300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత | Human Trafficking Suspect: France Grounds Plane With 300 Indians | Sakshi
Sakshi News home page

300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత.. కొనసాగుతున్న దర్యాప్తు

Published Sat, Dec 23 2023 7:50 AM | Last Updated on Sat, Dec 23 2023 12:37 PM

Human Trafficking Suspect: France Grounds Plane With 300 Indians - Sakshi

మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో.. 300 మంది భారతీయుల్ని ఫ్రాన్స్‌లో ఆపేశారు.. 

ప్యారిస్‌: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్‌ అధికారులు ప్రకటించారు. 

ప్యారిస్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎయిర్‌బస్‌ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్‌ వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది.

అక్రమ చొరబాటు కోసమే?
అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్‌ ఎంబసీ
ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్‌ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్‌ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. 

ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం.. 
అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్‌ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు,  అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement