లావోస్‌లో సైబర్‌ బానిసలు.. | 47 Indians rescued from Laos cyber scam centres | Sakshi
Sakshi News home page

లావోస్‌లో సైబర్‌ బానిసలు..

Published Sun, Sep 1 2024 6:03 AM | Last Updated on Sun, Sep 1 2024 6:03 AM

47 Indians rescued from Laos cyber scam centres

సైబర్‌ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని విలవిల  

47 మంది భారతీయులను రక్షించిన అధికారులు 

న్యూఢిల్లీ:  విదేశాల్లో ఉద్యోగం అంటే ఎవరికైనా సంబరమే. మంచి జీతం, జీవితం లభిస్తాయన్న నమ్మకంతో విదేశాలకు వెళ్తుంటారు. ఇండియా నుంచి చాలామంది ఇలాగే లావోస్‌కు చేరుకొని, సైబర్‌ నేరాల ముఠాల చేతుల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతున్నారు. సైబర్‌ బానిసలుగా మారుతున్నారు. కొన్ని ముఠాలు ఉద్యోగాల పేరిట యువతపై వల విసిరి లావోస్‌కు తీసుకెళ్తున్నాయి. అక్కడికెళ్లాక వారితో బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్నాయి. 

ఇండియాలోని జనానికి ఫోన్లు చేసి, ఆన్‌లైన్‌లో డబ్బులు కొల్లగొట్టడమే ఈ సైబర్‌ బానిసల పని. మాట వినకపోతే వేధింపులు, దాడులు తప్పవు. లావోస్‌లో బొకియో ప్రావిన్స్‌లోని గోల్డెన్‌ ట్రయాంగిల్‌ ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లో ఏర్పాటైన సైబర్‌ స్కామ్‌ సెంటర్లలో చిక్కుకున్న 47 మంది భారతీయులను అక్కడి అధికారులు శనివారం రక్షించారు. వీరిని లావోస్‌లోని భారత రాయబార కార్యాలయంలో అప్పగించారు. బాధితుల్లో 30 మందిని  క్షేమంగా స్వదేశానికి తరలించినట్లు రాయబార కార్యాలయం అధికారులు చెప్పారు. మిగిలినవారిని సాధ్యమైనంత త్వరగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.  

ఉచ్చులోకి యువత  
ఉద్యోగం కోసం ఆశపడి ఉచ్చులో చిక్కుకున్న యువకులను సైబర్‌ నేరగాళ్లు లావోస్‌కు పంపిస్తున్నారు. అక్కడికి చేరగానే పాస్‌పోర్టు లాక్కుంటారు. బయటకు వెళ్లనివ్వరు. స్కామ్‌ సెంటర్లలో ఉండిపోవాల్సిందే. యువతుల మాదిరిగా గొంతు మార్చి ఫోన్లలో మాట్లాడాల్సి ఉంటుంది. నకిలీ యాప్‌లలో, ఫేక్‌ సోషల్‌ మీడియా ఖాతాల్లో అందమైన యువతుల ఫొటోలు పెట్టి జనాన్ని బురిడి కొట్టించాలి. రోజువారీ లక్ష్యాలు ఉంటాయి. నిర్దేశించినంత డబ్బు కొల్లగొట్టకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు.   

జాబ్‌ ఆఫర్‌ అంటే గుడ్డిగా అంగీకరించొద్దు    
ఉద్యోగాల కోసం లావోస్‌ వెళ్లి, సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకున్న 635 మంది భారతీయులను అధికారులు గతంలో రక్షించారు. గత నెలలో ఇండియన్‌ ఎంబసీ 13 మందిని కాపాడింది. వారిని భారత్‌కు తిరిగి పంపించింది. లావోస్, కాంబోడియా జాబ్‌ ఆఫర్లు వస్తే గుడ్డిగా అంగీకరించవద్దని, చాలావరకు సైబర్‌ మోసాలకు సంబంధించినవే ఉంటాయని, యువత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ గత నెలలో లావోస్‌లో పర్యటించారు. నేరగాళ్ల ముఠాలు భారతీయ యువతను లావోస్‌ రప్పించి, బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తుండడంపై లావోస్‌ ప్రధానమంత్రితో చర్చించారు. సైబర్‌ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement