నికరాగ్వాలో ఉల్కాపాతం!
మనాగ్వా విమానాశ్రయం వద్ద భారీ పేలుడు
12 మీటర్ల గొయ్యి.. నగరంలో ప్రకంపనలు
భూమిని దాటిన గ్రహశకలం వల్లే ఉల్కాపాతం?
మనాగ్వా: ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న నికరాగ్వాలో శనివారం అర్ధరాత్రి భారీ ఉల్కాపాతం సంభవించింది. నికరాగ్వా రాజధాని మనాగ్వాలోని విమానాశ్రయం సమీపంలో చెట్ల మధ్య జరిగిన పేలుడు ధాటికి 12 మీటర్ల వెడల్పైన గొయ్యి ఏర్పడింది. ఆ వెంటనే నగరంలో రెండు సార్లు ప్రకంపనలు వచ్చాయి. నింగి నుంచి వేగంగా దూసుకొచ్చిన ఉల్క నేలను ఢీకొట్టడం వల్లే ఈ పేలుడు, గొయ్యి ఏర్పడినట్లు భావిస్తున్నారు. ఉల్క గాలిలోనే మండిపోయిందా? లేక నేలలోకి చొచ్చుకుపోయిందా? అన్నది ఇంకా తేలలేదని అధికారులు చెప్పారు. ఉల్క దట్టమైన చెట్ల మధ్య పడటంతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది.
పేలుడు సంభవించిన వెంటనే ఏదో మండినట్లు వాసన వచ్చిందని, గాలిలో దుమ్ము, ఇసుక ఎగిసిపడిందని స్థానికులు తెలిపారు. అయితే ఆదివారం రాత్రి న్యూజిలాండ్ మీదుగా 40 వేల కి.మీ. సమీపం నుంచి భూమిని దాటిపోయిన ‘2014 ఆర్‌సీ’ గ్రహశకలంముక్కే మనాగ్వాలో పడి ఉంటుందని నాటింగ్‌హామ్ ట్రెంట్ వర్సిటీ ఖగోళ పరిశోధకుడు డాన్ బ్రౌన్ చెప్పారు. 60 అడుగుల సైజుతో ఉన్న ఆ గ్రహశకలం భూమిని దాటడానికి ముందే దాని ముక్క భూమిని తాకడం విచిత్రంగా ఉన్నా.. భూమి స్థానం మారడం వల్లే అలా జరిగి ఉంటుందన్నారు. కాగా స్పెయిన్‌లో గల బార్సిలోనా పట్టణం గగనతలంపై కూడా ఆదివారం సాయంత్రం ఓ ఉల్క భారీ ప్రకాశంతో మండిపోయింది.