సాక్షి, న్యూఢిల్లీ : ఎట్టకేలకు లగ్జరీ కారు దొంగల ముఠా ఆటకట్టించారు ఢిల్లీ పోలీసులు. విలాసవంతమైన కార్లే టార్టెట్‌గా ఈ ముఠా గత ఐదేళ్లుగా చోరీలకు పాల్పడుతోంది. ఆధునిక టెక్నాలజీని సహాయంతో హైటెక్‌గా అనుకున్న పని కానిచ్చేసి, అనంతరం విమానంలో చెక్కేస్తారు. అయితే ఈ ముఠాపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీసులు చివరికి వారికి చెక్ పెట్టారు. విలాసవంతమైన కార్లను దొంగిలించడం, అమ్ముకోవడమే పనిగా పెట్టుకుంది హైదరాబాద్‌కు చెందిన సఫ్రుద్దీన్ (29) అండ్ గ్యాంగ్. ఢిల్లీలో ఏడాదికి 100 లగ్జరీ కార్ల చోరీ చేయడం వీళ్ల టార్గెట్. ఇలా కొట్టేసిన కార్లను పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటారు. అయితే ఎంతటి టెక్ దొంగ అయినా పోలీసులకు చిక్కక తప్పదు కదా. ఆగస్టు 3న ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నీరజ్ చౌదరి, కుల్దీప్ నాయకత్వంలోని బృందం వీరిని అరెస్ట్ చేసిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ డియో చెప్పారు.
హైదరాబాద్‌కు చెందిన సఫ్రూద్దీన్ సహా మహమ్మద్ షరీక్, ఇంకా కొంతమంది ముఠాగా ఏర్పడ్డారు. ఢిల్లీ లగ్జరీ కార్లే వీళ్ల టార్గెట్. హైదరాబాద్ -ఢిల్లీ, ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో మాత్రమే ప్రయాణం చేస్తారు. ల్యాప్‌టాప్, ఇతర హైటెక్ గాడ్జెట్లు వీరి ఆయుధాలు. వీటి ద్వారా కార్ల సాప్ట్‌వేర్ జీపీఎస్‌ను కేంద్రీకృత లాకింగ్ సిస్టంలోకి ఎంటరై కారును కొట్టేస్తారు.. ఆ తరువాత విమానంలో హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేస్తారు. ఇదీ వీరి మోడస్ ఒపరాండీ.
కాగా జూన్ 5న సఫ్రుద్దీన్ అతని నలుగురు సహచరులు వివేక్ విహార్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా ఈ గ్యాంగ్‌లోని ననూర్ మహ్మద్‌ను కాల్చిచంపిన పోలీసులు మరో నిందితుడు రవి కుల్దీప్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సప్రూద్దీన్‌ను అరెస్ట్ చేశారు. అన్నట్టు సప్రూద్దీన్ ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల ప్రైజ్ మనీ కూడా గతంలో పోలీసు శాఖ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment