Nicaragua
-
300 మంది భారతీయుల అక్రమరవాణా?.. ఫ్రాన్స్‌లో విమానం నిలిపివేత
ప్యారిస్: మానవ అక్రమరవాణా జరుగుతుందన్న అనుమానాల నేపథ్యంతో.. ఓ విమానం ఫ్రాన్స్‌లో నిలిచిపోయింది. ఇందులో 300 మంది భారతీయులు ఉన్నారు. వీళ్లంతా మధ్య అమెరికా దేశం నికరాగువా వెళ్తున్నట్లు తేలింది. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. విమానాన్ని తాము అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఫ్రాన్స్ అధికారులు ప్రకటించారు. ప్యారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రొమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎయిర్‌బస్ ఏ340 యూఏఈ నుంచి నికరాగువాకు బయల్దేరింది. ఇంధనం కోసం ప్యారిస్ వ్యాట్రి(Vatry) ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. అయితే అప్పటికే సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. విమానాన్ని ఆపేసి.. ఇద్దరి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు భారత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకోవైపు ప్రయాణికులకు అక్కడే బస ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల్లో మైనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇక ఇది మానవ అక్రమరవాణేనా అనేది తేలాల్సి ఉంది. అక్రమ చొరబాటు కోసమే? అక్రమ చొరబాట్ల కోసమే వీళ్లను తీసుకెళ్తున్నారా? అనే కోణంలోనూ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. తొలుత వీళ్లను మధ్య అమెరికాకు చేర్చి.. అక్కడి నుంచి అమెరికా లేదంటే కెనడాకు అక్రమంగా ప్రవేశిస్తారేమోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులంతా క్షేమం: ఇండియన్ ఎంబసీ ఫ్రాన్స్‌లోని భారత దౌత్య కార్యాలయం ఈ పరిణామంపై స్పందించింది. ఫ్రెంచ్ అధికారులు తమకు సమాచారం అందించారని, తాము దర్యాప్తు జరుపుతున్నామని, ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే వీళ్ల ప్రయాణ ఏర్పాట్లపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది. French authorities informed us of a plane w/ 303 people, mostly Indian origin, from Dubai to Nicaragua detained on a technical halt at a French airport. Embassy team has reached & obtained consular access. We are investigating the situation, also ensuring wellbeing of passengers. — India in France (@IndiaembFrance) December 22, 2023 ఫ్రాన్స్ చట్టాల ప్రకారం.. అక్కడి చట్టాల ప్రకారం.. ఫ్రాన్స్ గడ్డపై అడుగుపెట్టిన ఒక విదేశీయుడ్ని ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడి భద్రతా బలగాలు నాలుగు రోజుల దాకా ఎటూ కదలనీయకుండా చేయొచ్చు. అక్కడి న్యాయమూర్తులు గనుక అనుమతిస్తే.. మరో ఎనిమిది రోజులు, అసాధారణ పరిస్థితుల్లో మరో ఎనిమిది రోజులు.. గరిష్టంగా 26 రోజులపాటు తమ అదుపులో ఉంచుకోవచ్చు. -
Miss Universe 2023: విశ్వసుందరి పలాసియోస్
న్యూఢిల్లీ: నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం దక్కించుకుంది. నికరాగ్వా నుంచి ఒకరికి ఈ అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. 72వ ఎడిషన్ మిస్ యూనివర్స్ పోటీలు శనివారం రాత్రి ఎల్ సాల్వెడార్‌లోని శాన్ సాల్వెడార్లో జోస్ అడాల్ఫో పినెడా ఎరేనాలో ఘనంగా జరిగాయి. ఫస్ట్ రన్నరప్‌గా మిస్ థాయ్‌లాండ్ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్ రన్నరప్‌గా మిస్ ఆ్రస్టేలియా మొరాయా విల్సన్ నిలిచారు. విశ్వ సుందరిగా నిలిచిన న షెన్నిస్ పలాసియోస్‌కు గతేడాది మిస్ యూనివర్స్ అమెరికా సుందరి ఆర్ బోనీ గాబ్రియెల్ కిరీటం అలంకరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. నికరాగ్వాలోని మనాగ్వాకు చెందిన 23 ఏళ్ల పలాసియోస్ మానసిక ఆరోగ్య కార్యకర్తగా బాధితులకు సేవలందిస్తున్నారు. ఆడియో విజువల్ ప్రొడ్యూసర్‌గానూ పని చేస్తున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ పోటీల్లో 84 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. భారత్ నుంచి మిస్ ఇండియా శ్వేత శారద పోటీపడ్డారు. ఆమె టాప్–20 జాబితాలో స్థానం దక్కించుకున్నారు. -
ప్రపంచ సుందరిగా ఎంపికైన నికరాగ్వా భామ!
మిస్ యూనివర్స్ 2023 టైటిల్‌ను నికరాగ్వా భామ నిలిచింది. నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ ఈ ఏడాది ప్రపంచసుందరిగా ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల్లో ఎంతో ప్రాముఖ్యత సొంతం చేసుకున్న 'మిస్ యూనివర్స్' కిరీటం షెన్నిస్ దక్కించుకుంది. కాగా.. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ప్రపంచసుందరి కిరీటాన్ని ఆమెకు అలంకరించారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు విశ్వ సుందరికి నెటిజన్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. శాన్ సాల్వడార్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో దాదాపు 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు. మన దేశం తరఫున ఈ పోటీల్లో శ్వేతా శార్దా పాల్గొన్నారు. MISS UNIVERSE 2023 IS @sheynnispalacio !!!! 🇳🇮👑@mouawad #72ndMISSUNIVERSE #MissUniverse2023 pic.twitter.com/mmR90DJ16m — Miss Universe (@MissUniverse) November 19, 2023 -
అక్కడ బాక్సింగ్ మొదలైంది...
మనాగ్వా (నికరాగ్వా): కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ ఈవెంట్లు నిరవధిక వాయిదా పడిన తరుణంలో... సెంట్రల్ అమెరికా దేశం నికరాగ్వాలో మాత్రం బాక్సింగ్ పోటీలు శనివారం తిరిగి మొదలయ్యాయి. దేశ రాజధాని అయిన మనాగ్వాలో జరిగిన ఎనిమిది బౌట్లను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఈ బౌట్లకు వేదికగా నిలిచిన అలెక్సిస్ అర్గొయె జిమ్‌లో 8 వేల సీటింగ్ సామర్థ్యం ఉండగా... 10 శాతం మందే ప్రత్యక్షంగా వీక్షించారు. బౌట్లను తిలకించేందుకు వచ్చిన వారు భౌతిక దూరం పాటించారు. తమది పేద దేశమని బాక్సర్లకు పూట గడవాలంటే వారు బౌట్లో అడుగుపెట్టాల్సిందేనని టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. దాంతో పాటు తమకు కరోనా అంటే భయం లేదని కూడా వారన్నారు. -
నికరాగ్వాలో ఉల్కాపాతం!
మనాగ్వా విమానాశ్రయం వద్ద భారీ పేలుడు 12 మీటర్ల గొయ్యి.. నగరంలో ప్రకంపనలు భూమిని దాటిన గ్రహశకలం వల్లే ఉల్కాపాతం? మనాగ్వా: ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న నికరాగ్వాలో శనివారం అర్ధరాత్రి భారీ ఉల్కాపాతం సంభవించింది. నికరాగ్వా రాజధాని మనాగ్వాలోని విమానాశ్రయం సమీపంలో చెట్ల మధ్య జరిగిన పేలుడు ధాటికి 12 మీటర్ల వెడల్పైన గొయ్యి ఏర్పడింది. ఆ వెంటనే నగరంలో రెండు సార్లు ప్రకంపనలు వచ్చాయి. నింగి నుంచి వేగంగా దూసుకొచ్చిన ఉల్క నేలను ఢీకొట్టడం వల్లే ఈ పేలుడు, గొయ్యి ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఉల్క గాలిలోనే మండిపోయిందా? లేక నేలలోకి చొచ్చుకుపోయిందా? అన్నది ఇంకా తేలలేదని అధికారులు చెప్పారు. ఉల్క దట్టమైన చెట్ల మధ్య పడటంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. పేలుడు సంభవించిన వెంటనే ఏదో మండినట్లు వాసన వచ్చిందని, గాలిలో దుమ్ము, ఇసుక ఎగిసిపడిందని స్థానికులు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి న్యూజిలాండ్ మీదుగా 40 వేల కి.మీ. సమీపం నుంచి భూమిని దాటిపోయిన ‘2014 ఆర్సీ’ గ్రహశకలంముక్కే మనాగ్వాలో పడి ఉంటుందని నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీ ఖగోళ పరిశోధకుడు డాన్ బ్రౌన్ చెప్పారు. 60 అడుగుల సైజుతో ఉన్న ఆ గ్రహశకలం భూమిని దాటడానికి ముందే దాని ముక్క భూమిని తాకడం విచిత్రంగా ఉన్నా.. భూమి స్థానం మారడం వల్లే అలా జరిగి ఉంటుందన్నారు. కాగా స్పెయిన్‌లో గల బార్సిలోనా పట్టణం గగనతలంపై కూడా ఆదివారం సాయంత్రం ఓ ఉల్క భారీ ప్రకాశంతో మండిపోయింది.