సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ గౌతమ్
ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణపై ‘గ్రేటర్’ యంత్రాంగం దృష్టిసారించింది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ తరహాలో సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా నిట్ క్యాంపస్‌లో.. పాలిటెక్నిక్ నుంచి భద్రకాళి వరకూ సైకిల్‌పై ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కమిషనర్ గౌతమ్ పలు సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా సమాలోచనలు చేశారు.
వరంగల్ అర్బన్: ప్రజల ఆరోగ్యంతోపాటు పర్యావరణ పరిరక్షణకు సైకిల్ ప్రయాణం ఎంతగానో దోహదపడుతుంది. ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ నగరాల తరహాలో వరంగల్ స్మార్ట్ నగరంలో సైకిల్ వినియోగాన్ని అమల్లోకి తెచ్చేందుకు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ మేరకు గురవారం వరంగల్ మహా నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వీపీ.గౌతమ్‌తో లీ అసోసియేట్స్, హైదరాబాద్ సైకిల్ అసోసియేషన్(హెచ్‌బీసీ), పీడబ్ల్యూసీ సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు.
సైకిల్ ప్రయాణంతో ప్రజలు, పర్యావరణ పరిరక్షణకు జరిగే మేలు గురించి ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అద్దెకు సైకిళ్లు ఇస్తామని.. ఇందుకోసం గ్రేటర్ వరంగల్ నుంచి సహాయ సహకారాలను అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో అనువైన రహదారులపై చర్చించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా సైకిల్ సవారీని నిట్ క్యాంపస్‌లో.. పాలిటెక్నిక్ కాలేజి నుంచి భద్రకాళి ఆలయం వరకు అమలు చేయాలని సూచించారు. అతి తక్కువ చార్జీలతో సైకిళ్లను అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా షెడ్డును నిర్మించుకుంటామని సంస్థల ప్రతినిధులు తెలిపారు.
అనంతరం కమిషనర్ మాట్లాడుతూ సైకిల్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సైకిల్ వినియోగం పెంచేలా నగర ప్రజలను ప్రోత్సహించేందుకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని, అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తామని సంస్థ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా రహదారులను నిర్మిస్తామన్నారు. సమావేశంలో లీ అసోసియేట్స్ ప్రతినిధి జగదీష్, హెచ్‌బీసీ చీఫ్ మేనేజర్ విజయ్, పీడబ్ల్యూసీ ప్రతినిధులు బాలాజీ, సంతోష్, రాజేశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment