హైదరాబాద్‌పై ఢిల్లీవాసుల సైబర్‌ దాడి | cyber attack on Hyderabad from Delhi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై ఢిల్లీవాసుల సైబర్‌ దాడి

Published Thu, Nov 16 2017 3:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

cyber attack on Hyderabad from Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీ సైబర్‌ నేరగాళ్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థిక అంశాలతో ముడిపడిన నేరాలు చేస్తూ నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర నేరస్తుల్లో ఢిల్లీకి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గడిచిన 46 నెలల్లో సైబర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఇతర రాష్ట్రాల వారిలో దేశ రాజధానికి చెందిన వారే 44 శాతం మంది ఉన్నారు. ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్‌) అధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మొత్తం 333 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరిలో తెలంగాణకు చెందిన వారు 109 మంది ఉండగా.. మిగిలిన 224 మందిలో ఢిల్లీ వారే 100 మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రెండేళ్ల కాలంలో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడానికి మొత్తం 11 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేపట్టారు.

రెండు రకాల సైబర్‌ నేరాలు..
సైబర్‌ నేరాలను అధికారులు ప్రధానంగా రెండు రకాలుగా విభజిస్తారు. వివిధ రూపాల్లో బాధితుల నుంచి నగదును కాజేసే ఆర్థిక సంబంధమైనవి ఒక రకమైతే.. ఫేస్‌బుక్, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేవి మరోరకం. వీటిలో బాధితులకు ఆర్థిక నష్టం లేనప్పటికీ అశ్లీలం, అభ్యంతరకర అంశాలు ముడిపడి ఉంటాయి. సైబర్‌ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో(తెలంగాణ, ఏపీ వారు) దాదాపు 99 శాతం సామాజిక మాధ్యమాల్లో ఇబ్బందులు పెట్టేవారే. వ్యక్తిగత కక్ష, అసూయల నేపథ్యంలో ఎదుటి వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కంప్యూటర్, సెల్‌ఫోన్లను వినియోగించి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా పట్టుబడుతున్న వారిలో ఎక్కువ మంది విద్యాధికులే ఉంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సైతం ఈ తరహా కేసుల్లో అరెస్టు అయ్యారు.

అందినకాడికి దోచేసేది వారే..
సైబర్‌ నేరాల్లో రెండో రకమైన ఆర్థిక సంబంధ నేరాలు చేస్తున్న వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటున్నారు. 2016 జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ వరకు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసిన ఇతర రాష్ట్రాల వారిలో ఢిల్లీ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీరు ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేస్తున్నారు. ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గావ్‌ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సైబర్‌ నేరగాళ్లు ప్రత్యేకంగా కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. టెలీకాలర్లను ఏర్పాటు చేసుకుని, సెల్‌ఫోన్‌ నంబర్ల డేటాబేస్‌ ఆధారంగా దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నారు. వర్క్‌ స్టేషన్లుగా పిలిచే రెడీ యూజ్‌ కాల్‌ సెంటర్లను కొన్ని నెలల పాటు వినియోగించే ఈ నేరగాళ్లు ఆపై వాటిని ఖాళీ చేసేస్తుంటారు. ముంబై, బెంగళూరుతో పాటు గుజరాత్‌కు చెందిన వారూ ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు.

నైజీరియన్లే సూత్రధారులు..
ఇలాంటి నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు ఎక్కువగా ఉంటున్నారు. సోయాలియా వంటి ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన వారూ నిందితులుగా మారుతున్నారు. బిజినెస్, స్టడీ తదితర వీసాలపై భారత్‌కు వచ్చి ఢిల్లీ సహా వివిధ నగరాల్లో నివసిస్తున్న నల్లజాతీయులు తేలిగ్గా డబ్బు సంపాదించడానికి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారు. వీరికి స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆయా నగరాల్లో నివసిస్తున్న వారు మనీమ్యూల్స్‌గా మారి సహకరిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల బాధితుల నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడానికి అవసరమైన బ్యాంక్‌ ఖాతాలను అందిస్తూ, ప్రతిఫలంగా కమీషన్లు తీసుకునే వారిని సాకేంతికంగా మనీమ్యూల్స్‌ అంటారు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి గుజరాత్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో నివసిస్తున్న యువతను నైజీరియన్లు మనీమ్యూల్స్‌గా మార్చుకుంటున్నారు. అనేక కేసుల్లో మనీమ్యూల్స్‌గా ఉన్న వారు చిక్కుతున్నా.. సూత్రధారులు మాత్రం పరారీలో ఉంటున్నారు.

‘ఓటీపీ క్రైమ్‌’అంటే జార్ఖండే..
బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి.. డెబిడ్‌/క్రెడిట్‌ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ (ఓటీపీ) సైతం సంగ్రహించి.. అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే. ఆ జిల్లాలో ఉన్న ఏడు గ్రామాల్లోని యువతకు సైబర్‌ నేరాలే ప్రధాన ఆదాయవనరు. కొన్నేళ్ల క్రితం వరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి కాల్‌ సెంటర్లలో పనిచేసి వచ్చిన జమ్‌తార యువత తామే సొంతంగా ‘కాల్‌ సెంటర్ల’ను ఏర్పాటు చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతోంది. ఆయా బ్యాంకుల్లోని కింది స్థాయి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, వాటి కాల్‌ సెంటర్లు తదితర మార్గాల్లో డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల డేటా ఈ సైబర్‌ నేరగాళ్లకు చేరుతోందని తెలుస్తోంది. డెబిట్‌ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్‌ కార్డు వివరాలు అప్‌డేట్‌ చెయ్యాలనో చెప్తుంటారు. ఆపై ఓటీపీ సహా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత వారి ఖాతాలోని నగదును తమ ఖాతాల్లోకి మార్చుకుని టోకరా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement