్దం పాటు చైనా సైబర్ పవర్ పరంగా అమెరికా సామర్థ్యాలను చేరుకోలేదని అంచనా వేసింది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం చైనా, రష్యా వంటి దేశాలు ఆన్ లైన్ గూఢచర్యం, మేధో సంపత్తిలో తప్పుడు సమాచార ప్రచారాలతో సహా అభ్యంతరకరమైన సైబర్ కార్యకలాపాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. కానీ సైబర్ భద్రత విషయానికి వస్తే వారు అమెరికా కంటే వెనుక ఉన్నట్లు పేర్కొంది. డీజిటల్ ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్ధ్యాలు, ఇంటెలిజెన్స్ పరిపక్వత, భద్రతా విధులు, సైనిక సైబర్ శక్తి సామర్థ్యాల ఆధారంగా ఐఐఎస్ఎస్ ఈ దేశాలకు ర్యాంక్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment